పెండింగ్‌ కేసులను త్వరగా పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-01-18T05:30:00+05:30 IST

జిల్లాలో నేర నియంత్రణతో పాటు పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి పోలీస్‌ అధికారులు కృషి చేయాలని ఎస్పీ రంజన్‌రతన్‌కుమార్‌ అన్నారు.

పెండింగ్‌ కేసులను త్వరగా పరిష్కరించాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌

- సీసీ కెమెరాల ఆవశ్యకతపై అవగాహన కల్పించాలి 

- నేర సమీక్షా సమావేశంలో ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌

గద్వాల క్రైం, జనవరి 18 : జిల్లాలో నేర నియంత్రణతో పాటు పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి పోలీస్‌ అధికారులు కృషి చేయాలని ఎస్పీ రంజన్‌రతన్‌కుమార్‌ అన్నారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన నెల వారీ సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పెండింగ్‌ కేసులు ఎన్ని ఉన్నాయని ఆరా తీవారు. వాటిని వెంటనే పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ కేసులో క్వాలిటీ ఆఫ్‌ ఇన్విస్టిగేషన్‌ను పెంపొందించుకోవాలని, నేరస్థులకు శిక్షలు పడేలా చూడాలని చెప్పారు. నేరాలను నియంత్రించడమే మనందరి లక్ష్యమని తెలిపారు. నేరాలు, దొంగతనాలు, దోపిడీలు జరుగుకుండా ముందస్తు ప్రణాళికను రూపొందించుకొని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆస్తికి సంబంధించిన నేరాలు జరిగితే ప్రత్యేక బృందాల ద్వారా విచారణ నిర్వహించి, సొమ్మును రికవరీ చేసి, బాధితులకు అందించేందుకు కృషి చేయాల న్నారు. గుట్కా, మట్కా, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై నిరంతరం నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. వివిధ సమస్యల పరిష్కారం కోసం పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులతో మర్యాదగా వ్యవహరిస్తూ, పోలీసులపై మరింత నమ్మకాన్ని పెంపొందించేలా బాధ్యతగా పనిచేయాలని కోరారు. మహిళల భద్రతకు షీటీమ్స్‌, ప్రత్యేక బృందాల ద్వారా ముందస్తు సమాచారం సేకరించి ఆకతాయిల ఆగడాలను అరికట్టాలన్నారు. సైబర్‌ నేరాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ట్రాఫిక్‌ నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. నిందితులపై కేసులు నమోదు చేసేటప్పుడు వారి గత నేర చరిత్రను కూడా యాడ్‌ చేయాలని సిబ్బందికి సూచించారు. సివిల్‌ కేసులలో అధికారులు, సిబ్బంది జోక్యం చేసుకోవద్దని, అసాంఘిక కార్యక్రమాలను ఎవరూ ప్రోత్స హించొద్దని చెప్పారు. నేర నియంత్రణ, నేర ఛేదనకు సీసీ కెమరాల ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఒమైక్రాన్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

Updated Date - 2022-01-18T05:30:00+05:30 IST