నేడు ‘వీడియోప్రజావాణి’కి శ్రీకారం

ABN , First Publish Date - 2020-07-03T10:29:31+05:30 IST

కరోనా లాక్‌డౌన్‌ కంటే ముందు ప్రజలు తమ సమస్యలను ఉన్నతాధికారులకు విన్నివించుకునేందుకు ప్రతీ సోమవారం కలెక్టరేట్‌లో జరిగే

నేడు ‘వీడియోప్రజావాణి’కి శ్రీకారం

అధికారులతో సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలకు అవకాశం 

ఖమ్మం కలెక్టరేట్‌లో ప్రత్యేక ఏర్పాట్లు

‘కరోనా’తో నాలుగునెలలుగా రద్దయిన ప్రజావాణి


ఖమ్మం కలెక్టరేట్‌, జూలై 2: కరోనా లాక్‌డౌన్‌ కంటే ముందు ప్రజలు తమ సమస్యలను ఉన్నతాధికారులకు విన్నివించుకునేందుకు ప్రతీ సోమవారం కలెక్టరేట్‌లో జరిగే ప్రజావాణికి వచ్చేవారు. కానీ కరోనా ప్రభావం కారణంగా నాలుగునెలలుగా ప్రజావాణి రద్దవడం, ఇప్పుడు అధికారులను కలిసే పరిస్థితి లేకపోవడంతో పౌరులు తమ గోడు వినిపించేందుకు కలెక్టర్‌, అదనపు కలెక్లర్లు, డీఆర్వో, ఇతర అధికారులను కలలవలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


అలాంటి వారి కోసం ఖమ్మం కలెక్టరేట్‌లో ‘వీడియో ప్రజావాణి’ కార్యక్రమం. నిర్వహిస్తున్నారు. శుక్రవారం నుంచి దీనిని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ కార్యక్రమం ద్వారా కలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌, అదనపు కలెక్టర్లు మధుసూదన్‌, స్నేహలత మెగిలి, డీఆర్వో శిరీష, ఏవో మదన్‌గోపాల్‌, తదితర అధికారులను నేరుగా కాకుండా వీడియోద్వారా కలిసి తమ సమస్యలు చెప్పుకొనే వీలు కల్పిస్తున్నారు. 


సంప్రదించాల్సిందిలా..

ఖమ్మం కలెక్టరేట్‌లోని పరిష్కృతి ఫిర్యాదుల విభాగంలో ప్రత్యేకంగా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇక్కడ ఓ టీవీని దానికి వెబ్‌ కెమెరాను అమర్చారు. ఫిర్యాదు దారులు ముందుగా కలెక్టరేట్‌కు వెళ్లి పరిష్కృతిలో సిబ్బందిని కలిసి తమ సమస్య గురించి దరఖాస్తు అందించాలి. ఏ అధికారితో మాట్లాడాలనుకుంటున్నారో చెప్పాలి. ఆ తర్వాత కలెక్టరేట్‌ సిబ్బంది అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక ఛాంబర్‌లోని టీవీకి ఎదురుగా ఫిర్యాదుదారుడిని కూర్చోబెట్టి... ప్రత్యేక లింక్‌ ఇస్తారు. ఆ వెంటనే కలెక్టర్‌, అదనపు కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు టీవీలో స్ర్కీన్‌పై కనిపిస్తారు.


అంతే ఇక వారితో మాట్లాడి సమస్యను విన్నవించుకునే వీలుంటుంది. సమస్యను ఈ వీడియో ద్వారా వినే అధికారులు తక్షణమే పరిష్కారానికి ఆదేశాలు జారీ చేయనున్నారు. కరోనా నేపథ్యంలో నేరుగా కలిసే అవకాశం లేకపోవడంతో.. పరోక్షంగా టీవీ వీడియో ద్వారా కలుసుకునే అవకాశాన్ని ఖమ్మం కలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌ ప్రజలకు కల్పిస్తున్నారు. ఈ అవకాశం శుక్రవారం నుంచి అందుబాటులోకి రానుండగా.. ఉదయం 10:30నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు వీడియో ప్రజావాణి ద్వారా అధికారులకు సమస్యలు చెప్పుకొనే అవకాశం ఉంటుంది. 

Updated Date - 2020-07-03T10:29:31+05:30 IST