స్పర్శాపూలరుతువై...

ABN , First Publish Date - 2020-04-20T09:41:05+05:30 IST

రోజులు గడుస్తూనే వుంటాయి అంతటా వొంటరి పరిమళమే విశ్వవ్యాప్తంగా కొత్తచివురుల చిన్నిదరహాసం కూడా వొంటరే మాయావి వెలుతురుజాడలు...

స్పర్శాపూలరుతువై...

రోజులు గడుస్తూనే వుంటాయి

అంతటా

వొంటరి పరిమళమే

విశ్వవ్యాప్తంగా

కొత్తచివురుల చిన్నిదరహాసం కూడా

వొంటరే


మాయావి వెలుతురుజాడలు

సామూహికత నుంచి విడివిడి వ్యక్తులుకా

వ్యక్తుల నుంచి అనేక సమూహాలకా...

యేమో...

ప్రేమ కూడా వో అదృశ్యాదృశ్యమైన చోట

వెలుతురు చూపులు కూడా నిశీథి దోబూచులాటల్లానే

తోచి ఆత్మీయభయాందోళనల సమ్మిళితమై

మనసులో claustrophobic సర్కిల్స్‌ 

మెలికలు తిరుగుతుంటాయి 


యిన్నేళ్ళ మానవుల ప్రేమచరిత్ర

యెన్నెన్ని అపనమ్మకాల యిరుసుమీదే

తిరుగుతోందనే యెరుక- ఆపరేట్‌ చెయ్యటం రాని లిఫ్ట్‌ యెక్కి 

మధ్యలో యిరుక్కుపోయిన నిస్సహాయ వూపిరిలా 

యెదురు చూపు మొదలవుతోంది ప్రతి వుదయం... 

కొన్ని తేనె పిట్టలు... కొన్ని కోయిలలు దయతో కొన్ని పాటల్ని

విరబూసిన వేపపువ్వుల తీపిగాలుల్ని

కాస్తోన్న మామిడికాయల వగరుగాలుల్ని

యిస్తుండబట్టీ కొనసాగే కాసింత ప్రాణవాయువేదో 

కొనసాగిస్తోంది మనతో మనల్ని...


అలా

రోజులు గడుస్తూనే వుంటాయి

అక్కడెక్కడో పలకరింపు కూడా లేని ఆత్మస్నేహం

మరెక్కడి పలకరింతో ఆత్మబంధువు

అంతటా

వొంటరి పరిమళంతో

మొదలవుతోంది ప్రభాతం...

జీవనమంటే సామూహిక ప్రవాహం కదా...

మరి యిదేమిటి...


కనురెప్పల కింద మనసుని జైళ్ళులా కూరేసిన 


యీ వొంటరి సంకెల చప్పుడేంటి...

కలయికలే నిషిద్ధమైన యీ సందర్భపు గాయాలని

భవిష్యత్‌ చరిత్ర యే పురాస్వప్నపు వేకువై 

అపారమైన నమ్మకమైన సామూహిక కరచాలనమై 

ప్రతి వేకువని నులివెచ్చని స్పర్శాపూలరుతువై విరబూస్తుందో

ఆ సూర్యోదయం ఖచ్చితంగా విచ్చుకుంటుందనే నమ్మకంతో 

                                           నిరీక్షిస్తూ... 

కుప్పిలి పద్మ


Updated Date - 2020-04-20T09:41:05+05:30 IST