స్వామిప్రసాద్ మౌర్య సీటు మార్చిన ఎస్పీ

ABN , First Publish Date - 2022-02-02T22:04:43+05:30 IST

సమాజ్‌వాదీ పార్టీ యూపీ ఎన్నికల్లో పోటీ చేసే మరో ముగ్గురి అభ్యర్థుల జాబితాను బుధవారంనాడు విడుదల..

స్వామిప్రసాద్ మౌర్య సీటు మార్చిన ఎస్పీ

లక్నో: సమాజ్‌వాదీ పార్టీ యూపీ ఎన్నికల్లో పోటీ చేసే మరో ముగ్గురి అభ్యర్థుల జాబితాను బుధవారంనాడు విడుదల చేసింది. అధికార బీజేపీని వదలి సమాజ్‌వాదీ పార్టీలో చేరిన ఓబీసీ నేత స్వామి ప్రసాద్ మౌర్య సీటు మార్చింది. ఆయనకు గట్టి పట్టున్న పడ్రౌన‌కు బదులుగా ఖుషినగర్ ఫాజిల్‌నగర్ సీటును ఆయనకు కేటాయించింది. స్వామి ప్రసాద్ మౌర్య ప్రస్తుతం పడ్రౌనా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2007 నుంచి వరుసగా నాలుగుసార్లు ఇక్కడి నుంచి ఆయన ఎన్నికయ్యారు. అయితే, ఇక్కడి నుంచి ఆయనపై ఆర్‌పీఎన్ సింగ్‌ను పోటీకి దింపాలనే ఆలోచనలో బీజేపీ ఉండటంతో సమాజ్‌వాదీ పార్టీ వ్యూహం మార్చినట్టు చెబుతున్నారు.


కాంగ్రెస్‌లో మూడు దశాబ్దాల పాటు పనిచేసిన ఆర్‌పీఎన్ సింగ్ ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో మౌర్యను బీజేపీ టిక్కెట్‌పై పడ్రౌనా నుంచి మౌర్యపై పోటీకి దించే ఆలోచనలో ఆ పార్టీ ఉంది. కాగా, 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఖుషీనగర్ పార్లమెంటరీ సీటు నుంచి మౌర్యను ఆర్‌పీఎన్ సింగ్ ఓడించారు. స్వామి ప్రసాద్ మౌర్య, ఆర్‌పీఎన్ సింగ్ మధ్య చాలాకాలంగా రాజకీయ శత్రుత్వం కూడా నడుస్తోంది.

Updated Date - 2022-02-02T22:04:43+05:30 IST