పోలీసులంటే భయం పోగొట్టడానికి రాత్రివేళ ఈ ఎస్పీ చేసిన పని...

ABN , First Publish Date - 2021-10-01T23:27:40+05:30 IST

తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా గోపాలసముద్రం గ్రామంలో ఇటీవల కులాల మధ్య చోటుచేసుకున్న

పోలీసులంటే భయం పోగొట్టడానికి రాత్రివేళ ఈ ఎస్పీ చేసిన పని...

తిరునల్వేలి: తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా గోపాలసముద్రం గ్రామంలో ఇటీవల కులాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ హింసకు దారితీసింది. ఈ ఘర్షణల్లో ఇద్దరు హత్యకు గురయ్యారు. దీంతో గ్రామం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది. సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు గోపాలసముద్రం, దానిని ఆనుకుని ఉన్న గ్రామాల్లో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. ఈ నేపథ్యంలో పోలీసులంటే ప్రజల్లో ఉన్న భయం పోగొట్టి పోలీసులు, ప్రజల మధ్య బంధాన్ని పెంచాలనే ఉద్దేశంతో ఎస్పీ మణివణ్ణన్ కొత్తగా ఆలోచించారు.


బుధవారం రాత్రి గోపాలసముద్రం గ్రామంలో సైకిలుపై పెట్రోలింగ్‌కు బయలుదేరారు. ఈ సందర్భంగా గ్రామంలో మోహరించిన పోలీసులను అడిగి అక్కడి పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మణివణ్ణన్ మాట్లాడుతూ.. పోలీసులంటే ప్రజల్లో ఉన్న బెరుకు పోగొట్టి, తనను స్వేచ్ఛగా కలిసే వాతావరణం కల్పించే ఉద్దేశంతోనే సైకిల్‌పై పెట్రోలింగ్‌కు వచ్చినట్టు తెలిపారు. గ్రామస్థులకు, తనకు మధ్య దూరాన్ని ఇది తగ్గిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీనికి తోడు గ్రామం చాలా చిన్నదని, సైకిల్‌పై పెట్రోలింగ్ చేయడం చాలా తేలిక అని అన్నారు. 


 గ్రామంలో హత్యలకు కారణమైన ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెంకులమ్‌కు చెందిన మరియప్పన్ హత్య కేసులో అనుమానితుడైన షణ్ముగసెల్వన్‌ను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. కాగా, గోపాలసముద్రానికి చెందిన శంకరసుబ్రహ్మణ్యాన్ని మరియప్పన్ హత్య చేసినట్టు ఆరోపణలున్నాయి. సెప్టెంబరు 15న జరిగిన మరియప్పన్ హత్య కేసులో పోలీసులు ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేశారు. అలాగే, హంతకులకు కొడవళ్లు విక్రయించిన వర్క్‌షాప్ యజమాని సుదలాయ్ (55)ను కూడా పతమాడై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  


Updated Date - 2021-10-01T23:27:40+05:30 IST