జాగా.. పాగా

ABN , First Publish Date - 2021-07-30T05:20:18+05:30 IST

జాగా.. పాగా

జాగా.. పాగా
తూంకుంటలో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటైన వెంచర్‌

  • మేడ్చల్‌ జిల్లాలో అడ్డగోలుగా భూ ఆక్రమణలు
  • ఫిర్యాదులు అందినా కంటితుడుపు చర్యలు
  • భారీగా ఆక్రమణలు జరిగినట్లు 
  • ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణలో వెల్లడి

(ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌ జిల్లా ప్రతినిధి) : జిల్లాలో 61 గ్రామ పంచాయతీల్లో పలు చోట్ల వెలసిన వెంచర్లలో పార్కుల స్థలాలు, రోడ్ల స్థలాలు ఆక్రమణకు గురై వాటిలో షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, భవనాలు నిర్మాణాలు చేపట్టినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందం ప్రభుత్వానికి నివేదికలు పంపింది. మేడ్చల్‌ జిల్లాలో పలు చోట్ల 1989 గజాల స్థలం కబ్జాకు గురైనట్లు పేర్కొంది. అదే విధంగా గ్రామ పంచాయతీల్లో వెంచర్లలో ఏర్పాటు చేసిన పార్కు స్థలాల్లో 3,643 అక్రమ కట్టడాలు ఉన్నట్లు గుర్తించారు. ఘట్‌కేసర్‌లో 656 అక్రమ కట్టడాలు, కీసరలో 650, శామీర్‌పేటలో  191, మేడ్చల్‌ మండలంలో 196, నాగారం, దుమ్మాయిగూడలో 19, తూంకుంటలో 15, దుండిగల్‌లో 12, పోచారంలో 12 ప్రభుత్వ స్థలాలను కబ్జాకు గురైనట్లు ఆరోపణలున్నాయి. కీసర మండలం నాగారం మునిసిపాలిటీలో ఏర్పాటు చేసిన వెంచర్‌ నిర్వాహకులు 12 వేల గజాల రోడ్డు స్థలాన్ని, 1670 గజాల పార్కు స్థలాన్ని ఆక్రమించారనే ఆరోపణలున్నాయి. ఇదే వెంచర్‌ నిర్వాహకులు జాలుబాయి కుంట ఐదెకరాల స్థలాన్ని అక్రమించి ప్రహరీ నిర్మాణం చేపట్టారు. ఈ విషయంపై స్థానికుల ఫిర్యాదు మేరకు రెవెన్యూ అధికారులు సర్వే చేయించారు. వెంచర్‌ నిర్వాహకులకు నోటీసులు ఇచ్చామని కీసర తహశీల్దార్‌ గౌరి వత్సల తెలిపారు. నోటీసులకు స్పందించకుంటే తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 

శామీర్‌పేట మండలం తూంకుంట మునిసిపాలిటీలో నాలుగు ఎకరాల 28 గుంటల భూమిలో కొందరు వెంచర్‌ ఏర్పాటు చేసి హూడా నిబంధనలు పాటించకుండా ప్లాట్లను విక్రయిస్తున్నట్లు స్ధానికులు, కౌనిల్సర్లు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఓ కౌన్సిలర్‌ ఆరోపిస్తున్నారు. వెంచర్‌లో వంద ఫీట్ల మెయిన్‌రోడ్డు వేయాల్సి ఉండగా 66 ఫీట్ల రోడ్లు మాత్రమే వేశారని అధికారులకు ఫిర్యాదు చేశారు. సంబంధిత వెంచర్‌ నిర్వాహకులపై రెండు ఫిర్యాదులు వచ్చాయని, ఉన్నతాధికారుల ఆదేశాలతో చర్యలు తీసుకుంటామని తూంకుంట కమిషనర్‌ గంగాధర్‌ తెలిపారు.

Updated Date - 2021-07-30T05:20:18+05:30 IST