అమర భాషలో ఆధునికుడు

ABN , First Publish Date - 2020-02-03T19:07:09+05:30 IST

సంస్కృతమే తన భాషగా, వ్యక్తీకరణగా నిర్దేశించుకొని, నూటయాభైకి పైగా గ్రంథాలు రాసి, తన ‘మందాకినీ’ సంస్కృత గేయ కావ్యంతో దేశవ్యాప్తంగా

అమర భాషలో ఆధునికుడు

సంస్కృతమే తన భాషగా, వ్యక్తీకరణగా నిర్దేశించుకొని, నూటయాభైకి పైగా గ్రంథాలు రాసి, తన ‘మందాకినీ’ సంస్కృత గేయ కావ్యంతో దేశవ్యాప్తంగా మన్ననలు అందుకున్న శ్రీభాష్యం విజయ సారథి గారికి ఈ ఏడు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. ఆ సందర్భంగా ఆయనతో జరిపిన సంభాషణ ఇది.

 పెద్దాయన, ఎంతో గొప్పవాడయిన కాళోజీ నారాయణ రావు గారు నన్ను పట్టుకొని ‘‘ఎందుకూ అక్కరకురాని తద్దిన మంత్రాల భాష పట్టుకున్నవేమిరా’’ అన్నాడు. చాలా బాధేసింది. వెంటనే ‘‘సంస్కృతం ప్రపంచంలోకెల్లా గొప్ప భాష. నువ్వు ఉపయోగించే ‘ప్రభుత్వం’, ‘కార్యకర్త’, ‘అధ్యక్షుడు’ ఇవన్నీ సంస్కృతమే కదా. అది లేకుండా ఒక్క వాక్యం రాయలేవు,’’ అన్నాను.

 

శ్రీభాష్యం విజయ సారథి 1937లో మార్చ్‌ 10న కరీంనగర్‌ జిల్లా చేగుర్తి గ్రామంలో జన్మించారు. అమ్మ నుండి సంస్కృత భాష, సంగీతాలని నేర్చుకున్న శ్రీభాష్యం విజయ సారథి తొలి రోజుల్లోనే అన్ని విషయాలను ప్రశ్నించడం మొదలుపెట్టారు. హేతువాదిగా ఒకింత తీవ్రంగానే వాదించేవారు. ఒక వైపు నిజాం పాలన, మరో వైపు కమ్యూనిస్ట్‌ ఉద్యమాలు ఉన్న ఆ కాలంలో ఆయన ప్రగతిశీలత వైపు, హేతువాదం వైపు మొగ్గారు. ఒక దశలో నిజాం పోలీసుల లిస్టులో కూడా చేరారు. అప్పుడు వారి అన్నగారు పార్థసారథి అనే మొదటి పేరును శ్రీభాష్యం విజయ సారథిగా మార్చి వరంగల్‌లోని శ్రీ విశ్వేశ్వరయ్య సంస్కృత కళాశాలలో చేర్పించారు. పదకొండేండ్ల వయసులోనే ‘శారదా పద కింకిణి’లాంటి గ్రంథాలను రాశారు. దేశవ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాలలో కవితా గానం చేసిన శ్రీభాష్యం విజయ సారథి అయ్యదేవర కాళేశ్వరరావు చేతుల మీదుగా మహాకవి బిరుదును, కలకత్తాలో యుగకవి బిరుదును, బిర్లా ఫౌండేషన్‌వారి వాచస్పతి పురస్కారాన్ని అందుకున్నారు. హేతువాద అభ్యుదయ భావాల అనంతరం తాను మానవతావాదానికి కట్టుబడి వున్నానని ఆయన అంటారు. మనిషి ఆనందం పొందడానికి భారతీయ సాహిత్యం సంస్కృతి ప్రధాన రహదారి అని శ్రీభాష్యం విజయ సారథి అంటారు.


ఇప్పటివరకే మహామహోపాధ్యాయ, వాచస్పతి, యుగోద్ధర్త వంటి ఎన్నో గౌరవాలు అందుకున్న మీరు ఇప్పుడు పద్మశ్రీ రావటం పట్ల ఎట్లా స్పందిస్తున్నారు?

పద్మశ్రీ గొప్ప ఆనందాన్నిచ్చింది. అయితే ఈ పురస్కారం వ్యక్తిగా నాకంటే సంస్కృత భాషకు, సాహిత్యానికి లభించినట్టుగా భావిస్తున్నాను. మృత భాష లాంటి అనేక అవమానకరమైన మాటలతో నిరాదరణకు గురయిన సంస్కృత భాషా సాహిత్యాలకు గుర్తింపు రావడం సంతోషమే కదా.

 

మీ సంస్కృత ప్రయాణం ఎట్లా మొదలయింది. మీ బాల్యంలో నిజాం పాలనలో ఉర్దూ అధికార భాషగా వుండేది కదా, మీరెట్లా సంస్కృతం వైపుకు వచ్చారు?

నిజమే, అప్పుడంతా ఉర్దూకే ప్రాధాన్యత వుండేది. నన్ను కూడా మొదట ఉర్దూ నేర్చుకోవడానికే పంపారు. కాని ఎందుకో ఆ భాష నన్ను ఆకట్టుకోలేదు. దాంతో మా అమ్మగారు నన్ను సంస్కృతం వైపునకు ప్రోత్సహించారు. అక్కడా కొంత కాలం ఇమడలేకపోయాను. కాని ‘గీతగోవిందం’ నన్ను బాగా ప్రభావితం చేసింది. అందులోని లయ ఆకర్షించింది. దాంతో 7 ఏళ్ళ వయసులోనే మొదటి సారిగా సంస్కృతంలో రాయడం ఆరంభించాను. కొన్నిసార్లు సంస్కృత పదాలు రాకపోతే తెలుగు పదాలతోనే పూర్తి చేసే ప్రయత్నం చేసాను. చెంబు మాట తెలుగులోనే ఉపయోగించాను.

అదే సమయంలో ఎవరికీ చెప్పకుండానే బాసర క్షేత్రం వెళ్లి దర్శనానికి వెళ్లి అమ్మవారి ముందు కూర్చున్నాను. ఐదురోజుల తర్వాత అయిదారు శ్లోకాలు ఆశువుగా వచ్చాయి. దాంతో సంస్కృతం మీద మక్కువ పెరిగింది. ఎవరు ఒప్పుకున్నారా లేదా అన్నది లేకుండా బాసరలో మొదలయిన సంస్కృత రచన ఇప్పటిదాకా గొప్ప ఆత్మానందంతో సాగింది. ఈ ప్రయాణంలో పలు సత్కారాలు మరెన్నో తిరస్కారాలూ లభించాయి. తర్వాత బిఓఎల్‌ పూర్తి చేసుకున్నంక వరంగల్‌లో 90 రూపాయల జీతంతో అధ్యాపకుడిగా నియమించబడ్డాను.

 

వరంగల్‌ అనుభవాలు ఏమయినా చెప్పండి?

అప్పుడు కవిసమ్మేళనాలల్లో నేనొక్కడినే సంస్కృత కవిని. పెద్దాయన, ఎంతో గొప్పవాడయిన కాళోజీ నారాయణ రావుగారు నన్ను పట్టుకొని ‘‘ఎందుకూ అక్కరకురాని తద్దిన మంత్రాల భాష పట్టుకున్నవేమిరా’’ అన్నాడు. చాలా బాధే సింది. వెంటనే ‘‘సంస్కృతం ప్రపంచంలోకెల్లా గొప్ప భాష. నువ్వు ఉపయో గించే ‘ప్రభుత్వం’, ‘కార్యకర్త’, ‘అధ్యక్షుడు’ ఇవన్నీ సంస్కృతమే కదా. అది లేకుండా ఒక్క వాక్యం రాయలేవు’’ అన్నాను. దాంతో అక్కడున్న కవులంతా చప్పట్లు కొట్టారు. కాళోజీ కొంచెం చిన్నబుచ్చుకున్నారు. కాని కోపగించుకో లేదు. తర్వాత అనేక కవి సమ్మేళనాలల్లో ‘‘వాడు రాలేదా’’ అని అడిగేవారు.

 

మీకు అత్యంత ఇష్టమై, మిమ్మల్ని ప్రభావితం చేసిన సంస్కృత గ్రంథం?

నాకు బాగా ఇష్టమయిన కవి బాణభట్టు రాసిన ‘కాదంబరి’. ఆయన స్పృశించని ప్రక్రియ లేదు. చెప్పని భావం లేదు. మనకు హృదయంలో నాలుగు ధర్మాలున్నాయి. ధృతి, దీప్తి, సంకోచ, వికాసాలు. ఏ రచన చదివినా ఈ నాలుగు ధర్మాలు బయటకు వస్తాయి. ఆ నాలుగింటిని బయటకు తీసుకురావడానికే ఈ సాహిత్యం, దర్శనం మొదలయినవన్నీ. సమాజంలో సంస్కారం పెపొం దించడానికే మనం చేసే ఈ ప్రయత్నాలన్నీ. నాకు అన్ని దర్శనాల కంటే సాంఖ్య దర్శనం మీదే ఎక్కువ ఇష్టం. కాని దురదృష్టం ఏమిటంటే అనేక గ్రంథాలు ఇవాళ లేవు, నాశనం చేసారు. ప్రపంచం మూడే వస్తువుల మీద ఆధారపడింది.

వైశ్వానర, తైజస, ప్రాజ్ఞ. రాయీ రప్పా అన్నీ వైశ్వానర- వాటికి ప్రాణం లేదు. అవన్నీ ప్రాణికి ఉపయోగపడేవే. వాటికి స్వార్థం లేదు. తైజస అంటే అర్థ చైతన్యం. చెట్లూ తీగలూ- వీటికి ప్రాణం ఉంటుంది. వీటిలో స్వార్థం ఒకింత, నిస్వార్థం మూడింతలు. ఇక మూడవది ప్రాజ్ఞ- వీటిలో చైతన్యం వుంటుంది. ఏక కణ జీవి నుండి మనిషి దాకా. వీటిలో ప్రయత్నం కృషితో వాళ్ళ చైతన్యం పెరుగుతుంది. ఇలాంటి అనేక విషయాలు సంఖ్యా శాస్త్రం చెప్పింది. కాని ఆ గ్రంథాలన్నీ ఇవ్వాళ లేవు. ఆయా కాలాల్లో నాశనం చేసారు. అది మన దురదృష్టం.


ఇక మీ రచనా ప్రస్థానం ఎప్పుడు ఎట్లా మొదలయింది. ఎట్లా సాగింది?

నా పదిహేడేళ్ళ వయసులో మొట్టమొదటి నవల రాసాను. దాని పేరు ‘మనోరమ’. అంతకుముందు కూడా రచనలు చేసాను. చివరికి ఊర్లో పాలమ్మే అమ్మ ఆమె గురించి క్షిరందేహి మల్లక్క అని కూడా రాసాను. కాని మనోరమ ఇప్పుడు లేదు పోయింది. నాకు అధికంగా ప్రహేళికల ద్వారా పేరు వచ్చింది. సంస్కృతంలో ప్రహేళికలు లేవు.

 

మీ రచనల్లో ‘మందాకిని’ గొప్ప రచనగా వినుతికెక్కినది. దాని విశేషాలు?

మందాకిని అలవోకగా వచ్చినకావ్యం. మందాకిని అంటే గంగా ప్రవాహం అందులో శ్లోకాలుండవు. అంతా మాత్రా ఛందస్సు. ‘ఆకతి మందాకినీ...చకతి మందాకినీ.. మధురేన పూరేన..’ ఇట్లా మొదలవుతుంది. ప్రవాహంలో ఎన్ని గతులు ఉంటాయో అవన్నీ మందాకినిలో ధ్వనిస్తాయి. నది పర్వతం నుంచి దుమికినప్పుడు ఎట్లా వుంటుంది, సమతలంలో పారినప్పుడు ఎట్లా వుంటుంది, మలుపులో ఎట్లా ధ్వనిస్తుంది- ఈ గతులన్నీ కావ్యంలో వినిపిస్తాయి. ఇందులో 200 ధాతువులు ఉపయోగించాను. రచన కేవలం 48 గంటల్లో పూర్తయింది. 2000 లైన్లున్నాయి. అందులో ప్రధానంగా మూడు కథలున్నాయి. జల కథ, నాయికా నాయక కథ, మూడవది యోగ శాస్త్రం. మందాకినీ రచనకు చాలా పేరొచ్చింది. చివరికి ఉత్తర భారతంలో కవి సమ్మేళనాలు జరిగినప్పుడు ‘‘వో మందాకినీ కవి కహా’’ అని అడిగే వారు. మందాకినీ పాడుకునేందుకు వీలుగా వున్న గేయ కావ్యం. అది సంస్కృత సాహిత్యంలో నూతన ఒరవడి.

 

మీ ‘భారత భారతి’ గురించి చెప్పండి?

‘భారత భారతి’లో సామాజిక అంశాలు ప్రధా నంగా ఉటంకించాను. సామాజిక పోకడల్ని విశ్లే షించి విమర్శించాను. కొన్ని పరిష్కార మార్గాలను కూడా సూచించాను. అరవై శ్లోకాలతో సాగుతుంది. దేశ స్వాతంత్రాన్నీ సమగ్రతను పరిరక్షించుకోవడానికి అందరూ ముందుండాలని ‘భారత భారతి’లో చెప్పాను. అది రాసి ఇంత కాల మయినప్పటికి ఇప్పటికీ దేశంలో అవే పరిస్థితులున్నాయన్న బాధ ఇంకా వుంది. ఇవిగాక, 150 పైగా రాసిన గ్రంథాలలో భిన్నమయిన ప్రక్రియల్లో రచనలు చేసాను. సుప్రభాతాలు, స్తోత్రాలు, భక్తి రచనలు, అధిక్షేప కవితలు, విమర్శ, ఆప్త లేఖలు (లేఖా సాహిత్యం), ఖండ కావ్యాలు, ప్రహేళికలు, విమర్శ, వర్ణనా కావ్యాలు, అనువాదాలు రాసాను. నాకు రాయడం చదవడమే జీవితం.

 

ఎన్నో గౌరవ పురస్కారాలు పొందారు. మరి ఇబ్బందిపడ్డ సంఘటనలేమైనా?

ఎందుకు లేవు. కాళోజీగారి ప్రస్తావన ఇంతకుముందే చెప్పాను. ఇక మొదటి సారి ఆకాశవాణిలో కవిత్వం చెప్పడానికి పిలిచారు. నాకది మొదటి అనుభవం కనుక ఉత్సాహంగా వెళ్లాను. రామానుజరావుగారి చొరవతో అవకాశం వచ్చింది. కాని కేంద్రానికి 10 గంటలకు వెళ్ళగా పగలు 3 గంటల వరకు అడిగిన వాళ్ళే లేరు. చివరికి దేవులపల్లికృష్ణశాస్త్రిగారు వచ్చి- ఎవరు మీరు ఏమిటని అడిగారు. నేను లేఖ చూపించగా- అయ్యో, లోనికి రండి అని, నేను రాసినవి విని, రికార్డు చేసి చాల బాగున్నాయన్నారు. అంతవరకు సరే.. తర్వాతే ‘‘మీరు ఎక్కడి వారు’’ అని అడిగారు. మొదట అర్థం కాలే, ‘‘ఇక్కడే’’ అన్నాను. ‘‘కాదు- ఆంధ్రలో ఏ ప్రాంతం’’ అన్నారు. అంతే అప్పటిదాక ఆయనపై వున్న గౌరవం పోయింది. ‘‘నేను నూటికి నూరుపాళ్ళు తెలంగాణ వాణ్ని, కరీంనగర్‌లో పుట్టాను వరం గల్‌లో పనిచేస్తున్నాను’’ అన్నాను. అంత పెద్దాయనకూ ప్రాంతీయ భావన వుండడం బాధ అనిపించింది. ఇక మరొసారి పుట్టపర్తి నారాయణాచార్యులు ‘‘తెలంగానమున కవులు శూన్యము’’ అన్న మాటా చాలా బాధను కలిగించింది. జీవితం అన్నంక అన్నీ వుంటాయి. దాటుకుంటూ గమ్యం వైపునకు వెళ్ళాలి.

 

సంస్కృత భాష అభివృద్ధికి ఏమైనా సూచనలు చేస్తారా?

చెబితే ఎవరు వింటారు. సంస్కృతం నేర్చుకోవడం చాలా తేలిక. కానీ ఎదో తెలీని నిరాసక్తత ప్రబలింది. సంస్కృతాన్ని సంస్కృతంగానే చూడాలి నేర్చుకోవాలి. ఇవాళ విశ్వవిద్యాలయ ఆచార్యులు కూడా ఇంగ్లీష్‌లో ఆలోచించి మాట్లాడి సంస్కృతం బోధిస్తున్నారు. చాలా కష్టమనిపిస్తుంది. సంస్కృతం చదివినవాళ్లకు ఉపాధి అవకాశాలు పెంపొందించాలి. విద్యాలయాలలో ప్రాధాన్యత పెంచాలి.

 

మీరు స్థాపించిన సర్వ వైదిక సంస్థానం గురించి చెప్పండి?

సమ్యక్‌ భావన, సమ్యక్‌ దృష్టి పెపొందించడానికి 36 ఏళ్ళ క్రితం స్థాపిం చాను. ఇక్కడ కుల జాతి మత బేధం లేకుండా అందరూ సమానమనే భావనే ఆచరిస్తున్నాం. దశాబ్దాల క్రితమే హరిజనుల ఆలయ ప్రవేశం చేయించాను. చివరికి గవర్నర్‌గా పని చేసిన కృష్ణకాంత్‌ కూడా వరాహ స్వామి ఆలయంలోకి సామా న్యునిలా వరుసలోనే వచ్చారు.

ఇంటర్వ్యూ  వారాల ఆనంద్‌

94405 01281

Updated Date - 2020-02-03T19:07:09+05:30 IST