జిల్లాలో కరోనా నిరోధంపై ప్రత్యేక దృష్టి

ABN , First Publish Date - 2020-08-04T11:24:36+05:30 IST

జిల్లాలో కరోనా కేసులు పెరగకుండా అధికారులు కృషిచేయాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి అన్నారు

జిల్లాలో కరోనా నిరోధంపై ప్రత్యేక దృష్టి

రైతు వేదికల నిర్మాణం వేగవంతం చేయాలి

అధికారులతో ఇన్‌చార్జి కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి


మెదక్‌ రూరల్‌, ఆగస్టు 3 : జిల్లాలో కరోనా కేసులు పెరగకుండా అధికారులు కృషిచేయాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి అన్నారు. సోమవారం ఆయన జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఎన్ని కేసులు నమోదయ్యాయి? ఎంత మంది చికిత్స పొందుతున్నారు? మరణాల సంఖ్య తదితర వివరాలను డీఎంహెచ్‌వో వెంకటేశ్వరావును అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. కరోనా టెస్టుల కోసం వచ్చే వారికి సహకరించాలని, వీలైనంత త్వరగా టెస్టులు పూర్తిచేయాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవసరమైన కిట్లను  అందుబాటులో ఉంచుకోవాలన్నారు. గ్రామాల్లో కేసులు పెరగకుండా డాక్టర్లు, ఏఎన్‌ఎంలు, ఆరోగ్యకార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉన్నతాధికారలు సిబ్బందికి ఎప్పటికప్పుడు తగిన సూచనలు, సహాలు అందించడంతో  అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలన్నారు.


జిల్లావ్యాప్తంగా రైతు వేదికల నిర్మాణంపై ఆయన ఆరా తీశారు. ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్నచోట నిర్మాణాలు వేగవంతం చేయాలని, భూములు లేనిచోట వెంటనే స్థల సేకరణ పూర్తిచేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీనితో పాటు జిల్లాలో జరుగుతున్న పనులకు సంబందించిన వివరాలు సేకరించారు. అంతకుముందు జిల్లా అదనపు కలెక్టర్‌ నగేశ్‌ ఆయనకు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ఉన్నతాధికారులు కలెక్టర్‌ను సన్మానించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో వెంకటేశ్వరావు, డీపీవో హనూక్‌, డీఆర్డీఏ శ్రీనివాస్‌, జిల్లా అధికారులు దేవయ్య, జయరాజ్‌, వెంకటేశ్వర్లు, శ్యాంప్రకాశ్‌, అరుణ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-04T11:24:36+05:30 IST