స్వరబాలుడు

ABN , First Publish Date - 2020-09-26T06:11:46+05:30 IST

పాట పాపాయిని గుండెగొంతుకలో ఆటలాడించిన గాయక శ్రేష్ఠుడు.. అమర ప్రవాహంలా అక్షరాలజడిని స్వరామృతంలో శివగంగ తానాలాడించిన....

స్వరబాలుడు

పాట పాపాయిని గుండెగొంతుకలో

ఆటలాడించిన గాయక శ్రేష్ఠుడు..

అమర ప్రవాహంలా అక్షరాలజడిని

స్వరామృతంలో శివగంగ తానాలాడించిన

గాన గంధర్వుడు..

మర్యాదరామన్నతో గొంతు విప్పి

గోదాలో దిగిన పరమ మర్యాదస్తుడు..


సంగీత సాహిత్యాల్ని 

సుస్వరశంఖంలో పోసి తీర్థప్రసాదాలుగా

పంచిన రాగాల పూజారి..

వేల పాటల్ని గమకాల గతులు

తప్పకుండా స్వరప్రవాహంలో శ్రోతల

మనసు దరిచేర్చిన స్వరసరంగు..

నటన డబ్బింగుల్ని అదనాలుగా

అలంకృతం చేసుకుని అలరారిన

అద్వితీయ కళాతృష్టుడు..


స్వరాభిషేకంతో పట్టం కట్టుకుని తృప్తిగా

నిండుకుండలా మబ్బుల్లో సురాగాలు

పాడుకుంటూ వెళ్లిపోతున్నాడదిగో

పండితారాధ్య పాటల సుబ్రహ్మణ్యం..!!


– భీమవరపు పురుషోత్తం

Updated Date - 2020-09-26T06:11:46+05:30 IST