వాగ్భూషణం భూషణం

ABN , First Publish Date - 2020-07-18T08:30:43+05:30 IST

మధురంగా మాట్లాడడం ఒక కళ. అలా మాట్లాడగలగడమే మనిషికి అసలైన అలంకారం. సందర్భోచితంగా ఎదుటివారి మనసు

వాగ్భూషణం భూషణం

మధురంగా మాట్లాడడం ఒక కళ. అలా మాట్లాడగలగడమే మనిషికి అసలైన అలంకారం. సందర్భోచితంగా ఎదుటివారి మనసు గాయపడకుండా మాట్లాడడం గొప్ప లక్షణం. అందుకే లోకంలో ఇంపుగా మాట్లాడేవారిని ప్రజలు ప్రశంసిస్తారు. మేలు చేసేదే అయినప్పటికీ.. వినడానికి కఠోరంగా ఉండే మాటను ప్రజలు విశ్వసించరు. కఠిన భాష అనర్థదాయకమే గాక కార్యభంగానికి, పరాభవానికి కారణమవుతుంది. మాటల చేత దేవతలు వరాలిస్తారని..  రాజులు తమను ఆశ్రయించిన వారిని వారి మాటల ఆధారంగానే ఆదరిస్తారని.. మధురమైన మాటల చేతనే వనితామణులు వశవర్తులై, ముగ్ధులై సౌఖ్యములు ఇస్తారని.. వినయ మధురంగా మాట్లాడడం చేతగాని వానికి అవమానం కలుగుతుందని ప్రతీతి.


భూరి గుణోన్నతులనఁదగు

వారికి, ధీరులకు, ధరణి వల్లభులకు వా

క్పారుష్యము చన్నె? మహా

దారుణమది విషము కంటె దహనము కంటెన్‌!!


రాజసూయ యాగ సమయంలో శ్రీకృష్ణుని నిందిస్తున్న శిశుపాలునికి ధర్మరాజు  చేసిన హిత బోధ ఇది. ‘‘శిశుపాలా! గొప్ప గుణములచేత ఉన్నతులైన వారికి, ధీరులకు, రాజులకు కఠినంగా మాట్లాడడం తగునా? వాక్పారుష్యము (కఠినమైన మాటలు) విషం కంటే, అగ్ని కంటే కూడా దారుణమైనది కదా?’ అని దీని అర్థం. మానవులకు శాస్త్రసంస్కారమైన మాటలే భూషణాలు గానీ (వాగ్భూషణం భూషణం).. భుజకీర్తులు, సువర్ణాభరణాలు, అంగరాగలేపనాలు శోభను కలిగించవని భర్తృహరి చెప్పాడు. 


మధురమైన వాక్కులకు మన పురాణాల్లో గొప్ప ఉదాహరణ.. ఆంజనేయుడు! సీతమ్మతల్లిని వెతుకుతూ కిష్కింద ప్రాంతానికి వచ్చిన రామలక్ష్మణులతో హనుమ మాట్లాడిన మాటలను రాముడే ఎంతగానో మెచ్చుకున్నాడు. ‘ఈ మారుతి చతుర్వేద విజ్ఞాన సంపన్నుడైనందున, ఒక్క అపశబ్దం లేకుండా, మాట్లాడుతున్నాడు. ఇతడు సమస్త వ్యాకరణ శాస్త్ర ప్రవీణుడుగా ఉన్నాడు. మాట్లాడేటప్పుడు శరీర వికారాలు లేవు. అటు గంభీర స్వరంతో కాకుండా, ఇటు అల్ప స్వరంతో కాకుండా, మధ్యమ స్వరంతో మధురంగా సంభాషిస్తున్నాడు. ఇతడి వాక్చాతుర్యాన్ని గమనిస్తే.. చంపడానికి కత్తినెత్తిన క్రూరుడైనా శాంతించి, ఎత్తిన కత్తిని దించితీరవలసిందే’’ అని ప్రశంసించాడు.


జిహ్వాగ్రే వర్త తే లక్ష్మిః - జిహ్వాగ్రే మిత్రబంధవాః

జిహ్వాగ్రే బంధన ప్రాప్తి - జిహ్వా గ్రే మరణం ధృవం


మన నాలుక వల్లనే సంపదలు లభిస్తాయి. మిత్రులు, బంధువులు లభిస్తారు. మన మాట (నాలుక) వల్లనే ప్రాణహాని సంభవించును. మాటల ప్రభావం వల్లనే బంధన ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి, వీటన్నింటినీ గుర్తుపెట్టుకుని.. మృదుమధురంగా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి.


రాయసం రామారావు, 9492191360

Updated Date - 2020-07-18T08:30:43+05:30 IST