Sep 25 2021 @ 10:54AM

ఢిల్లీకి పిలిచి అవమానించారు.. సరిగ్గా రెండేళ్ల క్రితం SP Balasubrahmanyam ఆవేదన..

2020వ సంవత్సరం.. సెప్టెంబర్ 25వ తారీఖు.. తెలుగు సినీ అభిమానులు, సంగీత ప్రియులు జీవితంలో మర్చిపోలేని రోజు. తెలుగు సినీ సంగీతానికి పెద్దదిక్కుగా ఉన్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పరమపదించిన రోజు. ఆయన మరణించి సరిగ్గా నేటికి ఏడాది పూర్తయింది. సంగీత ప్రపంచంలో ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఆ లోటును ఎవరూ పూడ్చలేరు కూడా. శనివారం ఆయన ప్రథమ వర్ధంతి కావడంతో అశేష అభిమానులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. అదే సమయంలో గతంలో ఆయనకు లభించిన సత్కారాలు.. ఎదురైన అవమానాల గురించి చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ ఘటన గురించి చర్చ జరుగుతోంది. గతంలో ప్రధాని మోదీ నిర్వహించిన ఓ కార్యక్రమానికి ఎస్పీ బాలు హాజరయ్యారు. ఆ సమయంలో బాలుకు ఓ షాకింగ్ అనుభవం ఎదురయింది. దాని గురించే తన ఫేస్‌బుక్ ఖాతాలో ఆయన పోస్ట్ కూడా పెట్టారు.



దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులను సత్కరించేందుకు గానూ ప్రధాని మోదీ రెండేళ్ల క్రితం ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమానికి బాలీవుడ్ ప్రముఖులతో పాటు తెలుగు, తమిళ, మలయాళ సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. మన టాలీవుడ్ నుంచి హాజరయిన వాళ్లల్లో ఎస్పీ బాలు కూడా ఒకరు. ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్లిన సమయంలో ఆయనకు ఓ చేదు అనుభవం ఎదురయింది. ఆ కార్యక్రమం జరుగుతున్న ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే సెక్యూరిటీ సిబ్బంది ఆపారట. ఎస్పీ బాలుతో పాటు ఇతర ఆహ్వానితుల వద్ద ఉన్న ఫోన్లను ఇక్కడే వదిలేసి వెళ్లమని చెప్పారట. ఎందుకు అని అడిగితే సెక్యూరిటీ కారణాలు అని చెప్పారట. తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్లంతా ఫోన్లను అక్కడే వదిలేసి లోపలకు వెళ్లారట. 

తీరా లోపలకు వెళ్లి చూస్తే బాలీవుడ్ సినీ ప్రముఖులు తమ సొంత ఫోన్లతో ప్రధాని మోదీతో సెల్ఫీలు తీసుకుంటున్న సీన్ ఎస్పీ బాలుకు కనిపించింది. అది చూసి ఆయన అవాక్కయ్యారు. తమ పట్ల ఎందుకిలా ప్రవర్తించారని ఆ కార్యక్రమం జరుగుతున్నంత సేపు అయోమయంలో బాలు ఉండిపోయారట. ‘కొన్ని సంఘటనలను చూస్తూ ఉండిపోవాలంతే..’ అని వ్యాఖ్యానిస్తూ 2019వ సంవత్సరం నవంబర్ 2వ తారీఖున ఈ ఘటన గురించి తన పేస్‌బుక్ ఖాతాలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పోస్ట్ పెట్టారు. ఆయన పెట్టిన పోస్ట్‌కు వెంటనే అభిమానులు రియాక్ట్ అయ్యారు. ‘ఓ గొప్ప వ్యక్తితో సెల్ఫీని ప్రధాని మోదీ మిస్సయ్యారు’ అంటూ అభిమానులు కామెంట్స్ చేశారు. 

(ఫేస్‌బుక్‌లో బాలు పెట్టిన పోస్ట్)