ఇదెక్కడి వింత.. నీళ్లు వంపినా కిందకెళ్లవట.. భూమ్యాకర్షణ శక్తి పనిచేయని ఐదు ప్రాంతాలివే..

ABN , First Publish Date - 2021-06-14T19:48:21+05:30 IST

ఈ భూమ్మీద మనం నిలబడుతున్నామన్నా.. కూర్చుంటున్నామన్నా.. ఆకాశహర్మ్యాలు నిర్మిస్తున్నామన్నా అన్నిటికీ కారణం భూమ్యాకర్షణ శక్తి. దీన్నే గురుత్వాకర్షణ శక్తి అని కూడా అంటారు

ఇదెక్కడి వింత.. నీళ్లు వంపినా కిందకెళ్లవట.. భూమ్యాకర్షణ శక్తి పనిచేయని ఐదు ప్రాంతాలివే..

ఈ భూమ్మీద మనం నిలబడుతున్నామన్నా.. కూర్చుంటున్నామన్నా.. ఆకాశహర్మ్యాలు నిర్మిస్తున్నామన్నా అన్నిటికీ కారణం భూమ్యాకర్షణ శక్తి. దీన్నే గురుత్వాకర్షణ శక్తి అని కూడా అంటారు. ఇంగ్లీషులో గ్రావిటీ. ఇది లేకపోతే భూమిపై జీవకోటి మనుగడ అసాధ్యమని చెప్పొచ్చు. కానీ కొన్ని ప్రాంతాల్లో ఈ గ్రావిటీ అస్సలు పనిచేయదు సరికదా రివర్స్‌లో ఉంటుంది. ఇలాంటి ప్రదేశాల్లో న్యూటన్ చెప్పిన గురుత్వాకర్షణ సిద్ధాంతాలన్నీ తలకిందులైపోతాయి. ఇలా ప్రపంచ వ్యాప్తంగా గురుత్వాకర్షణ శక్తిని విస్మరించి, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించే ప్రాంతాల గురించి తెలుసుకుందామా?


1. హూవర్ డ్యామ్, నెవాడా, అమెరికా

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అత్యంత లేట్‌గా కౌంటింగ్ చేసి విమర్శలపాలైన నెవాడా గుర్తుందా? ఇక్కడ హూవర్ డ్యామ్ ఉంది. ఇక్కడకు వెళ్లిన వాళ్లందరూ ఒక ప్రయోగం చేస్తుంటారు. అదేంటంటే.. వాటర్ బాటిల్ వంపి డ్యామ్‌పై నీళ్లు పోయడం. అయితే ఆ నీళ్లు డ్యామ్‌పై పడవు. అలా అలా పైకి వెళ్లిపోతుంటాయి. ఇలా ప్రకృతికి విరుద్ధంగా వంపిన నీళ్లు పైకి పడటం ఇక్కడ వింత. ఇక్కడ గాలి బలంగా పైకి వీస్తుందని, అందుకే ఇలా జరుగుతుందని అంటారు. ఏది ఏమైనా ఈ వింతను చూస్తే మాత్రం చాలా థ్రిల్‌గా ఉంటుందని చూసొచ్చిన వాళ్లు చెప్తారు.


2. రివర్స్ జలపాతం, ఫారో ఐలాండ్స్

జలపాతాలు అంటే కొండలపై నుంచి నది కిందకు పడటం. కానీ ఫారో ఐలాండ్స్‌లో ఉండే జలపాతం మాత్రం కొండపైకి పారుతుంది. అంటే ఇక్కడ  గురుత్వాకర్షణ సిద్దాతాలన్నీ తలకిందులైపోతాయన్నమాట. అయితే ఇక్కడ కూడా బలమైన గాలులు వీయడం వల్లే ఇలా జలపాతం పైకి పారుతుందని చెప్తారు. ఈ అద్భుతాన్ని కచ్చితంగా చూడాల్సిందే అని పర్యాటకులు అంటారు.


3. మిస్టరీ స్పాట్, శాంతాక్రుజ్, కాలిఫోర్నియా

ఇది అమెరికాలోనే ఉన్న మరో వింత ప్రదేశం. కాలిఫోర్నియాలో ఉన్న ఈ మిస్టరీ స్పాట్‌ను 1939లో కనుగొన్నారు. ఆ మరుసటి ఏడాది నుంచి టూరిస్టులను అనుమతించడం ప్రారంభించారు. ఇక్కడ గ్రావిటీ రూల్స్ అన్నీ తలకిందులైపోతయి. రాళ్లురప్పలు సైతం కొండ పైకి దొర్లుతున్నట్లు కనిపిస్తాయి. ఈ అరుదైన ప్రాంతాన్ని చూడలేకపోతే చాలా కోల్పోయినట్లే అని చాలామంది అంటారు. 


4. గోల్డెన్ బౌల్డర్, మయన్మార్

మిలటరీ తిరుగుబాటుతో తిప్పలు పడుతున్న మన పొరుగుదేశం మయన్మార్‌లో ఉన్న ఈ వింత ఇప్పటిది కాదు. 2,500 సంవత్సరాలపైగా పాతది. అప్పటి నుంచి ఒక కొండ చివర్న ఉన్న ఈ భారీ రాయి.. ఏ క్షణమైనా కొండపై నుంచి కింద పడిపోయేలా కనిపిస్తుంది. కానీ ఇప్పటికీ దాని స్థానం మాత్రం మారలేదు. ఒక బౌద్ధ పగోడా పక్కనే ఉంటుందీ రాయి. ఇది బుద్ధుని వెంట్రుకతో అలా కొండకు అంటుకొని ఉందని చెప్తారు. దీన్ని కేవలం మహిళలే కదిలించగలరట. అందుకే దీన్ని మహిళలెవరూ టచ్ చేయడానికి అంగీకరించరు.


5. మ్యాగ్నెటిక్ హిల్, లడఖ్, భారత్

ఇలా గ్రావిటీని లెక్కచేయని ప్రాంతం మన భారతదేశంలో కూడా ఉంది. లేహ్-కార్గిల్-బాల్టిక్ జాతీయ రహదారిపై ఉన్న చిన్న కొండ మార్గం ఇది. దీన్ని ‘మ్యాగ్నెటిక్ హిల్’ (అయస్కాంత పర్వతం) అని పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడకు వచ్చిన తర్వాత వాహనాలను న్యూట్రల్‌లో పెట్టి, ఇంజన్ ఆఫ్ చేసేసినా సరే వాహనం మాత్రం నెమ్మదిగా ముందుకే సాగుతుంది. ఈ ప్రాంతంలో ఉన్న అయస్కాంత శక్తే దీనికి కారణమని కొందరు అంటారు. మరికొందరు మాత్రం ఈ ప్రాంతం ఏటవాలుగా ఉంటుందని, కానీ మన కళ్లకు మాత్రం ఎత్తుగా ఉన్నట్లు కనపడుతుందని అంటారు. ఏది ఏమైనా వాహనాలు నడపకుండా ముందుకు వెళ్లడం మాత్రం వాస్తవం.



Updated Date - 2021-06-14T19:48:21+05:30 IST