యూపీలో సమాజ్‌వాదీ పార్టీ, ఆప్ పొత్తు?

ABN , First Publish Date - 2021-11-24T21:47:34+05:30 IST

వచ్చే ఏడాది జరిగే ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో

యూపీలో సమాజ్‌వాదీ పార్టీ, ఆప్ పొత్తు?

లక్నో : వచ్చే ఏడాది జరిగే ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పొత్తు పెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆప్ నేత సంజయ్ సింగ్ బుధవారం ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌తో సమావేశమవడంతో ఈ చర్చకు తెర లేచింది. వీరి భేటీ ప్రధాన లక్ష్యం యూపీలో బీజేపీని గద్దె దించడమేనని తెలుస్తోంది. వీరిద్దరూ లక్నోలోని లోహియా ట్రస్ట్ కార్యాలయంలో దాదాపు ఓ గంటసేపు సమావేశమయ్యారు. 


ఆప్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే లక్ష్యంతో సాధారణ అంశాలపై వ్యూహాత్మకంగా చర్చించినట్లు తెలిపారు. సీట్ల పంపకాలపై ఎటువంటి చర్చ జరగలేదన్నారు. పొత్తుపై నిర్ణయం తీసుకుంటే తెలియజేస్తానని చెప్పారు. 


ఉత్తర ప్రదేశ్‌లో తిరిగి అధికారంలోకి రావడానికి అఖిలేశ్ యాదవ్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. చిన్న పార్టీలతో జట్టు కట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్ మధ్య పొత్తు కుదిరిన సంకేతాలు వస్తున్నాయి. సీట్ల పంపకంపై అఖిలేశ్ యాదవ్, జయంత్ సింగ్ చౌదరి చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే దీనిపై వీరిద్దరూ స్పష్టంగా ప్రకటన చేయలేదు. వీరిద్దరూ తాము కలిసినట్లు తెలిపే ఫొటోలను ట్వీట్ చేశారు. 


Updated Date - 2021-11-24T21:47:34+05:30 IST