‘స్పందన’ అర్జీలు వారంలోపు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-08-03T05:39:30+05:30 IST

ప్రతి సోమవారం జరిగే ‘స్పందన’ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను వారం వ్యవధిలో పరిష్కరించాలని కలెక్టర్‌ చక్రధర్‌బాబు అధికారులకు సూచించారు.

‘స్పందన’ అర్జీలు   వారంలోపు పరిష్కరించాలి
ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్‌, జేసీలు

అధికారుల సమీక్షలో కలెక్టర్‌


నెల్లూరు(హరనాథపురం), ఆగస్టు 2 : ప్రతి సోమవారం జరిగే ‘స్పందన’ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను వారం వ్యవధిలో పరిష్కరించాలని కలెక్టర్‌ చక్రధర్‌బాబు అధికారులకు సూచించారు. సోమవారం తిక్కన భవన్‌లో జరిగిన సమీక్షలో కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా వివిధ సమస్యలపై 21,666 అర్జీలు రాగా 19,721 అర్జీలను పరిష్కరించినట్లు తెలిపారు. 498 అర్జీలు గడువులోగా పరిష్కారం కాలేదన్నారు. ముఖ్యంగా సచివాలయ పరిధిలో 185 అర్జీలు ఉన్నట్లు తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది తప్పనిసరిగా బయోమెట్రిక్‌ హాజరు వేసి క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జేసీలు హరేంధిరప్రసాద్‌, గణేష్‌కుమార్‌, విధేహ్‌ఖరే తదితరులు పాల్గొన్నారు. 


‘స్పందన’కు పోటెత్తారు!

కలెక్టర్‌రేట్‌లోని తిక్కన భవన్‌లో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. వృద్ధాప్య  ఫించన్ల కోసం, ఇళ్ల స్థలాల కోసం, భూసమస్యల పరిష్కారం కోసం  ప్రజలు అధికారులకు అర్జీలు ఇచ్చారు. కలెక్టర్‌ చక్రధర్‌బాబు, జాయింట్‌ కలెక్టర్‌లు హరేందిరప్రసాద్‌, గణేష్‌కుమార్‌ తదితరులు అర్జీలు స్వీకరించారు. 



9శ్రావణ్‌2: అర్జీలు స్వీకరిస్తున్న ఎస్పీ విజయరావు


‘స్పందన’పై ప్రతి శనివారం సమీక్ష : ఎస్పీ

నెల్లూరు(క్రైం), ఆగస్టు 2: స్పందన కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులపై ప్రతి శనివారం సమీక్ష జరుపుతానని ఎస్పీ సీహెచ్‌ విజయరావు పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన స్పందనలో ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుంచి వచ్చే ఫిర్యాదుదారులతో సోదరభావంతో నడుచుకోవాలని, వారి సమస్యలు అడిగి తెలుసుకుని సంబంధిత పోలీసులతో మాట్లాడి వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ అడ్మిన్‌ వెంకటరత్నం, రూరల్‌ డీఎస్పీ హరనాఽథ్‌రెడ్డి, ఎస్సీ ఎస్టీ సెల్‌ -2 డీఎస్పీ వై శ్రీనివాసరావు, ఏఆర్‌ డీఎస్పీ గాంధీ తదితరరులు పాల్గొన్నారు.


రవాణాశాఖలో ‘స్పందన’

నెల్లూరులోని రవాణాశాఖ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమం పునఃప్రారంభం అయింది. కరోనా కారణంగా కొన్ని నెలల క్రితం ఈ కార్యక్రమాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే. సోమవారం జరిగిన స్పందనలో నెల్లూరు ఆర్టీవో సుశీల ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. డ్రైవింగ్‌ లైసెన్సు, ఆర్సీ కార్డులు రాలేదని ఎక్కువ మంది ఫిర్యాదు చేశారు. ఇప్పటికే స్పీడు పోస్టు ద్వారా పంపామని త్వరలోనే ఇళ్లకు చేరుతాయని వారికి ఆర్టీవో సమాధానమిచ్చారు.


బార్డర్‌ వరకే బస్సులు

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), ఆగస్టు 2: తమిళనాడులో కరోనా కర్ఫ్యూ కొనసాగుతున్న దృష్ట్యా ఈ నెల 8వ తేదీ వరకు ఆంధ్ర సరిహద్దు వరకే ఆర్టీసీ బస్సులు నడుస్తాయని ఆర్టీసీ ఆర్‌ఎం శేషయ్య ఓ ప్రకటనలో పేర్కొన్నారు. చెన్నైకు వెళ్లే ప్రయాణికులు రాష్ట్ర సరిహద్దు వరకు నెల్లూరు రీజియన్‌ బస్సుల్లో ప్రయాణించి అక్కడి నుంచి చెన్నై బస్సుల్లో ప్రయాణించవచ్చన్నారు.

Updated Date - 2021-08-03T05:39:30+05:30 IST