నవరత్నాలకు పెద్దపీట

ABN , First Publish Date - 2021-01-27T06:15:46+05:30 IST

పేద వర్గాల సంక్షేమం కోసం నవరత్నాల అమలుకు పెద్దపీట వేస్తున్నట్టు కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ పేర్కొన్నారు.

నవరత్నాలకు పెద్దపీట

గణతంత్ర దినోత్సవంలో కలెక్టర్‌ వినయ్‌చంద్‌

అమ్మఒడి కింద 4,10,004 మంది తల్లులకు రూ.615 కోట్లు జమ

 స్వయంశక్తి సంఘాలకు రుణ మాఫీ కింద తొలివిడత రూ.296 కోట్లు విడుదల

51,683 మంది గిరిజనులకు అటవీ హక్కు పత్రాలు

2.23 లక్షల మందికి కొత్తగా బియ్యం కార్డులు

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో రోడ్ల నిర్మాణానికి రూ.15.25 కోట్లు మంజూరు

ఇళ్ల పట్టాల పంపిణీకి 3,00,124 మంది లబ్ధిదారుల గుర్తింపు

రూ.304 కోట్లతో పాఠశాలల్లో నాడు-నేడు పనులు

జీవీఎంసీ పరిధిలో రూ.302.77 కోట్ల వ్యయంతో 1,978 పనులు

రూ.260 కోట్లతో బీచ్‌ఫ్రంట్‌ అభివృద్ధి 


విశాఖపట్నం, జనవరి 26 (ఆంధ్రజ్యోతి):


పేద వర్గాల సంక్షేమం కోసం నవరత్నాల అమలుకు పెద్దపీట వేస్తున్నట్టు కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ పేర్కొన్నారు. 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం నగరంలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ సంక్షేమ పథకాల ద్వారా పేదరికం నిర్మూలనకు కృషిచేస్తున్నామన్నారు. జిల్లాలో నవరత్నాల ద్వారా చేపడుతున్న పథకాలను వివరించారు. 


ప్రతినెలా 4.87 లక్షల మంది లబ్ధిదారులకు రూ.117 కోట్లు పింఛన్‌ల రూపేణా అందజేస్తున్నట్టు కలెక్టర్‌ వినయచంద్‌ తెలిపారు. స్వయంశక్తి సంఘాలకు రుణ మాఫీ కింద తొలివిడత రూ.296 కోట్లు విడుదల చేశామన్నారు. అలాగే 35,716 సంఘాలకు బ్యాంకుల ద్వారా రూ.960 కోట్లు రుణాలు అందజేశామన్నారు. ఉపాధి హామీ పథకంలో ఈ ఏడాది 51,030 మందికి కొత్తగా జాబ్‌కార్డులు ఇవ్వడం ద్వారా రాష్ట్రంలోనే విశాఖ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ఇంకా 51,683 మంది గిరిజనులకు 86,473 ఎకరాల భూమికి అటవీ హక్కు పత్రాలు ఇచ్చినట్టు తెలిపారు. ఏజెన్సీలో కేంద్ర ప్రత్యేక సహాయం రూ.75.47 కోట్లతో 196 పనులు చేపట్టామన్నారు. రూ.పది కోట్లతో 12,500 మంది కాఫీ రైతులకు మిరియాల సేకరణ పనిముట్లు ఇచ్చామన్నారు. పీఎం సడక్‌ యోజన కింద రూ.119.11 కోట్లతో 100 పనులు మంజూరుచేశామన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి నిధుల నుంచి రూ.492.39 కోట్లతో 104 పనులు మంజూరుచేశామన్నారు. ఎస్సీ సొసైటీ ద్వారా 17,103 మంది లబ్ధిదారులకు రూ.37.06 కోట్లు మంజూరు చేశామన్నారు. 66,294 మంది బీసీ విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ కింద రూ.149.54 కోట్లు, మెస్‌ చార్జీల కింద రూ.62.33 కోట్లు, కాపు విద్యార్థులకు రూ.12.1 కోట్లు విడుదల చేశామన్నారు. జిల్లాలో 8,918 కాపు కులస్థులకు ఆర్థిక సాయం కోసం రూ.13.37 కోట్లు మంజూరుచేశామని తెలిపారు. ఈ ఏడాది జిల్లాలో 2,23,897 మందికి కొత్తగా బియ్యం కార్డులు, 11,24,884 మందికి ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేశామని వివరించారు. అమ్మఒడి కింద 4,10,004 మంది తల్లుల ఖాతాకు రూ.615 కోట్లు జమ చేసినట్టు వివరించారు. నాడు-నేడు పథకంలో భాగంగా 1149 పాఠశాలల్లో రూ.307.04 కోట్లతో పనులు చేపట్టినట్టు తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో రోడ్ల నిర్మాణానికి రూ.15.25 కోట్లు మంజూరయ్యాయన్నారు. 


ప్రస్తుత రబీ సీజన్‌లో జిల్లాలో 1,64,835 హెక్టార్లలో పంట సాగు చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటివరకు 18,289 హెక్టార్లు సాగు జరిగిందన్నారు. రబీలో 1296 క్వింటాళ్ల విత్తనాలు, 13,275 టన్నుల ఎరువులు సరఫరా చేశామని, ఈ ఏడాది జిల్లాలో 3,78,715 మంది రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.309.28 కోట్లు, పీఎం కిసాన్‌ యోజన కింద రూ.209.17 కోట్లు పంపిణీ చేశామన్నారు. నివర్‌ తుఫాన్‌కు పంట నష్టపోయిన 37,715 మంది రైతులకు రూ.25.57 కోట్లు పరిహారం కింద జమ చేశామన్నారు. అలాగే 2019-20 ఖరీఫ్‌లో నష్టపోయిన 2,971 మంది రైతులకు ఉచిత బీమా కింద రూ.2.12 కోట్లు చెల్లించామన్నారు. పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో ప్రతి రైతుభరోసా కేంద్రానికి రూ.28 వేల విలువచేసే మందులను పంపిణీ చేశామన్నారు.


ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు కింద 1.3 లక్షల ఎకరాల సాగు కోసం రూ.928 కోట్లతో పనులు జరుగుతుండగా, తాజాగా రూ.3,050 కోట్లతో రెండు ప్యాకేజీలకు టెండర్లు ఆహ్వానించామన్నారు. వీఎంఆర్‌డీఎ పరిధిలో వున్న 15 మండలాల్లో 52,050 ఇళ్ల నిర్మాణానికి రూ.939.9 కోట్లు మంజూరయ్యాయన్నారు. జిల్లాలో ఇళ్ల పట్టాల పంపిణీకి 3,00,124 మంది లబ్ధిదారులను గుర్తించామని, వీరి కోసం 5,364 ఎకరాల భూమి సేకరించామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.3,580 కోట్లతో 11 భారీ పరిశ్రమలు స్థాపించి 4254 మందికి ఉపాధి కల్పించామన్నారు. గనుల శాఖ ద్వారా రూ.55.18 కోట్లతో 407 అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. సముద్ర వేట నిషేధ కాలంలో జీవనభృతి కోసం 20,273 మంది మత్స్యకారులకు పది వేల రూపాయల వంతున అందజేశామన్నారు. బోట్లకు డీజల్‌ సబ్సిడీ కింద రూ.5.83 కోట్లు పంపిణీ చేశామన్నారు. రుషికొండ బీచ్‌ అంతర్జాతీయ బ్లూఫ్లాగ్‌బీచ్‌గా గుర్తించబడిందన్నారు. డీసీసీబీ ద్వారా 40,584 మందికి రూ.204 కోట్లు స్వల్ప, దీర్ఘకాలిక రుణాలు పంపిణీ చేశామన్నారు. తొలివిడత కొవిడ్‌ టీకా కోసం జిల్లాకు 91 వేల డోసులు వ్యాక్సిన్‌ వచ్చిందన్నారు. 


జీవీఎంసీ, వీఎంఆర్‌డీలో పనులు..


గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) పరిధిలో రూ.302.77 కోట్ల వ్యయంతో 1,978 పనులు చేపట్టామన్నారు. స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టుల అమలులో జీవీఎంసీ జాతీయ స్థాయిలో ఎనిమిదో స్థానంలో నిలిచిందన్నారు. దీనికిగాను 61 పనులకు రూ.1000 కోట్లు కేంద్రం విడుదల చేసిందన్నారు. రూ.260 కోట్లతో బీచ్‌ఫ్రంట్‌ అభివృద్ధి పనులకు ప్రతిపాదించామన్నారు. ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి తీసుకున్న రూ. 386 కోట్ల రుణంతో నిరంతర నీటి సరఫరా పథకం అమలు చేస్తున్నామన్నారు. వీఎంఆర్‌డీఎ ఆధ్వర్యంలో ఆనందపురం నుంచి బోని వరకు తొమ్మిది కిలోమీటర్ల బీటీ రహదారి విస్తరణకు రూ.7.55 కోట్లు వెచ్చించామన్నారు. రూ.150 కోట్లతో ఎన్‌ఏడీ ఫ్లైవోవర్‌ పనులు జరుగుతున్నాయన్నారు. కైలాసగిరి అభివృద్ధికి రూ.56.55 కోట్లతో పనులు చేపట్టామన్నారు. రూ.40 కోట్లతో బీచ్‌రోడ్‌లో ఇంటిగ్రేటెడ్‌ మ్యూజియం కాంప్లెక్స్‌, 13.5 కోట్లతో రామ్‌నగర్‌లో వాణిజ్య సముదాయం నిర్మాణ పనులు పురోగతిలో వున్నాయని కలెక్టర్‌ తెలిపారు. కార్యక్రమంతో నగర పోలీస్‌ కమిషనర్‌ మనీష్‌కుమార్‌సిన్హా, జాయింట్‌ కలెక్టర్‌లు వేణుగోపాల్‌రెడ్డి, అరుణ్‌బాబు, జీవీఎంసీ కమిషనర్‌ సృజన, వీఎంఆర్‌డీఎ కమిషనర్‌ కోటేశ్వరరావు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూటికుప్పల సూర్యారావును కలెక్టర్‌ సత్కరించారు. కార్యక్రమంలో పలు పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పలు ప్రభుత్వ శాఖల ప్రగతి తెలియజేసేలా శకటాల ప్రదర్శన జరిగింది. గృహ నిర్మాణ సంస్థకు మొదటి బహుమతి రాగా, మత్స్య శాఖ, డీఆర్‌డీఏ శాఖల శకటాలకు ద్వితీయ, తృతీయ బహుమతి లభించాయి. 

Updated Date - 2021-01-27T06:15:46+05:30 IST