ఎస్పీ గారూ.. సాయం చేయండి

ABN , First Publish Date - 2021-05-07T10:04:43+05:30 IST

కొవిడ్‌ నివారణ కోసం ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న ఓ పోలీసుకు పెద్ద కష్టం వచ్చింది. ఈ మహమ్మారి బారినపడి తన సోదరుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని..

ఎస్పీ గారూ.. సాయం చేయండి

నా సోదరుడు ప్రాణాపాయస్థితిలో ఉన్నాడు

ఆక్సిజన్‌ ఉన్న ఆస్పత్రిలో బెడ్‌ ఇప్పించండి 

మా నాన్నకు కూడా కొవిడ్‌ పాజిటివ్‌ 

వీడియోలో ఏఆర్‌ కానిస్టేబుల్‌ కన్నీళ్లు 


రాజమహేంద్రవరం సిటీ, మే 6: కొవిడ్‌ నివారణ కోసం  ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న ఓ పోలీసుకు పెద్ద కష్టం వచ్చింది. ఈ మహమ్మారి బారినపడి తన సోదరుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని.. సాయం చేయాలని ఏడుస్తూ సెల్ఫీ వీడియో ద్వారా జిల్లా ఎస్పీకి విన్నవించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బాలు ఏఆర్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఆయన తండ్రి, సోదరుడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ధవళేశ్వరం కెనాల్‌ రోడ్డులో ఓ ఆస్పత్రిలో వారిద్దరికీ చికిత్స చేయిస్తున్నారు. కాగా ఆయన సోదరుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఏం చేయాలో తెలియక తన పరిస్థితిని వీడియో ద్వారా రాజమండ్రి అర్బన్‌ ఎస్పీకి విన్నవించారు. ‘‘మా అన్న ప్రాణాపాయస్థితిలో ఉన్నాడు. రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు ఇస్తున్నారు. ఆక్సిజన్‌ ఉన్న ఆసుపత్రికి తరలించి.. బెడ్‌ ఇప్పించండి. నా తండ్రి కూడా కరోనాతో బాధపడుతున్నారు. మేడమ్‌ నాకు ఏమి చేయాలో అర్థం కావడం లేదు. దయచేసి హెల్ప్‌ చేయండి’’ అని బోరున విలపిస్తూ వీడియో ద్వారా రాజమండ్రి అర్బన్‌ ఎస్పీని వేడుకున్నారు. గురువారం వీడియో తీసి పోలీస్‌ అధికారులకు పంపారు.

Updated Date - 2021-05-07T10:04:43+05:30 IST