బ్రిస్బేన్: కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకోని ప్రపంచ నెంబర్‌వన్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్‌కు ఆస్ట్రేలియా ఓపెన్‌లో పాల్గొనేందుకు ప్రత్యేక అనుమతి ఇవ్వడాన్ని టెన్నిస్ ఆటగాళ్లతోపాటు ఆస్ట్రేలియా ప్రజలు విమర్శిస్తున్నారు. ఈనెల 17న ప్రారంభం కానున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ బరిలో దిగేందుకు నిర్వాహకులు తనకు ప్రత్యేక అనుమతి ఇచ్చారని జొకో మంగళవారం వెల్లడించిన సంగతి తెలిసిందే. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారికి, కొవిడ్ వ్యాక్సిన్ తొలి డోసు వేసుకోవడంతో దుష్పరిణామాలు తలెత్తినవారికి, గత ఆరు నెలల్లో కరోనా బారిన పడిన వారికి మాత్రమే..వ్యాక్సిన్ నుంచి మినహాయింపు ఇస్తున్నారు. మరి ఈ మూడు కారణాలతో వేటివల్ల తాను వ్యాక్సిన్ నుంచి మినహాయింపు పొందాడో జొకో వెల్లడించాలని ఆస్ట్రేలియా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మూడింటిలో ఒకదానిని కూడా చూపలేకపోతే జొకోను మెల్‌బోర్న్‌నుంచి స్వదేశానికి పంపించి వేస్తామని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ బుధవారం స్పష్టంజేశారు.