నాలా.. ముంపు అలా..!

ABN , First Publish Date - 2020-06-06T11:00:13+05:30 IST

మహానగరంలో రహదారులు గోదారుల్లా మారడానికి వరద నీటి ప్రవాహ వ్యవస్థ కారణమైతే.. బస్తీలు, కాలనీలు నాలాలు

నాలా.. ముంపు అలా..!

పూడికతీస్తున్నా కనిపించని ప్రయోజనం

రూ.43.38 కోట్లతో పనులు

3.75 లక్షల క్యూబిక్‌ మీటర్ల వ్యర్థాలు తొలగింపు

తొలగించాల్సింది మరో లక్ష

మాన్‌సూన్‌కు ప్రత్యేక ప్రణాళిక

ప్రత్యేక బృందాలు.. పంపింగ్‌కు మోటార్లు


హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): మహానగరంలో రహదారులు గోదారుల్లా మారడానికి వరద నీటి ప్రవాహ వ్యవస్థ కారణమైతే.. బస్తీలు, కాలనీలు నాలాలు ఉప్పొంగి నీట మునుగుతున్నాయి. వర్షాకాలానికి ముందే యేటా పూడిక తీస్తోన్నా.. ఎందుకీ దుస్థితి..? అంటే జీహెచ్‌ఎంసీ అధికారులు తెలివిగా సమాధానం చెప్తారు. మురుగు, వాన నీటి ప్రవాహం ఉండే నాలాల్లో రోజూ వ్యర్థాలు పేరుకుపోతూనే ఉంటాయి.. పారే నీటితో చెత్తాచెదారం కొట్టుకు రావడం సాధారణమే అంటారు. నాలాల పూడికతీత పేరిట కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా.. ప్రయోజనం మాత్రం కనిపించడం లేదు. వర్షం పడిందంటే ఎప్పటి దుస్థితే. లక్షల క్యూబిక్‌ మీటర్ల వ్యర్థాలు తొలగిస్తున్నా.. యేటి కేడు పేరుకుపోతున్న వ్యర్థాల పరిమాణం పెరుగుతోంది. ఈ సంవత్సరానికి సంబంధించి రూ.43.38 కోట్ల అంచనా వ్యయంతో 4.79 లక్షల క్యూబిక్‌ మీటర్ల పూడికను తొలగించేందుకు 345 పనులను చేపట్టింది.


702 కి.మీల మేర ఇప్పటి వరకు 3.75 లక్షల క్యూబిక్‌ మీటర్ల వ్యర్థాలు తొలగించినట్టు జీహెచ్‌ఎంసీ వర్గాలు తెలిపాయి. మరో వారం రోజుల్లో మిగతా వ్యర్థాల తొలగింపు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే అడపాదడపా వర్షాలు కురుస్తోన్న నేపథ్యంలో పూడికతీతలో జాప్యంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మాన్‌సూన్‌ మొదలయ్యే వరకు ఉద్దేశపూర్వక జాప్యం చేసి.. వానలు మొదలైన అనంతరం వ్యర్థాల తొలగింపును మమ అనిపిస్తున్నారన్న అభి ప్రాయం వ్యక్తమవుతోంది. వరద ముంపును నివారించేందుకు 2019లో ఏకంగా రూ.102 కోట్లు ఖర్చు చేశారు. 439 పనుల ద్వారా నాలాల విస్తరణ, ఆధునీకీకరణ, పూడికతీత పనులు చేపట్టారు. 


మాన్‌సూన్‌ ప్రణాళిక.. 

వర్షాకాలం నేపథ్యంలో ఎదురయ్యే ఇబ్బందులను ఎదుర్కొనేందుకు మాన్‌సూన్‌ యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించింది జీహెచ్‌ఎంసీ. సమస్యాత్మక ప్రదేశాల్లో 89 స్టాటిక్‌, 118 మినీ మొబైల్‌ ఎమర్జెన్సీ, 79 మొబైల్‌ ఎమర్జెన్సీ బృందాలను ఏర్పాటు చేసినట్టు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వానాకాలంలో 24 గంటలపాటు నిర్ణీత ప్రాంతాల్లో బృందాలు అందుబాటులో ఉంటాయి. క్షేత్రస్థాయి అధికారులు, బృందాలతో సమన్వయం చేసేందుకు జోన్‌కు ఒకటి చొప్పున ఎమర్జెన్సీ బృందం పని చేయనుంది.


రోడ్లపై నిలిచిన నీటిని నాలాలు, డ్రెయిన్లలోకి పంప్‌ చేసేందుకు 202 మోటార్లు సిద్ధం చేశారు. కూలిన చెట్లు, పురాతన భవనాల శిథిలాలు తొలగించేందుకు 16 డీఆర్‌ఎఫ్‌ బృందాలు పని చేస్తాయి. 195 నీటి ముంపు ప్రాంతాలను గుర్తించి 157 చోట్ల పనులు పూర్తి చేసినట్టు ఓ అధికారి తెలిపారు. 38 ప్రాంతాలు గ్రేటర్‌ ఆవల ఉన్నాయని, అక్కడ సమస్యను సంబంధిత విభాగాలు పరిష్కరించాల్సి ఉంటుందని చెప్పారు. వర్షపు నీరు భూమిలోకి ఇంకేలా 44 ప్రాంతాల్లో ఇంజక్షన్‌ బోర్‌ వెల్స్‌ వేశారు. తద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయన్నది జీహెచ్‌ఎంసీ వర్గాల అభిప్రాయం. 


Updated Date - 2020-06-06T11:00:13+05:30 IST