స్పందన.. అంతంతే!

ABN , First Publish Date - 2022-08-09T06:23:43+05:30 IST

స్పందన కార్యక్రమం జిల్లాలో మొక్కుబడిగా తంతుగా మారింది.

స్పందన..  అంతంతే!

సంవత్సరాల తరబడి తిరుగుతున్న అర్జీదారులు

అధికారులకు వేడుకోలు 

పరిష్కారానికి నోచుకోని అర్జీలు 

హైకోర్టు చెప్పినా నాన్చుడే..


గుంటూరు, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): స్పందన కార్యక్రమం జిల్లాలో మొక్కుబడిగా తంతుగా మారింది. ప్రతీ సోమవారం వందల సంఖ్యలో ప్రజలు అర్జీలు చేతబట్టుకొని రావడం, మధ్యాహ్నం వరకు ఉండి అధికారులకు నివేదించడం, వాటిని అధికారులు పరిష్కరించకపోతుండటం సర్వసాధారణంగా మారిపోయింది. నెలలు, సంవత్సరాల తరబడి అర్జీదారులు స్పందనకు వచ్చి మొరపెట్టుకొంటున్నా వారి సమస్యలు పరిష్కారం కావడం లేదు. భూవివాదాల విషయంలో అయితే కోర్టు ధిక్కరణ కేసులు నమోదు అవుతున్నా అధికారుల్లో చలనం కలగడం లేదు. అర్జీల్లో ఎక్కువగా భూవివాదాలే ఉంటున్నాయి. నవరత్నాల పథకాలకు తమని అనర్హులుగా చేశారని ప్రతీ వారం కొందరు వచ్చి అర్జీలు ఇచ్చి పోతున్నారు. 

ఎప్పటిలానే ఈ సోమవారం ఉదయం 10 గంటలకు కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి వచ్చి తొలుత డయల్‌ యువర్‌ కలెక్టర్‌ ఫోన్‌కాల్స్‌ ద్వారా ఫిర్యాదులు స్వీకరించారు. ఇలా చేసిన ఫిర్యాదులకు పరిష్కార శాతం చాలా తక్కువగా ఉంటుండటంతో ప్రజలు ఫోన్‌కాల్స్‌ చేయడం కూడా మానేశారు. 10.30 గంటలకు ప్రజల నుంచి అర్జీల స్వీకరణని కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ప్రారంభించారు. కలెక్టర్‌తో పాటు జేసీ రాజకుమారి, డీఆర్‌వో చంద్రశేఖర్‌రావు, డిప్యూటీ కలెక్టర్లు ఒక్కొక్కరిని లోపలికి పిలిచి అర్జీలు స్వీకరించారు. నిబంధనల ప్రకారం జిల్లా స్థాయిలో జరిగే స్పందనకు అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా ఉన్నతాధికారులు హాజరు కావాలి. ఏదైనా అత్యవసరమైతే తప్ప అది కూడా కలెక్టర్‌ అనుమతి తీసుకొని ప్రత్యామ్నాయ అధికారిని పంపాలి. కాగా జిల్లా కేంద్రంలో జరిగే స్పందనకు చాలామంది జిల్లా అధికారులు హాజరు కావడం లేదు. కొంతమంది వచ్చినా 10 నిమిషాలు ఉండి ఏదో అత్యవసరం పని ఉందని వెళ్లిపోతున్నారు. గుంటూరు మునిసిపల్‌ కార్పొరేషన్‌ నుంచి సోమవారం టౌన్‌ప్లానింగ్‌ స్థాయి అధికారి మాత్రమే హాజరయ్యారు. పోలీసుశాఖ నుంచి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ వచ్చారు. ఇరిగేషన్‌, ఏపీసీపీడీసీఎల్‌ నుంచి అయితే జేఈఈ స్థాయి అధికారులే వచ్చారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ నుంచి ఇదే పరిస్థితి. వీరికి అర్జీదారులు చేసే ఫిర్యాదులపై కనీస అవగాహన కూడా ఉండటం లేదు. మీ ఫిర్యాదుని సంబంధిత అధికారికి పంపిస్తామని చెప్పి పంపించేశారు. 

ఏ అధికారి తమ ఫిర్యాదు పరిష్కారం విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని అర్జీ ఇచ్చారో జిల్లా స్థాయి అధికారులు అందుకు వివరణ తీసుకోకుండా తిరిగి అదే అధికారి వద్దకు పంపుతున్నారు. ఈ కారణంగానే గుంటూరు జిల్లాలో 450కి పైగా అర్జీలు రీఓపెన్‌ అయ్యాయి. దీని వలన గతంలో అర్జీల పరిష్కారంలో 2వ స్థానంలో ఉన్న గుంటూరు నేడుఉ 8వ స్థానానికి పడిపోయింది. అర్జీలు ఇవ్వడానికి వచ్చిన ఏ ఒక్కరిని కదిపినా తాము 10 నెలలు, మూడేళ్ల నుంచి తిరుగుతున్నామని ఆవేదన చెందుతున్నారు. గుంటూరు జిల్లాలో ప్రతీ వారం 230 వరకు అర్జీలు అందేవి. జిల్లా విభజన తర్వాత కూడా ఆ సంఖ్య 190 వరకు ఉంటుండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రతీ వారం జిల్లా స్థాయిలో కలెక్టర్‌, రాష్ట్ర స్థాయిలో చీఫ్‌ సెక్రెటరీ స్పందన అర్జీలపై సమీక్ష నిర్వహిస్తున్నా ఎలాంటి మార్పు కనిపించడం లేదు. 

హైకోర్టు ఆగ్రహించినా జాప్యం చేస్తోన్నారు: నరేంద్ర, విశదల గ్రామం, మేడికొండూరు

మా అమ్మ పేరు మీద విశదల గ్రామంలోని 257 సర్వే నెంబరులో 1.02 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని 2016లో  అప్పటి రెవెన్యూ అధికారులు 22(ఏ)1(ఈ)లో చేర్చారు. మా సర్వే నెంబరులో మరో ఎనిమిది మంది రైతుల భూములు కూడా ఉన్నాయి. నిషేధిత భూముల జాబితాలో చేర్చడం వలన ఎలాంటి రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. దీనిపై స్థానిక తహసీల్దార్‌, గుంటూరు ఆర్‌డీవో, కలెక్టరేట్‌లో ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. మూడేళ్లపాటు తిరిగి అలసిపోయి చివరికి హైకోర్టులో కేసు వేశాను. అక్కడ అనుకూలంగా తీర్పు వచ్చింది. అయినా జిల్లా అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటీషన్‌ వేశాను. దాంతో కలెక్టర్‌ హైకోర్టుకు రావాల్సి వచ్చింది. నాలుగు వారాల వ్యవధిలో సమస్య పరిష్కరించమని ఆదేశాలు ఇవ్వడంతో ఎట్టకేలకు సీసీఎల్‌ఏ నుంచి 22ఏ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు వచ్చాయి. వాటి ఆధారంగా 1బి అడంగల్‌లో సవరణలు చేయాల్సి ఉండగా అది కూడా జాప్యం చేస్తున్నారు. 


ఏడాదైనా నష్టపరిహారం ఇవ్వడం లేదు: ముంగి మంగమ్మ, గుంటూరు 

గత ఏడాది వర్షాకాలంలో గుంటూరు నగరం నడిబొడ్డు నుంచి ప్రవహించే పీకలగవాడులో ప్రమాదవశాత్తు పడి నా కుమారుడు వెంకటేష్‌(5) చనిపోయాడు. అప్పట్లో రూ.5 లక్షల నష్టపరిహారాన్ని ప్రభుత్వం తరుపున ప్రకటించారు. తీరా రూ.50 వేలు చేతిలో పెట్టి చేతులు దులుపుకొన్నారు. ఈ విషయంపై ప్రతీ వారం స్పందనకు వచ్చి అర్జీ ఇస్తున్నా నస్టపరిహారం విడుదల చేయడం లేదు. ఈ విషయంలో సీఎం జగన్‌ని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి నివేదించినా అధికారులు ఏ విధమైన సాయం అందించ లేదు. ఎప్పటికైనా అధికారుల మనస్సు మారకపోతుందానన్న ఆశతో ప్రతీ సోమవారం పని మానుకొని వచ్చి అర్జీ ఇస్తున్నాను. 

Updated Date - 2022-08-09T06:23:43+05:30 IST