ఐకమత్యంగా ఉండాలి : ఎస్పీ

ABN , First Publish Date - 2021-05-11T06:09:31+05:30 IST

గ్రామస్థులంతా గొడవలు లేకుండా ఐకమత్యంగా ఉంటూ గ్రామ వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచాలని జిల్లా ఎస్పీ నారాయణ నాయక్‌ అన్నారు.

ఐకమత్యంగా ఉండాలి : ఎస్పీ
గరగపర్రు గ్రామాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ నారాయణ నాయక్‌

పాలకోడేరు, మే 10: గ్రామస్థులంతా గొడవలు లేకుండా ఐకమత్యంగా ఉంటూ గ్రామ వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచాలని జిల్లా ఎస్పీ నారాయణ నాయక్‌ అన్నారు. గరగపర్రులో అంబేడ్కర్‌ విగ్రహం స్థాపించిన విషయమై 2017లో దళితులంతా సామాజిక బహిష్కరణకు గురయ్యారు. దీంతో అప్పటి ప్రభుత్వం కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున బహిష్కరణకు గురైనవారికి చెల్లించింది. దళిత నాయకులు కుటుంబ సభ్యులందరికీ లక్ష నగదుతోపాటు ఎకరం భూమి, అంబేడ్కర్‌ కాంస్య విగ్రహం  ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేయడంతో ఈ విషయాన్ని ఒక కొలిక్కి తీసుకువచ్చేందుకు  ఎస్పీ నారాయణ నాయక్‌ సోమవారం గరగపర్రు గ్రామానికి వచ్చి దళిత నాయకులతో చర్చించారు. సమస్యలు పరిష్కరిస్తామని శాంతియుతంగా ఉండాలని సూచించారు. డీఎస్పీ ఆంజనేయరెడ్డి, తహసీల్దారు కోరం రాజకిశోర్‌,  సీఐ ఆర్‌. విజయకుమార్‌, వీఆర్వో స్వామినాయుడు తదితర అధికారులు పాల్గొన్నారు. 

బయటకు రాకుండా ప్రాణాలు కాపాడుకోండి... 

ఆకివీడు: స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష అని ఎస్పీ నారాయణ్‌ నాయక్‌ అన్నారు. కర్ఫ్యూ సమయంలో రోడ్లపై తిరుగుతున్న వాహనదారులను సోమవారం స్థానిక ‘ఎస్‌’ టర్నింగ్‌ వద్ద హెచ్చరించి మాట్లాడారు. కరోనా సెకండ్‌ వేవ్‌ వలన కుటుంబాలకు కుటుంబాలు పిట్టల్లా రాలిపోతున్నా ప్రజలు నిబంధనలు పాటించడంలేదంటూ ఆగ్రహించారు. కర్ఫ్యూ సమయంలో అనవసరంగా ఎవరైనా రోడ్డుమీదకొస్తే వెంటనే కేసులు బుక్‌ చేయాలని ఎస్‌ఐ వీఎస్‌ వీరభద్రరావుకు సూచించారు. కరోనా  వ్యాపించకుండా చూడాలన్నారు.

భీమవరం క్రైం:  జిల్లా ఎస్పీ నారాయణ నాయక్‌ సోమవారం భీమవరం పట్టణానికి విచ్చేశారు. పట్టణంలో కర్ఫ్యూ విధానం, పోలీసుల పనితీరు తదితర అంశాలను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. టూటౌన్‌ సీఐ విజయ్‌కుమార్‌, ఎస్‌ఐలు రాంబాబు, సిబ్బంది  పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-11T06:09:31+05:30 IST