సాంకేతికతను సద్వినియోగం చేసుకోండి

ABN , First Publish Date - 2020-08-04T10:29:05+05:30 IST

విద్యార్థులు, యువత విజ్ఞానాన్ని మెరుగుపరుచుకునేందుకే సాంకేతికతను ఉపయోగించుకోవాలని ఎస్పీ రాజకుమారి సూచించారు.

సాంకేతికతను సద్వినియోగం చేసుకోండి

ఎస్పీ రాజకుమారి 


విజయనగరం క్రైం, ఆగస్టు 3: విద్యార్థులు, యువత విజ్ఞానాన్ని మెరుగుపరుచుకునేందుకే సాంకేతికతను ఉపయోగించుకోవాలని ఎస్పీ రాజకుమారి సూచించారు. సైబర్‌ నేరాల నుంచి మహిళలు, బాలలకు రక్షణ, భద్రత కల్పించేందుకు రాష్ట్ర పోలీసుశాఖ, సీఐడీ విభాగం సంయుక్తంగా రూపొందించిన ఈ- రక్షాబంధన్‌ పోర్టల్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సోమవారం విజయవాడలో అవిష్కరించారు. మహిళలు, జిల్లా పోలీసుశాఖాధికారులతో ఎస్పీ రాజకుమారి జిల్లా పోలీసుశాఖ సమావేశమందిరంలో అవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ-రక్షాబంధన్‌-4ఎస్‌ కార్యక్రమం ఒక చరిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోవాలని అభిలషించారు.


మహిళలకు అండగా ఉండేందుకు ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తే అంతే చెడు పరిణామాలు ఎదురవుతాయని ప్రజలు గ్రహించాలన్నారు. ఇటీవల కాలంలో మహిళలు, ఉద్యోగులు, విద్యార్థినులంతా సోషల్‌ మీడియాను, ఆన్‌లైన్‌ షాపింగ్‌ను, యాప్స్‌ని వినియోగిస్తూ సైబర్‌ నేరాగాళ్ల ఉచ్చులో పడి తమ డబ్బులు, విలువైన జీవితాలను కోల్పోతున్నారన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల వారికి పోలీసుశాఖ, సీఐడీ విభాగం అవగాహన కల్పించేందుకు సైబర్‌ నిపుణులతో ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తోందన్నారు.


ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని సైబర్‌ నేరాలపై అవగాహన పెంచుకుని మోసాలకు గురికాకుండా ఉండాలని హితవు పలికారు. సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేసే ఫొటోలు మార్ఫింగ్‌కు గురై ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి వస్తున్నందున జాగ్రత్తగా వ్యవహరించాలని విద్యార్థులు, మహిళలకు ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీలు వీరాంజనేయరెడ్డి, శ్రీనివాసరావు, ఎఆర్‌ శేషాద్రీ, ఎస్‌బీ సీఐ రాంబాబు, ఆర్‌ఐలు చిరంజీవిరావు, టీవీఆర్‌కె కుమార్‌, సైకాలజిస్టు జి.సూర్యనారాయణ, ఇతర పోలీసు అధికారులు, సత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు, ఎంఎస్‌పీలు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-04T10:29:05+05:30 IST