అమరావతి: ‘చంద్రబాబు హయాంలో పెగాసస్ స్పైవేర్ కొన్నారు’ అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. అంతే.. దానిపై ఏపీలో రచ్చ మొదలైంది. ‘మేం పెగాసస్ కొనలేదు’ అని చంద్రబాబు స్పష్టం చేశారు. ‘ఏపీలో పెగాస్‌సను ఉపయోగించలేదు. ఇది వందశాతం నిజం’ అని అప్పటి నిఘా విభాగం చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు తేల్చి చెప్పారు. ఇక.. వైసీపీ హయాంలోనే డీజీపీగా పని చేసిన గౌతమ్ సవాంగ్, ‘మన రాష్ట్రంలో పెగాసస్ వాడలేదు’ అని అప్పుడెప్పుడో స్పష్టం చేశారు. ఈ సంగతులన్నీ ఎలా ఉన్నా.. ఈ అంశాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం సభా సంఘానికి అప్పగించారు.
పెగాసస్‌పై అసెంబ్లీలో పెద్ద దుమారం రేగింది. దీనిపై విచారణకు హౌస్ కమిటీ వేయాలని సభ్యులు సూచించారు. దీంతో పెగాసస్‌పై స్పీకర్ హౌస్ కమిటీ వేశారు. ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటుచేశారు. ఈ కమిటీకి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. కొత్తపల్లి భాగ్యలక్ష్మి, గుడివాడ అమర్నాథ్, మేరుగు నాగార్జున, మద్దాలి గిరిధర్, పార్థసారధి, అబ్బయ్య చౌదరి సభ్యులుగా నియమించారు. వైసీపీ సర్కారు ఇదే పెగాసస్ అస్త్రాన్ని చంద్రబాబుపై గురి పెట్టింది. అసలు విషయం ఏమిటంటే... ‘పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను చంద్రబాబు ప్రైవేటుగా కొన్నారు’ అంటూ కొత్త ఆరోపణలు చేస్తోంది. ఇలా ఎవరుపడితే వాళ్లు పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేయవచ్చా? కుదరనే కుదరదు. ఫోన్లపై డిజిటల్ నిఘాపెట్టే అత్యాధునిక సాఫ్ట్వేర్ ఇది. ఇజ్రాయెల్ జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఎస్వో) దీనిని రూపొందించింది.
అసలు పెగాస్‌సను రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొనుగోలు చేయవచ్చు. కానీ... దీనిపై వారి స్థాయిలో నిర్ణయం తీసుకుంటే సరిపోదు. ఈ ప్రతిపాదనను ముందు కేంద్ర హోం శాఖకు పంపించాలి. అక్కడ అంతర్గత భద్రతా విభాగంతోపాటు నిఘా విభాగం నుంచి నివేదిక తెప్పించుకుంటారు. తర్వాత కేంద్రం విధాన నిర్ణయం తీసుకోవాలి. అంతా ఒకే అనుకుంటే... కేంద్రం ద్వారానే రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయాలి. ఇవన్నీ పరిశీలించకుండా వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుపై నెట్టే ప్రయత్నం చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి