పది పరీక్షలపై ప్రత్యేక దృష్టి

ABN , First Publish Date - 2022-05-22T06:51:23+05:30 IST

జిల్లాలో ఈనెల 23ననుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. వీటి నిర్వహణకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసేందుకు అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, వైద్యం, మరుగుదొడ్లు వంటి సౌకార్యాలు కల్పించనున్నారు. ఈ నెల 23 నుంచి 28 వరకు రాష్ట్ర ప్రభుత్వం సూచించిన సమయానుసారంగా ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పదవ

పది పరీక్షలపై ప్రత్యేక దృష్టి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు 

ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు 

మొత్తం 11,256 మంది విద్యార్థులు 

జిల్లాలో 64 కేంద్రాలు 

ఆదిలాబాద్‌ టౌన్‌, మే 21: జిల్లాలో ఈనెల 23ననుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. వీటి నిర్వహణకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసేందుకు అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, వైద్యం, మరుగుదొడ్లు వంటి సౌకార్యాలు కల్పించనున్నారు. ఈ నెల 23 నుంచి 28 వరకు రాష్ట్ర ప్రభుత్వం సూచించిన సమయానుసారంగా ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పదవ తరగతి వార్షిక పరీక్షలు జరుగనున్నాయి. ఇందుకు జిల్లా వ్యాప్తంగా 64 పరీక్ష కేంద్రాల్లో 11,256 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. అయితే ఆయా పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు సీట్ల కేటాయింపు, పరీక్షల సమయంలో విద్యుత్‌, తాగునీరు, సీసీ కెమెరాలు వైద్య సేవలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే కలెక్టర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యార్థులు పరీక్ష సమయానికి ముందే పరీక్ష కేంద్రానికి వెళ్లే విధంగా రవాణా సౌకర్యానికి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులను సమయానుకూలంగా రిషెడ్డ్యుల్‌ చేయనున్నారు. ఉదయం 8.30గంటల నుంచి విద్యార్థులను పరీక్ష హాల్‌లోకి అనుమతించ డం జరుగుతుందని ఉదయం 9.35గంటలకు పరీక్ష కేంద్రం మెయిన్‌గేటు మూసివేయడం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. విద్యార్థులు, ఇన్విజిలేషన్‌ డ్యూటీలో ఉన్న సిబ్బందికి ఎవరికి కూడా సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ర్టానిక్‌ పరికరాలు అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు.

ఫ పరీక్ష కేంద్రాల ప్రాంతాల్లో 144 సెక్షన్‌

ఈ నెల 23న ప్రారంభంకానున్న పది పరీక్ష నేపథ్యంలో ఎలాంటి మాస్‌ కాపియింగ్‌కు తావులేకుండా అధికారులు ఏర్పాట్లు చేయగా.. కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ ఆదేశాల మేరకు పోలీసు యంత్రాంగం ఆయా పరీక్ష కేంద్రాల ప్రాంతా ల్లో 144 సెక్షన్‌ను విధించనున్నారు. పరీక్షల నిర్వాహణ సమయంలో కేంద్రాల పరిధిలో ఉన్న జిరాక్స్‌ సెంటర్లను సైతం మూసి ఉంచాలని, పరీక్షల సమయంలో అవసరమైన బందోబస్తును పోలీసు యంత్రాంగం ఏర్పాటు చేయనున్నారు. వేసవి దృష్ట్యా ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద ఒక ఏఎన్‌ఎంతో పాటు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, అత్యవసర మందులు ఏర్పాటు చేసి క్యాంపు నిర్వహించనున్నారు. 

ఫ విద్యార్థులకు బస్సు సౌకర్యం

పదో తరగతి పరీక్షలను దృస్టిలో ఉంచుకుని ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు. ఉదయం 7.30గంటల నుంచి ఈ రవాణా సౌకర్యం విద్యార్థులకు అందుబాటులోకి రానుంది. ఇదిలా ఉంటే తాగునీటి సమస్య తలెత్తకుండా మిషన్‌ భగీరథ నీటిని అందుబాటులో ఉంచాలని ఆయా మండల ఆర్‌డబ్ల్యుఎస్‌ ఇంజనీరింగ్‌ అధికారలు ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు హాల్‌టికెట్ల విషయంలో ఎలాంటి సమస్య తలెత్తకుండా పరీక్ష రాసే ప్రతి విద్యార్థికి హాల్‌టికెట్‌ అందే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్‌ జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశించారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో వివరాలను సేకరించి చర్యలు చేపట్టాలని సూచించారు. 

ఫ కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటు

పదో తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నందున జిల్లా వ్యాప్తంగా ఎలాంటి సమస్యలు తెలెత్తిన జిల్లా యంత్రాంగానికి ఎప్పటికప్పుడు తెలియజేయాలని డీఈవో కార్యాలయంలో కంట్రోల్‌రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఇందుకు 08732 -226434కు తమ సమస్యలను తెలియజేయాలని అధికారులు కోరారు. ప్రత్యేక పరిస్థితుల్లో విద్యాశాఖాధికారి ఆదిలాబాద్‌ సెల్‌ నెంబర్‌ 7995087613, పరీక్షల విభాగం సహాయ కమిషనర్‌ వేణుగోపాల్‌ నెంబర్‌ 9618601585లకు సంప్రదించాలని తెలిపారు.


పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి

ఫ వీసీలో విద్యాశాఖ కార్యదర్శి వాకటి కరుణ

ఆదిలాబాద్‌ టౌన్‌: రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 23 నుంచి ప్రారంభంకానున్న పదవ తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని విద్యాశాఖ కార్యదర్శి వాకటి కరుణ అన్నారు. శనివారం కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు సౌకర్యవంతంగా పరీక్షలు రాసేందుకు ఏర్పాట్లు చేయాలని, దూర ప్రాంత విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు ముందస్తుగా చేరుకునేందుకు బస్సుల సమయాలను రీషెడ్యులు చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ మాట్లాడుతూ పదో తరగతి వార్షిక పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చే యడం జరిగిందని, తాగునీరు, విద్యుత్‌, ఫ్యాన్లు, లైట్లు, ఫర్నిచర్లను ఏర్పాటు చేశామన్నారు. ఆయా కేంద్రాల్లో జిల్లా వ్యాప్తంగా 11,256 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని వివరించారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ నటరాజ్‌, రిజ్వాన్‌భాషా, డీఈవో ప్రణీత, తదితరులు పాల్గొన్నారు.

ఏర్పాట్లపై నివేదిక సమర్పించాలి : కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌

పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి నివేదిక సమర్పించాలని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అధికారులను ఆదేశించారు. శనివారం పది వార్షిక పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. ఈనెల 23 నుంచి 28 వరకు టైం టేబుల్‌ ప్రకారం ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జిల్లావ్యాప్తంగా 64 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఇందులో అదనపు కలెక్టర్‌ రిజ్వాన్‌భాషాషేక్‌, అదనపు ఎస్పీ శ్రీనివాస్‌రావు, ఆర్డీవో రాజేశ్వర్‌, డీఈవో ప్రణీత, తదితరులున్నారు. 

జైనథ్‌: మండలంలో సోమవారం నుంచి నిర్వహించే పదో తరగతి పరీక్షలకు సర్వంసిద్ధం చేసినట్లు ఎంఈవో రాచర్ల నారాయణ తెలిపారు. ఇందు కోసం ఐదుగురు చీఫ్‌ సూపరింటెండెంట్లు, ఐదుగురు డిపార్ట్‌మెంటల్‌ అధికారుల, ఒక కస్టోడియన్‌, 51 మంది ఇన్విజిలేటర్లను నియమించారు.

Updated Date - 2022-05-22T06:51:23+05:30 IST