సమాజ పరిరక్షణే పోలీసుల ప్రధాన బాధ్యత: ఎస్పీ

ABN , First Publish Date - 2021-07-30T06:37:44+05:30 IST

సమాజ పరిరక్షణే పోలీసుల ప్రధాన బాధ్యతని ఎస్పీ ఎం.రవీంద్రనాధ్‌బాబు అన్నారు. కరప పోలీస్‌స్టేషన్‌ను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు.

సమాజ పరిరక్షణే పోలీసుల ప్రధాన బాధ్యత: ఎస్పీ
కరప పోలీస్‌స్టేషన్‌ రికార్డులను పరిశీలిస్తున్న జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్‌బాబు

కరప, జూలై 29: సమాజ పరిరక్షణే పోలీసుల ప్రధాన బాధ్యతని ఎస్పీ ఎం.రవీంద్రనాధ్‌బాబు అన్నారు. కరప పోలీస్‌స్టేషన్‌ను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు. మావో ప్రభావిత ఏజెన్సీ ప్రాంతంపై దృష్టిపెట్టి తొలి పర్యటనను అక్కడే చేసినట్టుగా చెప్పారు. ప్రతీ పోలీస్‌స్టేషన్‌లో ప్రత్యేకంగా రిసెప్షన్‌, ఉమెన్‌ హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో అసాంఘిక కార్యక్రమాలను ఉక్కుపాదంతో అణచివేయడానికి ప్రయత్నిస్తున్నామని, సుదీర్ఘకాలంగా ఒకేచోట పనిచేస్తున్న సిబ్బందిని బదిలీ చేస్తామని వివరించారు. అనంతరం కరప సచివాలయాన్ని ఎస్పీ సందర్శించి అక్కడ ప్రజలకు అందుతున్న సేవలపై ఆరాతీశారు. విజిటర్స్‌ బుక్‌లో సంతకం చేసి పంచాయతీ, సచివాలయ ఉద్యోగుల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్‌పీ పి.అంబికాప్రసాద్‌, కాకినాడ రూరల్‌ సీఐ ఆకుల మురళీకృష్ణ, ఎస్‌ఐ డి.రమేష్‌బాబు, పంచాయతీ కార్యదర్శి గొలకోటి త్రినాధరావు పాల్గొన్నారు.

వార్డు సచివాలయాలను సందర్శించిన ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు

కాకినాడ క్రైం,  జూలై 29 : కాకినాడ సిటీ పరిధిలోని పలు వార్డు సచివాలయాలను గురువారం జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు సందర్శించారు. ఈ సందర్భంగా 45-ఏ, 45-బీ, 46-ఏ డివిజన్ల సచివాలయాలను సందర్శించి సిబ్బంది పనితీరు, విధులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహిళా పోలీసులకు పోలీసు శాఖ, గ్రామస్థాయిలో చేపట్టాల్సిన విధులపై అవగాహన కల్పించారు. అంకితాభావంతో పనిచేయాలని కోరారు.

Updated Date - 2021-07-30T06:37:44+05:30 IST