కనువిప్పు కలిగేనా?’

ABN , First Publish Date - 2022-01-25T17:00:10+05:30 IST

కనువిప్పు కలిగేనా?’

కనువిప్పు కలిగేనా?’

సఫారీ టూర్‌లో లోపాలు బహిర్గతం 


(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)

దాదాపు నెల రోజులపాటు సాగిన దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా ఓ అగ్రశ్రేణి జట్టులా కాకుండా అతి సామాన్యంగా కనిపించింది. అటు సంధి దశలో ఉన్న ఆతిథ్య జట్టు మాత్రం బెబ్బులిలా చెలరేగింది. టెస్టు సిరీ్‌సలో నోకియా, డికాక్‌.. వన్డే సిరీ్‌సలో రబాడ లేకపోయినా ఎలాంటి ఇబ్బందీ పడలేదు. దీంతో భారత్‌ ఈ టూర్‌లో ఆడిన ఆరు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఐదింటిని ఓడి ఉసూరుమనిపించింది. ఒక విధంగా ఈ మ్యాచ్‌లు జట్టులోని లోపాలన్నింటినీ బహిర్గతం చేసింది. ఆదివారం నాటి వన్డేలో చేతిలో ఏడు వికెట్లున్నా 20 ఓవర్లలో 136 పరుగులు చేయలేకపోవడం జట్టు అంకితభావంపై సందేహాలు లేవనెత్తుతున్నాయి. పైగా ఆ సమయంలో క్రీజులో కోహ్లీ కూడా ఉన్నాడు. గతంలో ఛేజింగ్‌ కింగ్‌గా పేరు తెచ్చుకున్న అతడిలో అప్పటి జోష్‌ కనిపించడం లేదు. అంతకుముందు టెస్టు సిరీ్‌సలోనూ 1-0తో పైచేయి సాధించినా బౌలర్ల వైఫల్యంతో రెండు టెస్టుల్లోనూ ఓడింది. ఇక వన్డే సిరీ్‌సలో పిచ్‌ బ్యాటింగ్‌ అనుకూలించినా భారత బ్యాటర్లు చేసిందేమీ లేదు. ఇక పంత్‌ నిర్లక్ష్యపు షాట్ల గురించి చెప్పేదేమీ లేదు. రిజర్వ్‌ ఆటగాళ్లు  ఈ సిరీ్‌సలో తమకు దక్కిన అవకాశాలను వృథా చేసుకున్నారు.


రాహుల్‌ కెప్టెన్సీ తుస్‌: టెస్టు కెప్టెన్సీ నుంచి కోహ్లీ వైదొలగడంతో ఆ స్థానంలో రాహుల్‌కు అవకాశాలెక్కువగా ఉన్నాయని అంతా భావించారు. కానీ వన్డే సిరీస్‌ ఆ అంచనాలన్నింటినీ పక్కనబెట్టేలా చేసింది. మూడు మ్యాచ్‌ల్లోనూ తను నాయకుడిగా నిరూపించుకుందేమీ లేదు. రోహిత్‌ గాయాల సమస్య కారణంగా రాహుల్‌ను టెస్టు కెప్టెన్‌గా చేస్తారా? అని అడిగిన ప్రశ్నకు ‘అతడు మీ కంటికి కెప్టెన్‌గా కనిపిస్తున్నాడా?’ అని ఓ బీసీసీఐ ఉన్నతాధికారి ఎదురు ప్రశ్నించినట్టు సమాచారం. దీంతో ఇప్పట్లో అతడికి సారథి అయ్యే అవకాశాలు లేనట్టే. కోచ్‌ ద్రవిడ్‌ అతడిని వెనకేసుకొచ్చినా.. ఫ్యాన్స్‌, విశ్లేషకులు మాత్రం పెదవి విరుస్తున్నారు. అటు బ్యాటింగ్‌లోనూ విఫలం కావడం అతడి ఆత్మవిశ్వాసాన్ని మరింత దెబ్బతీసింది. రెండో వన్డేలో నిదానంగా 79 బంతుల్లో 55 పరుగులు చేయడం విమర్శల పాలైంది. అలాగే మధ్య ఓవర్లలో సరైన రీతిలో బౌలర్లను మార్చలేకపోయాడు. కెప్టెన్‌గా తను ఆరంభ దశలో ఉన్నాడని ద్రవిడ్‌ చెబుతున్నప్పటికీ.. జట్టు మరీ వైట్‌వాష్‌ కావడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. క్రితంసారి పర్యటనలో సఫారీ జట్టులో స్టార్‌ క్రికెటర్లంతా ఉన్నప్పటికీ భారత జట్టు వన్డే సిరీస్‌ గెలవగలిగింది. ఏదేమైనా లోపాలను సరిదిద్దుకుని, ఆటగాళ్లను ఉపయోగించుకోవడంపై సరైన వ్యూహంతో బరిలోకి దిగితేనే వచ్చే ఏడాది ప్రపంచక్‌పలో భారత్‌ పోటీ ఇవ్వగలదు. గత రికార్డు ఎంత ఘనంగా ఉన్నా బరిలోకి దిగి చక్కటి క్రికెట్‌ ఆడితేనే విజయాలు లభిస్తాయన్న విషయాన్ని భారత స్టార్‌ ఆటగాళ్లు గుర్తుంచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.

Updated Date - 2022-01-25T17:00:10+05:30 IST