స్పందన అర్జీలను త్వరగా పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-05-28T06:48:22+05:30 IST

గిరిజనులు తమ సమస్యలపై స్పందన కార్యక్రమంలో సమర్పించే అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు.

స్పందన అర్జీలను త్వరగా పరిష్కరించాలి
స్పందనలో గిరిజనుల సమస్యలు వింటున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌

జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ 

గిరిజనుల నుంచి 58 వినతులు స్వీకరణ

 

పాడేరు, మే 27(ఆంధ్రజ్యోతి): గిరిజనులు తమ సమస్యలపై స్పందన కార్యక్రమంలో సమర్పించే అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అధికారులు తమ సమస్యలను పరిష్కరిస్తారనే నమ్మకంతో గిరిజనులు సదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి స్పందనలో వినతులు సమర్పిస్తున్నారని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని కలెక్టర్‌ పేర్కొన్నారు. 

స్పందనలో 58 వినతులు స్వీకరణ

జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ నిర్వహించిన స్పందన కార్యక్రమంలో గిరిజనులు 58 ఆర్జీలు అందజేశారు. డుంబ్రిగుడ మండలం కోసంగి, పనసపుట్టు గ్రామాలకు చెందిన  56 మందికి ప్రత్యేకంగా కాలనీ నిర్మించారని, కానీ అక్కడ కనీస సదుపాయాలు లేవని గిరిజనులు తెలిపారు. జి.మాడుగుల మండలం పెదలోచలి పంచాయతీ పినలోచలి ప్రాంతానికి చెందిన 40 మంది గిరిజనులు తమకు అటవీ హక్కులు కల్పించాలని కోరగా, పాడేరు మండలం వనుగుపల్లి ప్రాంతంలో గ్రామ సచివాలయం ఏర్పాటు చేయాలని స్థానికులు వినతిపత్రం సమర్పించారు. అరకులోయలో గిరిజనేతరుడైన రంగా సత్యనారాయణ 1/70 చట్టాన్ని ఉల్లంఘించి, ఎటువంటి అనుమతులు లేకుండా రెండు అంతస్థుల భవనం నిర్మించారని, అతనిపై ఎల్‌టీఆర్‌ కేసు నమోదు చేయాలని జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ జిల్లా అధ్యక్షుడు బి.శ్రీధర్‌చక్రవర్తి ఫిర్యాదు చేశారు. తమ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని పాడేరు మండలం వనుగుపల్లి పంచాయతీ చింతగున్నెల, మాతికబంద గ్రామాలకు చెందిన పలువురు కోరారు. ఇంకా వ్యక్తిగత, సామాజిక సమస్యలపై పలువురు అర్జీలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ, సబ్‌కలెక్టర్‌ వి.అభిషేక్‌, వివిధ శాఖలకు చెందిన జిల్లా అఽధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-28T06:48:22+05:30 IST