Jul 8 2021 @ 01:34AM

తెలుగువారితో ప్రత్యేక అనుబంధం

దిలీప్‌కుమార్‌తో హిందీ చిత్రం నిర్మించిన తొలి దక్షిణాది నిర్మాత పక్షిరాజా సంస్థ అధినేత ఎస్‌.ఎం.శ్రీరాములు నాయుడు. ఆయన ఒకే కథతో తెలుగులో ‘అగ్గిరాముడు’(1954) చిత్రాన్ని , తమిళంలో ‘మలైక్కాలన్‌’ (1954)సినిమాను, హిందీలో ‘ఆజాద్‌’ (1955) చిత్రాన్ని నిర్మించారు, ఎన్టీఆర్‌, ఎమ్జీఆర్‌, దిలీప్‌కుమార్‌ ఆ చిత్రాల్లో హీరోలుగా నటించారు. తెలుగు, తమిళ భాషల్లో  భానుమతి, హిందీలో మీనాకుమారి  కథానాయికలుగా నటించారు. 1955లోనే దిలీప్‌కుమార్‌ నటించిన ‘దేవదాసు’ చిత్రం విడుదలైంది. అప్పటికి  అక్కినేని నాగేశ్వరరావు తెలుగులో నటించిన ‘దేవదాసు’ విడుదలై రెండేళ్లు అయింది. హిందీ ‘దేవదాసు’ తో దిలీప్‌కుమార్‌కు ‘ట్రాజడీ కింగ్‌’ గా గుర్తింపు వచ్చినా, అక్కినేని కంటే తను బాగా చేశానని ఆయన ఎప్పుడూ చెప్పలేదు. దేవదాసు పాత్రను అక్కినేని అద్భుతంగా పోషించారని ఆయన మెచ్చుకొనేవారు. ‘సినిమా దేవదాసు అంటే ఒకే ఒకరు.. అది అక్కినేని నాగేశ్వరరావు’ అని ఓ సందర్భంలో ప్రశంసించారు.

ఎన్టీఆర్‌ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన ‘రాముడు-భీముడు’ చిత్రాన్ని విజయా సంస్థ ‘రామ్‌ ఔర్‌ శ్యామ్‌’ (1967)పేరుతో హిందీలో రీమేక్‌ చేసింది. 

కృష్ణంరాజు ద్విపాత్రాభియనం చేసిన హిట్‌ చిత్రం ‘బొబ్బిలి బ్రహ్మన్న’ చిత్రాన్ని హిందీలో ‘ధర్మాధికారి’ పేరుతో రీమేక్‌ చేశారు. కృష్ణంరాజు పోషించిన రెండు పాత్రలను హిందీలో దిలీప్‌కుమార్‌, జితేంద్ర పోషించారు. హిందీ చిత్రానికి కూడా రాఘవేంద్రరావే దర్శకుడు. తెలుగులో ఏఎన్‌ఆర్‌, నాగార్జున నటించిన ‘కలెక్టర్‌గారి అబ్బాయి’ చిత్రాన్ని హిందీలో ‘కానూన్‌ అప్నా అప్నా’ పేరుతో రీమేక్‌ చేశారు. ఇందులో దిలీప్‌కుమార్‌, సంజయ్‌దత్‌ హీరోలుగా నటించారు. బి.గోపాల్‌ హిందీ చిత్రానికీ దర్శకత్వం వహించారు. తెలుగు సినిమా ఫంక్షన్స్‌కు హాజరవడం అంటే సరదా పడేవారు దిలీప్‌కుమార్‌. చిరంజీవి నటించిన ‘అడవిదొంగ’ వంద రోజుల వేడుకకు, ‘బొబ్బిలి బ్రహ్మన్న’ శతదినోత్సవానికి ఆయన గెస్ట్‌గా హాజరయ్యారు. ఎన్టీఆర్‌ నటించిన ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ ఆడియో వేడుకలో పాల్గొనడానికి ప్రత్యేకంగా ముంబై నుంచి విచ్చేశారు దిలీప్‌.