కరీంనగర్‌ అభివృద్ధిపై సీఎంకు ప్రత్యేక శ్రద్ధ

ABN , First Publish Date - 2021-06-23T06:26:36+05:30 IST

కరీంనగర్‌ అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక శద్ధ్ర తీసుకుంటూ వందల కోట్ల నిధులను మంజూరు చేస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు.

కరీంనగర్‌ అభివృద్ధిపై సీఎంకు ప్రత్యేక శ్రద్ధ
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి గంగుల కమలాకర్‌

- రూ.410 కోట్లతో సర్వాంగ సుందరంగా మానేరు రివర్‌ ఫ్రంట్‌

- ఆర్కిటెక్చరల్‌, ఇంజనీరింగ్‌ డిజైన్ల పనుల కోసం టెండర్లు పూర్తి

-  ఆగస్టు నుంచి పనులు ప్రారంభించేలా చర్యలు

-  మంత్రి గంగుల కమలాకర్‌  

కరీంనగర్‌, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కరీంనగర్‌ అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక శద్ధ్ర తీసుకుంటూ వందల కోట్ల నిధులను  మంజూరు చేస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. మంగళవారం మంత్రి గంగుల హైదరాబాద్‌లోని జలసౌధలో మానేరు రివర్‌ఫ్రంట్‌పై నీటిపారుదల, పర్యాటక శాఖల ఉన్నతాధికారులతో అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ కరీంనగర్‌ ముఖద్వారమైన లోయర్‌ మానేరు డ్యాం రూపురేఖలు మారబోతున్నాయని, అంతర్జాతీయ ప్రమాణాలతో అద్భుతమైన రివర్‌ఫ్రంట్‌గా తీర్చిదిద్దడంకోసం వేగంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.  నగరాన్ని ఆనుకుని ఉన్న అత్యద్భుతమైన వాటర్‌ బాడీని మానేరు రివర్‌ ఫ్రంట్‌గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సంకల్పించారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎల్‌ఎండీ అన్ని కాలాల్లోనూ నీటితో కళకళలాడడంతోనే మానేరు రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టు కార్యరూపం దాల్చిందన్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం రెవెన్యూ సర్వే పూర్తయిందని భూ సేకరణ ప్రక్రియ కొనసాగుతోందన్నారు.  1.8 కిలోమీటర్ల మేర డిజిటల్‌ సర్వే పూర్తయిందన్నారు. 

ఫ జూలై నెలాఖరుకల్లా డీపీఆర్‌ సిద్ధం

జూలై నెలాఖరుకల్లా ప్రాజెక్టు మాస్టర్‌ ప్లాన్‌తోపాటు డీపీఆర్‌ సిద్ధమవుతుందని చెప్పారు. ఆగస్టులో రిటర్నింగ్‌ వాల్‌ నిర్మాణంతోపాటు ఇతర సివిల్‌ వర్క్‌లకు టెండర్లు పిలిచి సంవత్సరం లోపల ప్రాజెక్టు పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించాలని మంత్రి  అధికారులను ఆదేశించారు. గతంలో ఐదు లక్షలకుపైగా క్యూసెక్కుల ఫ్లో వచ్చిందని, మిడ్‌ మానేరు నిర్మించిన తర్వాత వచ్చే ఫ్లో తగ్గిందని, భవిష్యత్‌లో వచ్చే వరదను అంచనా వేసి నిర్మాణాలను తీర్చిదిద్దాలని సూచించారు. హైడ్రాలజీ రిపోర్టుల ప్రకారం గత 500 ఏళ్ల ప్లడ్‌ రిపోర్టు ఆధారంగా వరదలను తట్టుకునే విధంగా నిర్మాణాలను రూపొందిస్తామని  అధికారులు మంత్రికి వివరించారు. బోటింగ్‌కు అనుగుణంగా రివర్‌ ఫ్రంట్‌ రూపొందించడంతోపాటు ప్రపంచ స్థాయి అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌, వాటర్‌ స్పోర్ట్స్‌, లేజర్‌ షో, వాటర్‌ లైటింగ్‌, ఇతర ఫెసిలిటీస్‌ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ అధికారులు మంత్రి గంగుల కమలాకర్‌కు వివరించారు. సమావేశంలో ఇరిగేషన్‌, కాడ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజిత్‌కుమార్‌, ఈఎన్‌సీలు మురళీధర్‌రావు, శంకర్‌, టూరిజం కార్పొరేషన్‌ ఎండీ మనోహర్‌రావు, ఇరిగేషన్‌ ఎస్‌ఈ శివకుమార్‌, ఈఈ నాగభూషణం, ఏకాం ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-23T06:26:36+05:30 IST