మాటలు కాదు.. చేతల్లో చూపిస్తా...

ABN , First Publish Date - 2020-05-21T10:38:56+05:30 IST

ఇసుక, మద్యం అక్రమాలు, దందాలు ఇక చెల్లవు. ఇన్నాళ్లు ఎలా జరిగిందో నాకు తెలియదు. ఇక నుంచి అక్రమార్కులపై కొరడా ఝళిపిస్తా. ఏదో మాటలు చెప్పడం

మాటలు కాదు.. చేతల్లో చూపిస్తా...

 ఇసుక అక్రమార్కులపై కొరడా..!

ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు

ఇసుక, మద్యం అక్రమాలకు కళ్లెం వేయమని సీఎం ఆదేశం

బదిలీకి భయపడను

ఇసుక, మద్యం అక్రమాలపై నా ఫోన్‌ నెంబరు 9121100663 చేయండి

సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం

ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ఏఎస్పీ చక్రవర్తి


కడప, మే 20 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఇసుక, మద్యం అక్రమాలు, దందాలు ఇక చెల్లవు. ఇన్నాళ్లు ఎలా జరిగిందో నాకు తెలియదు. ఇక నుంచి అక్రమార్కులపై కొరడా ఝళిపిస్తా. ఏదో మాటలు చెప్పడం కాదు.. చేసి చూపిస్తా. నేను బదిలీకి భయపడను. ఇసుక, మద్యం అక్రమాలకు ఎక్కడా ఆస్కారం ఉండకూడదు, ఎంతటివారినైనా సరే ఉపేక్షించవద్దని సీఎం జగన్‌ స్పష్టమైన ఆదేశాలిచ్చారు.. ఆ దిశగా ముందుకు వెళ్తాను. ఎక్కడైనా ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా జరగుతుంటే నా సెల్‌ నెంబరు: 9121100663 కాల్‌ చేస్తే.. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాను. అని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అదనపు ఎస్పీ కడియం చక్రవర్తి ఆంధ్రజ్యోతి ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆ వివరాలు ఇలా..


ఆంధ్రజ్యోతి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అదనపు ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. ఎలా ఫీల్‌ అవుతున్నారు..? కడపతో అనుబంధం ఉందా..?

అడిషనల్‌ ఎస్పీ: ఇసుక, మద్యం అక్రమాలు పూర్తిగా నిరోధించి పారదర్శకత పాటించే దిశగా సీఎం జగన్‌ స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోను తీసుకొచ్చారు. సీఎం సొంత జిల్లాకు ఆ విభాగం అదనపు ఎస్పీగా రావడం ఆనందంగా ఉంది. కడప జిల్లా పక్కనే ఉన్న జిల్లా కేంద్రం నెల్లూరు నగరం నా జన్మస్థలం. ఇటుపక్క ఉన్న కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ డీఎస్పీగా పనిచేశా. అయితే.. కడపతో అనుబంధం లేదు. తొలిసారిగా జిల్లాలో అదనపు ఎస్పీగా వచ్చాను. ఈ ప్రాంతం కొత్తే.


ఆంధ్రజ్యోతి: పెన్నా, బాహుదా, పాపాఘ్ని నదుల్లో ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. నిర్మూలనకు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు..?:

అడిషినల్‌ ఎస్పీ: జిల్లాకు వచ్చి నాలుగు రోజులైంది. ఎక్కడెక్కడ అక్రమాలు జరుగుతున్నాయో అధ్యయనం చేస్తున్నాను. ఇసుక అక్రమ రవాణా కట్టడికి పక్కా వ్యూహంతో దాడులు చేస్తాం. పట్టుబడితే కేసులు తప్పవు. ముఖ్యంగా ఇసుక అక్రమార్కులపై కొరడా ఝుళిపిస్తాను. 


ఆంధ్రజ్యోతి: రాజకీయ ఒత్తిళ్లు వస్తే ఎలా ఎదుర్కొంటారు..?:

అడిషినల్‌ ఎస్పీ: రాజకీయాలతో నాకు సంబంధం లేదు. ఇసుక, మద్యం అక్రమ రవాణా చేస్తూ పట్టుపడితే అధికార పార్టీనా.. ప్రతిపక్ష పార్టీనా.. ఇతరులా అని చూడను. సీఎం జగన్‌ మార్గదర్శకాల మేరకు ఎంతటివారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఇది మాటలతో చెప్పడం కాదు.. ఆచరణలో చేసి చూపిస్తా.


ఆంధ్రజ్యోతి: అక్రమాలను అడ్డుకుంటే బదిలీ చేయించే ప్రమాదం ఉంది..? కాదంటారా..?

అడిషినల్‌ ఎస్పీ: నేను బదిలీకి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నా. 2010 బ్యాచ్‌ గ్రూప్‌-1లో ఎంపికై డీఎస్పీగా బాధ్యతలు చేపట్టాను. నాటి నుంచి ఎక్కడ కూడా ఏడాది, ఏడాదిన్నరకు మించి పని చేయలేదు. బదిలీకి భయపడితే పని చేయలేం. సీఎం లక్ష్యాలను సాధించలేం. సీఎం జగన్‌ కీలక లక్ష్యాలను నిర్ధేశించి ఇక్కడికి పంపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో దిశానిర్దేశం చేస్తున్నారు. 


ఆంధ్రజ్యోతి: మద్యం మాఫియాపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు..?

అడిషినల్‌ ఎస్పీ: ఇసుక ఒక్కటే కాదు.. మద్యం మాఫియాపై ఉక్కుపాదం మోపుతాం. ఎక్కడైనా మద్యం అక్రమ రవాణా, భారీ స్థాయిలో నాటుసారా తయారు చేస్తున్నట్లు సమాచారం ఉంటే నా ఫోన్‌ నెంబరుకు కాల్‌ చేయవచ్చు. 


వ్యక్తిగత వివరాలు:

పూర్తి పేరు : కడియం చక్రవర్తి

జన్యస్థలం : నెల్లూరు నగరం

తల్లిదండ్రులు : కడియం మునికృష్ణమూర్తి, విజయలక్ష్మి

విద్య : నెల్లూరులో ఇంటర్‌ వరకు, తిరుపతిలో అగ్రికల్చర్‌ బీఎస్సీ, ఢిల్లీలో ఎంఎస్పీ (ఏజీ) పూర్తి చేశారు.


ఉద్యోగ ప్రస్థానం : 2010లో గ్రూప్‌-1 ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. కరీంనగర్‌ డీఎస్పీగా ఉద్యోగప్రస్థానం ఆరంభించారు. ఆ తరువాత వరంగల్‌, నల్గొండ, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ డీఎస్పీగా పనిచేసి.. పదోన్నతిపై ఏఎస్పీగా తూర్పు గోదావరి జిల్లాకు వెళ్లారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో కడప జిల్లా అడిషనల్‌ ఎస్పీగా బదిలీపై వచ్చారు. 

Updated Date - 2020-05-21T10:38:56+05:30 IST