కరోనా కోరల్లో బొమ్మలాట.. పిల్లల కోసం ప్రత్యేక ఏర్పాటు!

ABN , First Publish Date - 2020-09-18T16:14:59+05:30 IST

మామూలుగా హాస్పిటల్‌ వార్డు అనగానే.. పేషెంట్ల కోసం బెడ్లు, హడావుడిగా తిరుగుతుండే డాక్టర్లు, నర్సులు.. ఈ దృశ్యాలే మన కళ్ల ముందు మెదులుతాయి. అక్కడ ఉండే ప్రతి పేషెంట్‌కూ తాము అనారోగ్యంతో ఉన్నామనే విషయం ఎప్పటికప్పుడు గుర్తుచేస్తూనే ఉంటాయీ దృశ్యాలు.

కరోనా కోరల్లో బొమ్మలాట.. పిల్లల కోసం ప్రత్యేక ఏర్పాటు!

న్యూఢిల్లీ: మామూలుగా హాస్పిటల్‌ వార్డు అనగానే.. పేషెంట్ల కోసం బెడ్లు, హడావుడిగా తిరుగుతుండే డాక్టర్లు, నర్సులు.. ఈ దృశ్యాలే మన కళ్ల ముందు మెదులుతాయి. అక్కడ ఉండే ప్రతి పేషెంట్‌కూ తాము అనారోగ్యంతో ఉన్నామనే విషయం ఎప్పటికప్పుడు గుర్తుచేస్తూనే ఉంటాయీ దృశ్యాలు. ఈ విషయాన్ని పెద్దవాళ్లు పెద్దగా పట్టించుకోరు. కానీ పిల్లల మాటేంటి? ఇలాంటి వార్డులు చూడగానే వారి మనసుల్లో 'మేం రోగులం' అనే ముద్ర పడిపోతుంది. ఇది వారి మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది. తద్వారా కోలుకోవడం కూడా ఆలస్యం అవుతుంది.


ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచంలో విలయం సృష్టిస్తోంది. చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రజలంతా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. అయితే చిన్నపిల్లలపై ఈ వైరస్ ప్రభావం మరీ ఎక్కువగా ఉంటోంది. కరోనా సోకిన పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో వైరస్‌తో బాధపడుతున్న పిల్లలను మానసికంగా హుషారుగా ఉంచాలని అనుకుందో ఆస్పత్రి. అంతే వారి కోసం ప్రత్యేకంగా ఓ వార్డు ఏర్పాటు చేసేసింది. ఇది మామూలు ఆస్పత్రి వార్డనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే.. ఇది పిల్లల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్లేరూమ్ వార్డు. దీనిలో ఒక్క ప్లేరూమే కాదు. జారుడు బల్లలు, ఉయ్యాల.. వంటి ఏర్పాట్లతో ఓ పార్కు కూడా ఉంది.


పిల్లలు సంతోషంగా ఆడుకోవడానికి అవసరమయ్యే బొమ్మలన్నింటినీ ఈ వార్డులో ఉంచారు. దీంతో కరోనా సోకిన పిల్లలంతా కలిసి ఇక్కడ చక్కగా ఆటలాడుకుంటున్నారు. ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన లోక్ నాయక్ హాస్పిటల్ ఈ సరికొత్త ఆలోచన చేసింది. కరోనా సోకిన పిల్లలు తల్లిదండ్రులకు దూరంగా ఉండాల్సి వస్తుందని, ఆ సమయంలో పిల్లలు బాగా ఏడుస్తున్నారని ఆస్పత్రి వైద్యులు చెప్పారు. ఈ మహమ్మారి కారణంగా పిల్లల జీవితాలు మారిపోవడం తమను చాలా బాధించిందని, వారిని ఎలాగైనా సంతోషపెట్టాలనే ఉద్దేశ్యం నుంచే ఈ ఐడియా పుట్టిందని డాక్టర్లు వివరించారు.


ఆస్పత్రిలో కరోనా సోకిన పిల్లలే కాదు. తల్లిదండ్రులకు కరోనా సోకడంతో ఒంటరైన పిల్లలు కూడా ఇక్కడే ఉంటున్నారు. అలాంటి వారికోసం మరో ప్రత్యేక వార్డు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్‌, హరియాణా, పంజాబ్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన పేషెంట్లు కూడా ఆస్పత్రిలో ఉన్నారని, అలాంటి పేషెంట్ల పిల్లల కోసం కూడా ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశామని వైద్యులు వెల్లడించారు. ఇప్పటి వరకు తమ ఆస్పత్రిలో 415మంది పిల్లలు కరోనా చికిత్స తీసుకుంటున్నట్లు తెలియజేశారు. ఈ పిల్లలందరికీ బోర్ కొట్టకుండా ఉందేందుకు ఈ వార్డుల్లో 7 టీవీలు ఏర్పాటు చేశారు. వీటిలో ఏకధాటిగా కార్టూన్ చానెల్స్ ప్లే అవుతున్నాయి.


ఈ కొత్త వార్డులను ఆస్పత్రిలోని పీడియాట్రిక్ విభాగంలో ఏర్పాటు చేశారు. ఏ సమయంలోనైనా కనీసం 30-40 మంది పిల్లలను ఈ ప్రత్యేక వార్డులో ఉంచవచ్చు. కరోనా సోకిన పేషెంట్లతోపాటు, వైరస్ సోకిన పిల్లల తల్లిదండ్రులు కూడా ఆస్పత్రి నిర్ణయాన్ని కొనియాడారు. పిల్లల ఆరోగ్యం, మానసిక స్థితిపై తాము చాలా ఆందోళన చెందేవాళ్లమని, కానీ ఈ ప్రత్యేక వార్డు కారణంగా తమ ఆందోళనలు సగానికి సగం తగ్గిపోయాయని సంతోషం వ్యక్తంచేశారు.

Updated Date - 2020-09-18T16:14:59+05:30 IST