Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Mon, 04 Jul 2022 00:02:49 IST

లీజు భూములపై నజర్‌

twitter-iconwatsapp-iconfb-icon
లీజు భూములపై నజర్‌ప్రైవేటు వ్యక్తికి 15 సంవత్సరాలకు గాను లీజుకు ఇచ్చిన హనుమకొండ బస్‌స్టేషన్‌ సమీపంలో స్పోర్ట్స్‌ అథారిటీ స్థలంలోని వాణిజ్య సముదాయం, లీజుకు ఇచ్చిన దేవాదాయశాఖ స్థలంలో వెలిసిన పెట్రోల్‌ బంక్‌

అద్దెకిచ్చిన స్థలాలపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం
నివేదిక పంపించాలని రెవెన్యూ అధికారులకు ఆదేశం
ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా సర్వే చేస్తున్న అధికారులు
పరిశీలనలో వెలుగు చూస్తున్న అవకతవకలు
కొన్ని చేతులు మారగా, మరికొన్ని భూములు కబ్జా
అక్రమార్కుల్లో మొదలైన గుబులు


రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థలు, రాష్ట్ర కార్పొరేషన్లు, కేంద్ర, రాష్ట్రప్రభుత్వ రంగ సంస్థలు, కంపెనీలు, అసోసియేషన్లు, ప్రైవేటు వ్యక్తులకు వివిధ సందర్భాల్లో భూములను లీజుకు ఇచ్చింది. ఈ భూములపై సర్కారు దృష్టి సారించింది. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి..? ఏ పరిస్థితుల్లో ఉన్నాయి..? ఎంత విస్తీర్ణంలో ఉన్నాయనే కోణంలో ఆరా తీస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలో వివిధ సంస్థలు, వ్యక్తులకు లీజుకిచ్చిన స్థలాలపై ప్రభుత్వం ఇటీవల రెవెన్యూ అధికారులతో క్షేత్రస్థాయిలో విచారణ జరిపించింది. అత్యవసరంగా వాటి వివరాలు పంపాలని కలెక్టర్లను ఆదేశించింది. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని రెవెన్యూ అధికారులు లీజు భూములపై గత నెల మొదటి వారంలో  ఆరా తీసి ప్రత్యేక ఫార్మాట్‌లో నివేదికను ప్రభుత్వానికి పంపించేశారు. అయితే లీజుకిచ్చిన భూముల వివరాలను సేకరించి వాటిని విక్రయించి ఆదాయం పెంచుకునేందుకే ప్రభుత్వం వాటిపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది.

హనుమకొండ, జూలై 3 (ఆంధ్రజ్యోతి): హనుమకొండ, వరంగల్‌, జనగామ, మహబూబాబాద్‌, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో వేలాది ఎకరాల సర్కారు భూములను వివిధ సంస్థలు, వ్యక్తులకు ప్రభుత్వం లీజుకు ఇచ్చింది. ఇప్పుడు వీటి తాజా పరిస్థితిని తెలుసుకోవాల్సిందిగా కలెక్టర్లు  తహసీల్దార్లను ఆదేశించారు. దీనితో రంగంలోకి దిగిన తహసీల్దార్లు.. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం రెవెన్యూ సిబ్బంది గ్రామం, సర్వే నెంబరు, విస్తీర్ణం, లీజు లక్ష్యం, సంబంధిత ఎనిమిది అంశాల వారీగా వివరాలను సేకరించారు. గత నెల 10వ తేదీన లీజు భూములపై నివేదికలను తహసీల్దార్లు కలెక్టర్లకు సమర్పించారు. కలెక్టర్లు వాటిని ప్రభుత్వానికి అందచేశారు. వీటిపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందనేది ఇంకా స్పష్టం కాలేదు. నివేదికలు అందచేసి దాదాపు నెలకావొస్తోంది. రెవెన్యూశాఖ ఉన్నతాధికారులు ఈ నివేదికలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు సమాచారం.

క్షేత్రస్థాయిలో..
ఉమ్మడి జిల్లాలోని పట్టణ ప్రాంతాలు, వరంగల్‌ నగర పాలక సంస్థ, తొమ్మిది మునిసిపాలిటీల పరిధిలోని వాటికి చెందిన స్థలాలు, సర్కార్‌ భూములతో పాటు ఖనిజ వనరులు, గ్రానైట్‌ గనులు ఉన్న ప్రాంతాలు, దేవాదాయ శాఖకు చెందిన భూములను రెవెన్యూ అధికారులు క్షుణ్ణంగా సర్వే చేశారు. అంతకుముందే భూములను లీజుకు ఇచ్చే అవకాశం ఉన్న దాదాపు అన్ని ప్రభుత్వ శాఖలు తమ పరిధిలో ఎవరెవరికి ఎన్ని  భూములను లీజుకు ఇచ్చింది.. వాటి తాజా పరిస్థితిపై నివేదికలను కలెక్టర్లు కోరారు. ఈ నివేదికల ఆధారంగా తహసీల్దార్లు రంగంలోకి దిగి కింది స్థాయి సిబ్బందితో క్షేత్ర పరిశీలన జరిపారు. రెవెన్యూ ఇన్స్‌పెక్టర్లు వీఆర్‌ఏలు, గిర్దావర్లు, సర్వేయర్లు లీజుకు ఇచ్చిన భూములను సర్వే నెంబర్ల వారీగా రికార్డులను సేకరించారు. లీజుకు ఎప్పుడు తీసుకున్నది? ఎందుకు తీసుకున్నది? లీజుకు తీసుకున్న ఉద్దేశం ఏమిటీ? అందుకే ఆ భూములను వినియోగిస్తున్నారా? లేదా ఇతరత్రా వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుతున్నారా? లేక లీజుకు తీసుకున్న భూమిని అదనపు ఆదాయార్జన కోసం ఇతరులకు సబ్‌లీజుకు ఇచ్చారా? లీజుకు తీసుకున్న భూమి కబ్జాకు గురైందా? లేదా లీజు గడువు ముగిసిందా? ముగిసినా కూడా కిందిస్థాయి అధికారులతో కుమ్మక్కె దానిని ఇంకా తమ ఆధీనంలోనే ఉంచుకున్నారా? లీజుకు తీసుకున్న భూమి ప్రస్తుతం మార్కెట్‌ ప్రకారం ఎంత విలువ ఉంటుంది? ఆ భూమి కోర్టు వివాదాల్లో ఉందా? తదితర వివరాలను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. లీజుకు తీసుకున్న వారికి నోటీసులు పంపించి విచారించారు. ముఖ్యంగా లీజు గడువు పూర్తికావస్తున్న, పూర్తయిన భూములను ప్రత్యేకంగా గుర్తించారు. జిల్లా, మండల, పట్టణ కేంద్రాల్లో లీజుకు ఇచ్చిన ప్రభుత్వ భూములపై ప్రత్యేక దృష్టి  సారించారు.

వెలుగుచూస్తున్న అక్రమాలు

లీజు భూముల పరిశీలన సందర్భంగా అనేక ఆసక్తికరమైన అంశాలు రెవెన్యూ అధికారుల దృష్టికి వచ్చాయి. ముఖ్యంగా వరంగల్‌ నగర పాలక సంస్థ పరిధిలోని ముఖ్య కూడళ్లలో పలువురు వ్యాపారులు దుకాణాల సముదాయాలు నిర్మించుకునేందుకు, పెట్రోల్‌ బంకుల ఏర్పాటుకు 40, 50 యేళ్ల కిందట ప్రభుత్వ స్థలాలను లీజుకు తీసుకున్నారు. ప్రతీసారి లీజు గడువు పెంచుకుంటూ వస్తున్నారు. లీజు గడువు ముగిసినా వాటిని దొడ్డిదారిన తమ సొంతం చేసుకున్నారు. ప్రైవేటు వ్యక్తులు వీటిని తక్కువ ధరకు లీజుకు తీసుకోగా ఆ తర్వాత కాలంలో అధికారులు ఈ భూముల గురించి పట్టించుకోకపోవడంతో సదరు వ్యక్తలు లీజు గడువును  పెంచుకోవడం అటుంచి లీజు బకాయిలను చెల్లించడం కూడా మానేశారు. అలాగే ఉమ్మడి జిల్లాలో వివిధ కార్పొరేషన్లు, సంస్థలు, అసోసియేషన్లు, ప్రైవేటు వ్యక్తులు తాము పొందిన లీజు భూములను నిర్దేశిత లక్ష్యానికి వినియోగించడం లేదని తెలుస్తోంది. భూములు తీసుకున్న కొన్ని సంస్థలు, వ్యక్తులు వాటిని ఇతర సంస్థల పేర్లపైకి మార్చాయనే ఆరోపణలు ఉన్నాయి. లక్ష్యం మేరకు వాటిని వినియోగించడం లేదు. లీజుల గుప్పిట్లో ఎన్నివేల ఎకరాలు ఉన్నది  కలెక్టర్లకు అందే నివేదికలను బట్టి లెక్కతేలుతోంది. వరంగల్‌ నగరంలో దేవాదాయ శాఖకు చెందిన కొన్ని భూములు 50 యేళ్ల నుంచి లీజు గుప్పిట్లో ఉన్నాయి.

అక్రమార్కుల్లో గుబులు
లీజు మాటున ప్రభుత్వ భూములను సొంతం చేసుకొని దర్జాగా అనుభవిస్తున్న అక్రమార్కుల గుండెల్లో గుబులు రేపుతోంది. ఇన్నాళ్లు అధికారులతో కుమ్మక్కె తక్కువ ధరకు లీజుకు భూములను  తీసుకొని వాటిని ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్న వ్యవహారం విచారణలో ఎక్కడ బయటపడుతుందోనని కలవర పడుతున్నారు. లీజు గడువు ముగిసినప్పటికీ రెన్యూవల్‌ చేయించుకోకుండా, లీజు బకాయిలు చెల్లించకుండా ఎగ్గొడుతున్నవారి బాగోతం కూడా పరిశీలనలో బయటపడనున్నది. రాజకీయంగా పలుకుబడి కలిగిన పలువురు నేతలు విలువైన ప్రభుత్వ స్థలాలను లీజుకు తీసుకొని వాటిని సొమ్ము చేసుకోవడమో, నిబంధనలకు విరుద్ధంగా ఇతరుల పేరు మీదకు మార్చడమో చేయడం ద్వారా అక్రమార్జనకు పాల్పడ్డారు. వీరిగుట్టంతా రట్టుకానున్నది. పారిశ్రామిక యూనిట్ల స్థాపన కోసం ప్రభుత్వ భూములను లీజుకు తీసుకున్నప్పటికీ ఇప్పటి వరకు వాటిలో పరిశ్రమలు స్థాపించకుండా పడావుపెట్టిన వ్యవహారం కూడా బహిర్గతం అయినట్టు తెలుస్తోంది. ఈ భూములన్నిటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుండడంతో లీజుదారులు ఆందోళన చెందుతున్నారు. తమ వ్యవహారం బయటపడకుండా ఉండేందుకు కొందరు అధికారులను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది.

అమ్మకం కోసమేనా?
భూముల అమ్మకం ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలనుకుంటున్న ప్రభుత్వం.. ఇప్పుడు తాజాగా  లీజు భూములపై దృష్టి సారించింది. స్థిరాస్తి రంగం  జోరందుకుంటున్న నేపథ్యంలో ఆయా భూముల్లో ప్రభుత్వమే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయాలనుకుంటోంది. నిబంధనలను ఉల్లంఘించిన లీజుదారులను గుర్తించి భూములను వెనక్కి తీసుకోవడమా లేదా మరింత ఆదాయం వచ్చేలా ప్రణాళికను రూపొందించడమా అనే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఆదాయం కోసం ఆ భూములను వేలం వేసే అవకాశం ఉన్నట్టు  తెలుస్తోంది.  మరోవైపు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న పలు ముఖ్యమైన సంస్థలకు కొన్ని జిల్లాల్లో భూమి లభించడం లేదు. వాటికి స్థలాలను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం ఈ చర్య తీసుకుంటున్నట్టు భావిస్తున్నారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.