స్పందన అంతంతే!

ABN , First Publish Date - 2022-08-09T06:49:14+05:30 IST

జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తుతున్నాయి.

స్పందన అంతంతే!
కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేస్తున్న పారిశుధ్య కార్మికులు

- సమస్యలపై అర్జీల వెల్లువ

- పింఛన్లు, రేషన్‌ కార్డులు, ఇళ్ల స్థలాల కోసం ఎక్కువ దరఖాస్తులు 

- పరిష్కారం కాకపోయినా అయిపోయినట్టు అధికారులు చూపుతున్నారని పలువురి ఆరోపణ

 

అనకాపల్లి కలెక్టరేట్‌, ఆగస్టు 8: జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఎక్కువగా పింఛన్లు, రేషన్‌ కార్డులు, ఇళ్ల స్థలాల కోసమే అర్జీలు వస్తున్నాయి. కలెక్టరేట్‌ ఏర్పడిన నాలుగు నెలల్లో ఇప్పటి వరకు స్పందన కార్యక్రమానికి 2,646 అర్జీలు రాగా, 1,681 పరిష్కారమయ్యాయి. ఇంకా 965 అపరిష్కృతంగా ఉన్నాయి. వీటిలో భూ సంబంధిత వివాదాలే ఎక్కువగా ఉన్నాయి. కాగా పింఛన్‌, రేషన్‌ కార్డు కోసం వినతులు ఇస్తే పరిష్కారం కాకుండానే పరిష్కారమైనట్టు అధికారులు చూపుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. 

వర్షాన్ని సైతం లెక్క చేయకుండా...

 అనకాపల్లి కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమాన్ని ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధులు పరిశీలించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభం కావలసిన ఈ కార్యక్రమం వర్షం కారణంగా 11.30 గంటలకు మొదలైంది. అధిక సంఖ్యలో అర్జీదారులు వచ్చారు. వివిధ సమస్యలపై 170 మంది వినతులు సమర్పించారు. కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టితో పాటు జేసీ కల్పన కుమారి, వివిధ శాఖల అధికారులు అర్జీలు స్వీకరించారు. ఎక్కువగా భూ వివాదాలు, వ్యక్తిగత సమస్యలపై అర్జీలు అందాయి. పింఛన్లు, ఇళ్ల పట్టాలు, బియ్యం కార్డుల కోసం అందిన దరఖాస్తులను కలెక్టర్‌, జేసీలు స్వయంగా పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు పంపారు. 

కలెక్టరేట్‌ ఎదుట ఆందోళనలు

కలెక్టరేట్‌ బయట వివిధ వర్గాలకు చెందిన పలువురు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. నక్కపల్లి మండలంలోని డీఎల్‌పురం వద్ద ప్రభుత్వం విశాఖ, చెన్నై ఇండస్ట్రీయల్‌ కారిడార్‌ కోసం భూసేకరణ చేసిన డి.ఫారం భూములకు పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సుమారు 40 మంది రైతులు కలెక్టరేట్‌ ప్రధాన ద్వారం వద్ద ఆందోళన చేశారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. తమకు వేతనాలు అందలేదంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అనకాపల్లిలో మంజూరైన కేంద్రీయ విద్యాలయంలో తరగతులను ప్రారంభించాలని టీడీపీ నాయకులు కలెక్టర్‌ను కోరారు. ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.  

-----

కాళ్లరిగేలా తిరుగుతున్నా..

విశాఖ, చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌ ఏర్పాటు కోసం నక్కపల్లి మండలం డీఎల్‌ పురం గ్రామంలో 22/11 సర్వే నంబరులో మాకు చెందిన 0.24 సెంట్ల డీఫారం పట్టా భూమిని ప్రభుత్వం తీసుకుంది. ఇంత వరకు పరిహారం అందలేదు. ఉమ్మడి విశాఖపట్నం కలెక్టరేట్‌లో కూడా అనేకసార్లు దరఖాస్తు చేశాను. కొత్తగా అనకాపల్లి కలెక్టర్‌ కార్యాలయం వచ్చిందని తెలిసి, ఈ ఏడాది మే నెలలో అర్జీ పెట్టాను. స్పందన రాలేదు. సర్వే చేశారు. పరిహారం ఇవ్వలేదు. మళ్లీ ఇప్పుడు కలెక్టర్‌కు అర్జీ పెట్టుకున్నాను. పరిహారం కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నా అందలేదు.

- గింజాల అప్పాయ్యమ్మ, డీఎల్‌ పురం, నక్కపల్లి మండలం







Updated Date - 2022-08-09T06:49:14+05:30 IST