గూండాలకు వాళ్లు రక్షణ ఇస్తే, మేము ఏరివేశాం: అమిత్‌షా

ABN , First Publish Date - 2021-12-18T00:10:21+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని విపక్ష పార్టీలైన సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలపై కేంద్ర హోం మంత్రి ..

గూండాలకు వాళ్లు రక్షణ ఇస్తే, మేము ఏరివేశాం: అమిత్‌షా

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని విపక్ష పార్టీలైన సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా విమర్శలు గుప్పించారు. ఆ రెండు పార్టీలు రాష్ట్రంలో గూండాలకు రక్షణ కల్పిస్తే, గూండాలను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఏరివేశారని అన్నారు. బీజేపీ, నిషద్ పార్టీ సంయుక్తంగా లక్నోలో శుక్రవారంనాడు ఏర్పాటు చేసిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, ఎస్‌పీ, బీఎస్‌పీలు కేవలం తమ కులాల కోసమే పనిచేశారని, బేజీపీ అందరి కోసం పనిచేసే పార్టీ అని చెప్పారు. వెనుకబడిన వర్గాల కోసం తాము పనిచేసినట్టు ఎస్‌పీ, బీఎస్‌పీ చెప్పుకుంటాయని, అయితే బీసీలకు రాజ్యాంగ గుర్తింపు విషయంలో ఎప్పుడూ పాటుపడలేదని అన్నారు. వెనుకబడిన తరగతుల వారికి రాజ్యాంగ హక్కులను బీజేపీనే కల్పించిందని చెప్పారు. తమ భాగస్వామ్య పార్టీగా ఉన్న నిషద్ పార్టీపైనా అమిత్‌షా ప్రశంసలు కురిపిచారు. నిషద్ కమ్యూనిటీ ఎజెండాలోని అంశాలకు బీజేపీ భరోసాగా నిలుస్తుందని చెప్పారు.


ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన ప్రసంగంలో నిషద్ పార్టీతో పొత్తును స్వాగతించారు. 2019లోనూ నిషద్ పార్టీతో కలిసి పనిచేశామని, విపక్ష కూటమిని చిత్తుచేసి భారీ మెజారిటీ సాధించామని చెప్పారు. మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కలిసి పనిచేస్తున్నామని చెప్పారు.

Updated Date - 2021-12-18T00:10:21+05:30 IST