బాలు ఛారిటీ పాట!

ABN , First Publish Date - 2020-03-28T05:33:11+05:30 IST

కరోనా మహమ్మారిని తరమికొట్టేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వాలకు అండగా... ఈ కల్లోలంతో అల్లాడుతున్న సామాన్యులకు సాయం చేసేందుకు దేశవ్యాప్తంగా సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పలువురు రాజకీయనాయకులు...

బాలు ఛారిటీ పాట!

కరోనా మహమ్మారిని తరమికొట్టేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వాలకు అండగా... ఈ కల్లోలంతో అల్లాడుతున్న సామాన్యులకు సాయం చేసేందుకు దేశవ్యాప్తంగా సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పలువురు రాజకీయనాయకులు, సినీతారలు, పారిశ్రామికవేత్తలు ఇప్పటికే భారీగా విరాళాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విభిన్న రీతిలో సాయం అందించేందుకు సిద్ధం అవుతున్నారు. ఇందుకోసం ఆయన వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండే ఎస్పీబీ ఆ వివరాలను తన ఫేస్‌బుక్‌ వేదికగా వెల్లడించారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో పారిశుద్ధ్య, పోలీస్‌, వైద్యులకు ఏదైనా సాయం చేయాలనుకుంటున్నా. అందుకోసం అభిమాన శ్రోతలకు, నెటిజన్లకు ఒక అవకాశం ఇస్తున్నా. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో మీకు నచ్చిన పాటను పాడమని నన్ను అడగొచ్చు. అది సినిమా పాటైనా, భక్తి గీతమైనా సరే. ఈ శనివారం (28)తో పాటు రాబోయే సోమ, బుధ, గురు వారాల్లో అర్ధగంటపాటు రాత్రి 7గంటల నుంచి 7.30 గంటల దాకా మీరు కోరిన పాట పాడతా. మీరు కోరిన పాటలపై కసరత్తు చేసి, రికార్డింగ్‌ చేసి మరుసటి రోజు వినిపిస్తా. ఇందుకోసం పాట కోరిన వారు రుసుము కింద 100 రూపాయలను చెల్లించాలి. అలా వచ్చిన మొత్తాన్ని ఎలా వినియోగించాలనే విషయంమై మీ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటా. అరగంట సమయంలో మొత్తం పాట కాకుండా... ఒక పల్లవి, చరణం మాత్రమే పాడతా. అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నా’’ అంటూ వీడియో సందేశం పోస్ట్‌ చేశారు ఎస్పీబీ. ఆయన తన ఫేస్‌బుక్‌లో బ్యాంకు అకౌంట్‌ వివరాలు కూడా ఇచ్చారు. మీరు కోరిన పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గళంలో వినాలంటే 100 రూపాయలను ‘ఎస్పీబీ ఫాన్స్‌ ఛారిటబుల్‌ ఫౌండేషన్‌’, ఐసీఐసీఐ బ్యాంక్‌, అన్నానగర్‌ వెస్ట్‌ బ్రాంచ్‌, అకౌంట్‌నెంబర్‌ 039501002062, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ ఐసీఐసీ0000395కు పంపాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా కరోనాపై అవగాహనను పెంచుతూ వైరముత్తు (తమిళం), వెన్నెలకంటి (తెలుగు), జయంత్‌ కైకిని (కన్నడం)రాసిన గీతాలను బాలు తన స్వీయ సంగీత దర్శకత్వంలో ఆలపించి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు.

Updated Date - 2020-03-28T05:33:11+05:30 IST