విస్తళ్లకు ప్రత్యేకం.. మక్తాభూపతిపూర్‌

ABN , First Publish Date - 2022-05-22T05:56:10+05:30 IST

పూర్వం నుంచి నేటి ఆధునిక యుగం వరకు మోదుగ ఆకులతో కుట్టిన విస్తళ్లకు ఆదరణ ఏమాత్రం తగ్గలేదనేది జగమెరిగిన సత్యం.

విస్తళ్లకు ప్రత్యేకం.. మక్తాభూపతిపూర్‌
విస్తళ్ల తయారీలో నిమగ్నమైన మహిళలు

ఉపాధి పొందుతున్న గ్రామస్థులు 

విస్తళ్ల వ్యాపారానికి ఆదరణ 

మోదుగ ఆకుల్లో భోజనం ఆరోగ్యానికి మేలు

మెదక్‌ కల్చరల్‌, మే 21: పూర్వం నుంచి నేటి ఆధునిక యుగం వరకు మోదుగ ఆకులతో కుట్టిన విస్తళ్లకు ఆదరణ ఏమాత్రం తగ్గలేదనేది జగమెరిగిన సత్యం. ఆరోగ్యంతో పాటు ఆర్థికంగా కూడా లాభదాయకమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  ఉదయం అల్పాహారం మొదలు విందు భోజనాల వరకు ఇళ్లలో మొదుగ విస్తరాకులను వాడేందుకు ఎంతో మంది ఇష్టపడతారు. మోదుగ ఆకుతో విస్తళ్ల వ్యాపారం పేదోళ్లకు ఉపాధితో పాటు ప్రజలకు ఆరోగ్యం కల్పిస్తుందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. 

  

చుట్టు పక్కల జిల్లాల్లో అమ్మకాలు

మెదక్‌ మండలంలోని మక్తాభూపతిపూర్‌  గ్రామంలో మోదుగు విస్తరాకులకు పెట్టింది పేరు. ఇక్కడ ఎంతో మంది విస్తరాకులు కుట్టుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీటిని జిల్లాలోనే కాకుండా చుట్టుపక్కల జిల్లాలైన హైదరాబాద్‌, రంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్‌తో పాటు పక్క రాష్ట్రమైన కర్ణాటక వరకు మోదుగ ఆకులతో కుట్టిన విస్తరాకులను తీసుకెళ్లి అమ్ముతూ ఉపాధి పొందుతున్నారు.   మోదుగు ఆకులతో కుట్టిన విస్తళ్లలో వేడి వేడి భోజనం చేస్తే మంచి రుచితో పాటు ఆరోగ్యం కలుగుతుందని పెద్దలు చెబుతుంటారు.


ఆరోగ్యానికి మేలు

ఆకుపచ్చని విస్తరాకుల్లో భోజనం చేయడం వల్ల కళ్లు, మనసుకు సంతోషాన్ని ఇవ్వడంతో పాటు జీర్ణశక్తి పెరుగుతుందని ఆయుర్వేద వైద్యనిపుణులు చెబుతున్నారు. నాటి రోజుల్లో మోదుగు, అరటి, రావి, మర్రి, బాదం, పసుపు ఆకులను విస్తరాకులుగా కుట్టి వాటిలో భోజనం చేసే వారు. తెలంగాణలోని అటవీ ప్రాంతాల్లో విరివిగా దొరికే మోదుగు ఆకులను మహిళలు సేకరించి, ఎండబెట్టి విస్తళ్లుగా కుట్టి విక్రయించడం అనాదిగా కొనసాగుతున్నది. వన భోజనాల్లో  సైతం మోదుగు ఆకుల విస్తళ్లలో భోజనం చేసేవారు. కానీ నేటి కాలంలో వాటి లభ్యత లేక ప్లాస్టిక్‌ ప్లేట్ల వినియోగం పెరిగిందని పలువురు వాపోతున్నారు.


ఇతర జిల్లాల్లో అమ్ముతున్నా : కర్రోల్ల సిద్ధిరాములు, మక్తా భూపతిపూర్‌ 

మా గ్రామంలో తయారు చేసిన మోదుగు విస్తరాకులు కామారెడ్డి, నిజామాబాద్‌, కర్ణాటక వరకు తీసుకెళ్లి అమ్ముతాను ఒక్కొక్క కట్ట రూ.80 నుంచి రూ.150 వరకు అమ్ముతాను. ఒక్కొక్క కట్టలో 100 ఆకులు ఉంటాయి. వీటిని ఎక్కువగా ఆలయాలు పూజలలో వాడుతారు. 

 

Updated Date - 2022-05-22T05:56:10+05:30 IST