ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి

ABN , First Publish Date - 2022-04-21T05:39:57+05:30 IST

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆజాదీకా అమృత్‌ మహోత్సవంలో భాగంగా ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మెగా హెల్త్‌ క్యాంపులను నిర్వహిస్తున్నారు.

ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి
కామారెడ్డిలో హెల్త్‌క్యాంపు నిర్వహిస్తున్న వైద్యఆరోగ్యశాఖ సిబ్బంది

- జిల్లాలో మెగా ఆరోగ్య వైద్య శిబిరాలకు శ్రీకారం

- వైద్యనిపుణులచే వ్యాధుల గుర్తింపు, అవగాహన, మందుల పంపిణీ

- శస్త్రచికిత్స అవసరమైతే స్పెషాలిటీ ఆసుపత్రులకు సిఫార్సు

- మంగళవారం కామారెడ్డి డివిజన్‌లో మెగా వైద్య శిబిరం

- నేడు, రేపు ఎల్లారెడ్డి, బాన్సువాడలో శిబిరాలు

కామారెడ్డి టౌన్‌, ఏప్రిల్‌ 20: భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆజాదీకా అమృత్‌ మహోత్సవంలో భాగంగా ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మెగా హెల్త్‌ క్యాంపులను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా కామారెడ్డి జిల్లాలో మెగా హెల్త్‌ క్యాంపులను నిర్వహించేందుకు శ్రీకారం చుట్టారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో డివిజన్‌కు సంబంధించిన ప్రజలకు వైద్యనిపుణులచే పరీక్షలు నిర్వహించడంతో పాటు వ్యాధుల గుర్తింపు, అవగాహన, మందుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. శస్త్ర చికిత్సలు, మెరుగైన వైద్యం అవసరమైన వారికి స్పెషాలిటీ ఆసుపత్రులకు సిఫార్సు చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. 

40 ఏళ్లకే రోగాల బారిన పడుతున్న జనం

మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి కారణంగా 40 ఏళ్లకే అనేక మంది షుగర్‌, బీపీ, గుండె సంబంధిత వ్యాధులు, కాలేయ, కిడ్నీ వంటి రోగాల భారిన పడుతున్నారు. కొందరు ఆహారపు అలవాట్లపై అవగాహన లేకపోవడంతో ఆరోగ్య సమస్యలను తెచ్చుకుంటున్నారు. అయితే వీరిలో ఆర్థికంగా ఉన్నవారు మెరుగైన వైద్యం పొందుతుండగా నిరుపేదలు మాత్రం ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులకు స్వస్తి పలకాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ యోచిస్తోంది. ఈ మేరకు ఆజాదీకా అమృత్‌ మహోత్సవంలో భాగంగా ప్రత్యేక ఆరోగ్యమేళాలు నిర్వహించి అనారోగ్యంతో బాధపడుతున్న వారిని గుర్తించి అవసరమైన వైద్య సేవలు అందించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడవచ్చని యోచిస్తోంది. ఈ క్రమంలోనే జిల్లాలో వైద్యఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మెగా హెల్త్‌ క్యాంపుల నిర్వహణ చేపడుతుంది. మంగళవారం కామారెడ్డి డివిజన్‌ పరిధిలోని ప్రజలకు మెగా హెల్త్‌ క్యాంపు నిర్వహించి ఆరోగ్య సమస్యలున్న వారికి అవగాహన, మందులను అందజేశారు. 

అందరికీ ఆరోగ్యసేవలు అందించేలా చర్యలు

కొవిడ్‌ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటి జ్వర సర్వే చేయాలని నిర్ణయం తీసుకోగా జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుని సర్వే పూర్తి చేశారు. చాలా మంది నాన్‌ కమ్యూనికేబుల్‌ డీసీజ్‌తో బాధపడుతున్నట్లు గుర్తించి అవసరమైన మందులు అందజేసింది. ఇంత వరకు బాగానే ఉన్నా ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో ప్రత్యేకంగా ఓ రిజిస్టర్‌ అంటూ లేకపోవడంతో ఆ తర్వాత పర్యవేక్షించడం కొత్తగా వచ్చిన వైద్యసిబ్బందికి ఇబ్బందిగా మారుతోంది. ఇకపై ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని భావించిన వైద్యఆరోగ్యశాఖ ఆన్‌లైన్‌ వేదికగా విలేజ్‌ హెల్త్‌ రిజిస్టర్‌ పేరుతో ఆయా గ్రామాల్లోని ప్రజల ఆరోగ్య పరిస్థితులను నమోదు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే జిల్లాలోని ఆశాలకు స్మార్ట్‌ఫోన్‌లు పంపిణీ చేసింది. తాజాగా జాతీయ ఆరోగ్యపాలసీ లక్ష్యాలకు అనుగుణంగా అందరికీ ఆరోగ్య సేవలందించాలని సంకల్పించి కేంద్రప్రభుత్వం ఆరోగ్యమేళా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

డివిజన్‌ల వారిగా హెల్త్‌ క్యాంపులు

డివిజన్‌ల వారిగా హెల్త్‌ క్యాంపులు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇందులో భాగంగానే మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో మెగా హెల్త్‌ క్యాంపు నిర్వహించగా గురువారం ఎల్లారెడ్డి డివిజన్‌ పరిధిలో, శుక్రవారం బాన్సువాడ డివిజన్‌ పరిధిలో హెల్త్‌ క్యాంపు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, ఆశలు, ఏఎన్‌ఎంలతో ప్రచారం నిర్వహించారు. ఆయా డివిజన్‌ పరిధిలో డిప్యూటీ డీఎంహెచ్‌వోలు సైతం మెడికల్‌ ఆఫీసర్‌లకు దిశా నిర్ధేశం చేశారు. మంగళవారం కామారెడ్డి డివిజన్‌లో నిర్వహించిన హెల్త్‌ క్యాంపులో మొత్తం 2,179 మందికి  జనరల్‌ ఓపీ, కంటి సమస్యలు, ఈఎన్‌టీ, ఎన్‌సీడీ, హోమియో, ఆయుర్వేదిక్‌, ఆర్థో, టీబీ, హెచ్‌ఐవి అవేర్‌నెస్‌, కొవిడ్‌ వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించడంతో పాటు రెండు డోసులు వేసుకోని వారికి అక్కడికక్కడే వ్యాక్సిన్‌ వేశారు.

Updated Date - 2022-04-21T05:39:57+05:30 IST