ఒక వ్యవస్థలో మరొకటి.. చొరబడకూడదు

ABN , First Publish Date - 2020-08-08T08:50:21+05:30 IST

శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు రాజ్యాంగానికి లోబడే పనిచేయాలని అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. ఈ వ్యవస్థలు ఒకదాని అధికారాల్లోకి

ఒక వ్యవస్థలో మరొకటి.. చొరబడకూడదు

  • మూడూ రాజ్యాంగానికి లోబడే పనిచేయాలి
  • 3 రాజధానుల చట్టంపై న్యాయ సమీక్ష మంచిదే 
  • సభాపతి నిర్ణయంలో కోర్టుల జోక్యం కూడదు
  • యనమలే స్పీకర్‌గా రూలింగ్‌ ఇచ్చారు: స్పీకర్‌ తమ్మినేని 

అమరావతి, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు రాజ్యాంగానికి లోబడే పనిచేయాలని అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. ఈ వ్యవస్థలు ఒకదాని అధికారాల్లోకి మరొకటి చొరబడకూడదన్నారు. మూడు రాజధానుల చట్టంలో రాజ్యాంగపరమైన అంశాలపై సమీక్షించడం మంచిదేనని.. ఈ పరిణామాన్ని ఆహ్వానిస్తున్నామని తెలిపారు. శాసనసభాపతిగా ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా ఆయన శుక్రవారమిక్కడ అసెంబ్లీ ప్రాంగణంలో శాసనసభ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులుతో కలిసి మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. సభాపతి, శాసనసభ తీసుకున్న నిర్ణయాలపై న్యాయస్థానం జోక్యం చేసుకోజాలదని 1997లో సభాపతి హోదా యనమల రామకృష్ణుడు రూలింగ్‌ ఇచ్చారని.. ఇప్పుడు కోర్టులకెళ్తామని ఆయనే అంటున్నారని.. ఇది రెండు నాల్కల వైఖరి అని ఆరోపించారు.


సెలెక్ట్‌ కమిటీ నిర్ణయించకముందే.. మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీలో మళ్లీ ప్రవేశపెట్టడాన్ని సవాల్‌ చేస్తూ టీడీపీ ఎమ్మెల్సీలు హైకోర్టుకు వెళ్లడంపై అసహనం వ్యక్తం చేశారు. మూడు రాజధానుల బిల్లుపై శాసనసభలో సుదీర్ఘంగా 11 గంటల పాటు చర్చ జరిగిందన్నారు. మూడు రాజధానుల బిల్లులపై సహజంగా న్యాయకోవిదుడైన గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌.. న్యాయ, రాజ్యాంగ నిపుణులతో సమీక్షించాకే ఆమోదముద్ర వేశారని తెలిపారు. రాష్ట్ర రాజధానిని ఫ్రీజోన్‌ చేయడం సహా.. మూడు ప్రాంతాల్లోనూ అభివృద్ధిని సమానంగా వికేంద్రీకరణ చేస్తామని వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో జగన్‌ స్పష్టం చేశారని చెప్పారు.


ఎమ్మెల్యేల హక్కులు కాపాడేందుకే..

పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించనంటూనే.. రాష్ట్రంలో టీడీపీకి చెందిన ముగ్గురు శాసనసభ్యులకు ప్రత్యేక స్థానాలు ఎలా కేటాయించారని ప్రశ్నించగా.. వారి అభ్యర్థన మేరకు ప్రత్యేక స్థానాలు కేటాయించానని.. ఇందులో తప్పేముందని తమ్మినేని బదులిచ్చారు. ఇలా ప్రత్యేక స్థానాలు కేటాయించేందుకు రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ సహా ఇతర నిబంధనలు అంగీకరిస్తాయా అని అడుగగా.. సభాపతిగా సభ్యుల హక్కులు కాపాడడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. తన ఏడాది పదవీ కాలంలో ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి దోహదపడే 52 బిల్లులను ఆమోదించామని తెలిపారు. సభానాయకుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు తనకు సహకరించారన్నారు. 

Updated Date - 2020-08-08T08:50:21+05:30 IST