స్పందనలో వినతుల వెల్లువ

ABN , First Publish Date - 2022-05-24T06:13:58+05:30 IST

డోన్‌లో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌కు వినతి పత్రాలు వెల్లువెత్తాయి.

స్పందనలో వినతుల వెల్లువ

 డోన్‌ (రూరల్‌) మే 23: డోన్‌లో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌కు వినతి పత్రాలు వెల్లువెత్తాయి.


 2019-20, 2020-21 సంవత్సరాల్లో పంట నష్టపోయిన రైతులకు వెంటనే పంట నష్టపరిహారం అందజేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు, జిల్లా కమిటీ సభ్యులు సుంకయ్య, రాధాకృష్ణ, ఏపీ గిరిజన సమాఖ్య జిల్లా  ప్రధాన కార్యదర్శి మోట రాముడు  వినతి పత్రం అందజేశారు.  


 డోన్‌ పట్టణ శివారులో ఉన్న  కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి నగర్‌, కోట్ల సుజాతమ్మ నగర్‌, వైఎస్సార్‌ నగర్‌ తదితర కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలని నంద్యాల కాంగ్రెస్‌ లోక్షభ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గార్లపాటి మద్దిలేటి డిమాండ్‌ చేశారు.  కాంగ్రెస్‌ నాయకులు జనార్దన్‌ యాదవ్‌, సుబ్బు యాదవ్‌, వడ్డె రాజశేఖర్‌, మధుసూదన్‌ రెడ్డి పాల్గొన్నారు. 


 డోన్‌ పట్టణంలో మెడికల్‌ మాఫియాను అరికట్టాలని బీజేపీ కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షులు హేమ సుందర్‌ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు వడ్డె మహారాజ్‌  వినతి పత్రం అందజేశారు.  


 డోన్‌ డిపో నుంచి నంద్యాల జిల్లాకు ఎక్స్‌ప్రెస్‌ బస్సులను నడపాలని డీవైఎఫ్‌ఐ నాయకులు నక్కి హరి  వినతి పత్రం అందజేశారు.  


 పట్టణంలో పలు ప్రైవేటు పాఠశాలలు ముందస్తు అడ్మిషన్ల పేరుతో వసూలు చేస్తున్న అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ  సభ్యులు తెలుగు విజయ కుమార్‌ డిమాండ్‌ చేశారు. 


 డోన్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్న పిల్లల వైద్యుడ్ని, ఇతర విభాగాల్లో కూడా వైద్యులను నియమించాలని  ఏఐవైఎఫ్‌ నియోజకవర్గ కార్యదర్శి రణత్‌ యాదవ్‌ వినతి పత్రం అందజేశారు. 


స్పందన అర్జీలపై సత్వర చర్యలు: జేసీ 


నంద్యాల టౌన్‌: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘స్పందన’లో ప్రజలు ఇచ్చిన  అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని జాయింట్‌ కలెక్టర్‌ నారపురెడ్డి మౌర్య అన్నారు. సోమవారం ఆర్‌ఏఆర్‌ఎస్‌ సెంటినరీ భవన్‌లో స్పందన కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలాల నుంచి ప్రజలు సమస్యలపై అర్జీలను జేసీకి సమర్పించారు. స్పందన అర్జీలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత విభాగాల అధికారులకు సూచించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న అటవీ కార్మికులకు టైం స్కేల్‌ అమలు చేయాలని నంద్యాల సీఐటీయూ  శాఖ ఆధ్వర్యంలో జేసీకి వినతిపత్రాన్ని అందజేశారు.  


Updated Date - 2022-05-24T06:13:58+05:30 IST