కదిరి-రాయచోటి రహదారిపై రాకపోకలు నిలిపేయండి

ABN , First Publish Date - 2020-11-28T06:22:43+05:30 IST

గాండ్లపెంట, నంబులపూలకుంట మండలాల్లో నివర్‌ తుఫాను తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో కదిరి-రాయచోటి ప్రధాన రహదారిపై వరద ఉధృతి ఏ క్షణంలోనైనా పెరగొచ్చనీ, రాకపోకలు పూర్తిగా నిలిపేయాలని ఎస్పీ సత్యఏసుబాబు ఆదేశించారు.

కదిరి-రాయచోటి రహదారిపై రాకపోకలు నిలిపేయండి
పెడబల్లి జలాశయాన్ని పరిశీలిస్తున్న ఎస్పీ సత్యఏసుబాబు

ఎస్పీ ఆదేశాలు

గాండ్లపెంట/నంబులపూలకుంట, నవంబరు 27: గాండ్లపెంట, నంబులపూలకుంట మండలాల్లో నివర్‌ తుఫాను తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో కదిరి-రాయచోటి ప్రధాన రహదారిపై వరద ఉధృతి ఏ క్షణంలోనైనా పెరగొచ్చనీ, రాకపోకలు పూర్తిగా నిలిపేయాలని ఎస్పీ సత్యఏసుబాబు ఆదేశించారు. గాండ్లపెంట మండలంలోని చామాలగొంది చెరువును ఆయన శుక్రవారం పరిశీలించారు. చామాలగొంది క్రాస్‌ వద్ద కదిరి-రాయచోటి రహదారిపై నీటి ఉధృతి వివరాలు, అధికారులు చేపట్టిన ప్రత్యామ్నాయ చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ మాట్లాడుతూ తుఫాను ప్రభావం పూర్తిగా తగ్గే వరకు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. నిండిన చెరువులను పరిశీలించి, ముంపు బారిన పడే అవకాశమున్న గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ముందస్తు ప్రణాళిక ఏర్పాటు చేసుకుని, చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. అంతకుముందు నంబులపూలకుంట మండలంలోని పెడబల్లి జలాశయాన్ని ఎస్పీ పరిశీలించారు. జలాశయం నుంచి నీరు కడప జిల్లా వెలిగల్లు డ్యాంకు చేరుతుందని సీఐ మధు వివరించారు. చిత్తూరు జిల్లా సరిహద్దులో జలాశయం ఉండటంతో ఎగువునున్న రెండు ప్రాజెక్టుల నుంచి ప్రవాహం చేరుతోందన్నారు. కార్యక్రమంలో కదిరి డీఎస్పీ భవ్యకిశోర్‌, ఎస్‌ఐలు గురుప్రసాద్‌రెడ్డి, నరసింహుడు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-11-28T06:22:43+05:30 IST