మాలల పురోగతికి ప్రత్యేక కార్పొరేషన్‌

ABN , First Publish Date - 2021-04-08T05:45:11+05:30 IST

షెడ్యూల్డ్ కులాలకు ఉన్న ఉమ్మడి అవకాశాలను మాలలే దోచుకుంటున్నారని ‘మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి’ (ఎమ్మార్పీఎస్) నేటికీ కూడా ఆరోపిస్తున్నది...

మాలల పురోగతికి ప్రత్యేక కార్పొరేషన్‌

షెడ్యూల్డ్ కులాలకు ఉన్న ఉమ్మడి అవకాశాలను మాలలే దోచుకుంటున్నారని ‘మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి’ (ఎమ్మార్పీఎస్) నేటికీ కూడా ఆరోపిస్తున్నది. అందుకోసం రిజర్వేషన్ ఫలాలను వారి వారి జనాభాకు అనుగుణంగా వర్గీకరించాలని ఎమ్మార్పీఎస్ డిమాండ్ చేయడం తెలిసిందే. ఈ డిమాండ్‌ను ఒక్క బహుజన్ సమాజ్ వాది పార్టీ మినహా, మిగతా రాజకీయ పార్టీలన్నీ సమర్థించాయి. విప్లవ పార్టీలు, వారి మేధావులు కూడా తమ మద్దతును ఇచ్చారు. మాలలు నిజంగానే మాదిగల అవకాశాల్ని దోచుకుంటున్నారని అభిప్రాయం పౌర సమాజంలో బలంగా నాటుకుని ఉన్నది, నిజంగా ఎమ్మార్పీఎస్ ఆరోపిస్తున్న దానికి తెలంగాణలో ఆధారాలు ఏవైనా ఉన్నాయా? అనే విషయాన్ని పరిశీలించడం కోసం ఈ వ్యాసం ఉద్దేశించబడినది. ఇందుకోసం 2011 జనాభా లెక్కలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభివృద్ధి కోసం అమలు చేస్తున్న పథకాలు ఆధారంగా ఈ విశ్లేషణ ఉంటుంది.


2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర జనాభా 3,51,93,978. ఇందులో షెడ్యూల్ కులాల జనాభా 54,32,724. మొత్తం జనాభాలో వీరు 15.43 శాతం. ఈ షెడ్యూల్ కులాలలో అత్యధికంగా 32,33,642 మాదిగలు ఉన్నారు. మాలలు 15,27,143 దాకా ఉన్నారు. మొత్తం రాష్ట్ర జనాభాలో మాదిగలు 9.19 శాతం. కానీ షెడ్యూల్ కులాల కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి గాని, ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ గానీ మాదిగలకు 12 శాతం రిజర్వేషన్‌ను డిమాండ్ చేయటం ఏ లెక్కల ఆధారంగా చేస్తున్నారు అనేది అర్థం కావటం లేదు. ఇక మాలల విషయానికి వస్తే వారు 4.34 శాతం మాత్రమే. అటు మాల, ఇటు మాదిగ అనుబంధ కులాలు దాదాపు సమానంగానే ఉన్నాయి. మొత్తం షెడ్యూల్ కులాల్లో మాదిగలు 59.52 శాతంగా ఉంటే మాలలు 28.12 శాతంగా ఉన్నారు. ఇది షెడ్యూల్ కులాలకు సంబంధించిన సమాచారము. ఇప్పుడు ప్రభుత్వ పథకాలకు సంబంధించి షెడ్యూల్ కులాలవారు ఎవరు ఏ స్థాయిలో లబ్ధి పొందుతున్నారనే విషయాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం.


షెడ్యూల్ కులాల అభివృద్ధి సహకార సంస్థ వెబ్‌సైట్‌లో ఉన్న డేటాలో ప్రధానంగా మాదిగ, మాల కులాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవటం జరిగింది. ఈ వ్యాసం రాసిన రోజు నాటికి మాదిగలు 3,11,675(75 శాతం) మంది, మాలలు 1,05,821(25 శాతం) లబ్ధి పొందినట్లు వివరాలు ఉన్నాయి. మొత్తం షెడ్యూల్డు కులాల్లో 59 శాతంగా ఉన్న మాదిగలు 75% లబ్ధిదారులుగా ఉండటం మంటే, వారు వారి జనాభా స్థాయిని మించి అదనంగా 15 శాతం పైబడి ఎక్కువగా లబ్ధి పొందుతున్నారు. షెడ్యూల్ కులాల జనాభాలో మాలలు 28 శాతంగా ఉన్నప్పటికీ వారు పొందుతుంది 25 శాతమే. అంటే 3 శాతం మేరకు వారి అవకాశాన్ని కోల్పోతున్నారు. 1994 నుండి ఎంఆర్‌పిఎస్ ఆరోపించినట్లు మాలలే ఎక్కువగా దోచుకోవటం మాట అటునుంచి కనీసం వారి వాటాను కూడా పొంద లేకపోవడమే కాక మూడు శాతం మేరకు తమ అవకాశాన్ని నష్టపోతున్నారు. 2016–-17లో మాదిగలు 75.66 శాతంగా అంటే దాదాపు 16 శాతం మేరకు ఎక్కువ లబ్ధిని పొందుతూ ఉంటే, మాలలు 24.33 శాతంగా అంటే నాలుగు శాతం మేరకు నష్టపోతున్నారు. ఈ విధంగా షెడ్యూల్ కులాల కార్పొరేషన్ రుణాలు పొందే విషయంలో మాలలకు అన్యాయం జరుగుతున్నది. ఇక ఇప్పుడు భూ పంపిణీ విషయంలో మాలలకు జరుగుతున్న అన్యాయాన్ని పరిశీలిద్దాం.


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి దళితులకు 3 ఎకరాల భూమి పథకాన్ని అమలు చేస్తున్నది. భూ పంపిణీ విషయంలో నిర్దిష్టంగా మూడు ఎకరాలు నిర్ణయించి అమలు చేయటం అనేది టిఆర్ఎస్ ప్రభుత్వ విప్లవాత్మక కార్యక్రమంగా దీన్ని చూడాల్సి ఉంది. ఇప్పటివరకు మాదిగలలో 4,584(69 శాతం) మంది లబ్ధిపొందారు. ఈ విషయంలో కూడా వారు తన జనాభా స్థాయి కంటే అదనంగా 10 శాతం మేరకు ఎక్కువగా లబ్ధి పొందారు. అదే మాలలు విషయానికొస్తే 1,640 (25 శాతం) లబ్ధి పొందుతూ 3 శాతం మేరకు నష్టపోతున్న స్థితి కనిపిస్తుంది. ఇక ల్యాండ్ ఏరియా పరంగా చూసినప్పుడు మాదిగలు 10,623.1 ఎకరాలు (69 శాతం)తో ఎక్కువగా లబ్ధిని పొందుతూ ఉంటే, మాలలు 3727.2 ఎకరాలు (24 శాతం) మాత్రమే పొందుతూ నాలుగు శాతం మేరకు నష్టపోవడం కనిపిస్తున్నది. లబ్ధిదారుల సంఖ్యలో 25 శాతంగా ఉన్న వీరు, ఎకరాల విషయం వచ్చేసరికి 24 శాతానికి తగ్గటం కనిపిస్తున్నది.


ఈ విధంగా ఎస్సీ కార్పొరేషన్ రుణాలను పొందటంలోను, మూడు ఎకరాల భూమి పథకంలో లబ్ధి పొందటంలోను మాలలు తమకున్న అవకాశాన్ని కూడా వినియోగించుకోలేని స్థితి కనిపిస్తున్నది. ఈ భూ పంపిణీనీ జిల్లాల వారీగా చూసినప్పుడు చాలా వ్యత్యాసాలు కనిపిస్తాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాల, మాల అనుబంధ కులాల జనాభా అధిక శాతంలో ఉన్నప్పటికీ వారు భూమిని పొందే విషయంలో వెనుకబడిన స్థితి అక్కడ కూడా కనిపిస్తున్నది. ప్రత్యేకించి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారి సూర్యాపేట జిల్లాలో మొత్తం 46 మందికి 3 ఎకరాల పథకాన్ని అమలు చేశారు. ఈ 46 మందిలో మాదిగలు 45 మంది కాగా, మిగిలిన ఒక్కడు బైండ్ల వాడు. అంటే జిల్లా మొత్తంలో మాలల్లో ఒక్కరికి కూడా ఈ పథకం వల్ల లబ్ధి చేకూరకుండా మంత్రిగారు జాగ్రత్తలు తీసుకున్నట్లు అంకెలు నిరూపిస్తున్నాయి.


మాలలు ఈ రకంగా నష్టపోవడం అనేది ప్రభుత్వ పథకాలలోని కాదూ, విద్యా ఉద్యోగాల్లో కూడా ఇదే పరిస్థితి ఉండొచ్చనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నది. ఉదాహరణకు తీసుకుంటే, దక్షిణ మండల విద్యుత్ పంపిణీ సంస్థ హైదరాబాద్ సౌత్ సర్కిల్‌లో అన్ని స్థాయిల్లో ఎస్సీ ఉద్యోగులు 60 మంది దాకా ఉన్నారు. 60 మందిలో మాదిగలు 54 మంది ఉంటే, మాలలు కేవలం 6 గురు మాత్రమే ఉన్నారు. ఈ సంస్థలో షెడ్యూల్ కులాలకు ఉన్న అవకాశంలో 90 శాతం ఒక్క మాదిగ కులం వారే పొందుతున్నారని తెలుస్తున్నది. సాంఘిక సంక్షేమ గురుకుల సంస్థలోనూ ఇదే రకమైన పరిస్థితి ఉండొచ్చుననీ, ప్రభుత్వం వాస్తవాలను బహిర్గత పరచాలని మాల సంఘం నాయకుల డిమాండ్.  


ఒక నాడు అభ్యుదయ, విప్లవోద్యమాలకు నాయకులుగా, కళాకారులుగా, మేధావులుగా తోడ్పాటును అందించటంలో మాలలకు సుసంపన్నమైన చరిత్ర ఉంది. కానీ వారి సామాజిక, అభివృద్ధి కోసం వారిని రాజకీయంగా సంఘటితం చేసి ముందుకు నడిపించగలిగే నాయకత్వ లేమి నేడు స్పష్టంగా కనబడుతున్నది. మొత్తంగా పరిశీలించినప్పుడు తెలంగాణ మాలసమాజం సంక్షోభంలో ఉన్నట్లు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో మాలలకు ప్రత్యేక అభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో ముందుకు కదలాలి. ఈ రకంగానైనా ప్రభుత్వ పథకాల్లో వారు నష్ట పోతున్న దానికి పరిష్కారం లభిస్తుంది.

డాక్టర్ పట్టా వెంకటేశ్వర్లు

అర్థశాస్త్ర ఆచార్యుడు

Updated Date - 2021-04-08T05:45:11+05:30 IST