సోయా.. సబ్సిడీ గయా!

ABN , First Publish Date - 2022-05-25T05:46:57+05:30 IST

సోయా విత్తన ధరలు ఏటా పెరుగుతునే ఉన్నాయి. జిల్లా రైతులు వరి, పత్తి తర్వాత సోయానే అధికంగా సాగు చేస్తారు. ప్రభుత్వం గతంలో ఈ విత్తనాలను రాయితీపై ఇచ్చేది.

సోయా.. సబ్సిడీ గయా!

- ఏటా పెరుగుతున్న విత్తన ధరలు

- రెండేళ్లుగా రాయితీ ఊసెత్తని సర్కారు

- రైతులపై అదనపు భారం


కామారెడ్డి, మే 24: సోయా విత్తన  ధరలు ఏటా పెరుగుతునే ఉన్నాయి. జిల్లా రైతులు వరి, పత్తి తర్వాత సోయానే అధికంగా సాగు చేస్తారు. ప్రభుత్వం గతంలో ఈ విత్తనాలను రాయితీపై ఇచ్చేది. అయితే రెండేళ్లుగా సబ్సిడీని నిలిపివేసింది. మరోవైపు విత్తన ధరలు ఏటా పెరుగుతుండడంతో రైతులపై అదనపు భారం పడుతోంది. 2017 నుంచి 2019 వరకు 30 కిలోల ప్యాకెట్‌ ధర రూ.1,845 ఉంది. ప్రభుత్వం 40 శాతం రాయితీ ఇవ్వడంతో రైతుకు రూ.1,095కే అందేది. రెండేళ్లుగా రాయితీ నిలిపివేయడంతో రైతులపై భారం పెరుగుతోంది. గత ఏడాది క్వింటాల్‌ విత్తనాలు రూ.11,600 నుంచి రూ.13వేల వరకు పలికాయి. ఈ ఏడాది ప్రారంభంలోనే రూ.14వేల మేర పలుకుతున్నాయి. తొలకరి రాకతో ఈ ధరలు మరింత పెరుగనున్నాయి.

సోయా వైపే మొగ్గు

జిల్లాలో భూములు సోయా సాగుకు అనుకూలంగా ఉన్నాయి. అలాగే ఈ పంట అధిక వర్షమైనా.. తక్కువ వర్షమైనా తట్టుకుని నిలుస్తోంది. విత్తనాలు వేశాక గడ్డిమందు పిచికారి చేస్తే కలుపుతీసే అవసరమూ ఉండదు. మూడు నెలల్లోనే పంట చేతికి వస్తుంది. కోతకు కూలీలు లేకుండా హర్వేస్టర్‌ను వినియోగించుకోవచ్చు. ఎకరాకు ఎనిమిది నుంచి పది క్వింటాళ్ల వరకు దిగుబడి ఉండడంతో రైతులు ఎక్కువగా ఈ పంట సాగుకే మొగ్గు చూపుతున్నారు. తాడ్వాయి, గాంధారి, సదాశివనగర్‌, పిట్లం, లింగంపేట, భిక్కనూర్‌, తదితర మండలాల్లో సాగయ్యే అవకాశం ఉంది.

పెరుగనున్న సాగు విస్తీర్ణం

జిల్లాలో ఏటా సోయా సాగు విస్తీర్ణం పెరుగుతుంది. ఈసారి 70 వేల ఎకరాలు దాటే అవకాశం ఉంది. ఎకరాకు 30 నుంచి 40 కిలోల మేర విత్తనాలు అవసరం ఉంటాయి. ప్రభుత్వం రాయితీ ఎత్తివేయడంతో కంపెనీలన్నీ 30 కిలోల బస్తా కాస్తా మూడు కిలోలు తగ్గించాయి. ధరలు తగ్గింపులేదని పైకి చెబుతున్నా ప్యాకింగ్‌ 25, 27 కిలోలకే పరిమితం చేసి విక్రయిస్తున్నారు. ప్రభుత్వం ఇతర పంటలు సాగు చేయాలని అవగాహన కల్పిస్తున్నా రైతులు మాత్రం సోయాకే మొగ్గు చూపుతుండడం గమనార్హం


సబ్సిడీ ఇవ్వలేదు

- సాయిరెడ్డి, రైతు, ఎర్రాపహాడ్‌

సోయా విత్తనాలపై ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వకపోవడంపై రైతులపై అదనపు భారం పడుతుంది. దీంతో నష్ట పోతున్నాం. ఈ ప్రాంతంలో ఉండే నేలల్లో ఎక్కువగా సోయానే సాగవుతుంది. ప్రభుత్వం స్పందించి రాయితీ విత్తనాలు ఇచ్చేలా చూడాలని కోరుతున్నాం.


రాయితీపై ఆదేశాలు లేవు

- భాగ్యలక్ష్మీ, డీఏవో, కామారెడ్డి

జిల్లాలో సోయా విత్తన రాయితీపై ఇప్పటి వరకు ఆదేశాలు రాలేదు. రైతులు నాణ్యమైన విత్తనాలు ఎంపిక చేసుకోవాలి. వర్షాలు కురువగానే తేమ శాతం ఆధారంగా విత్తుకోవాలి.

Updated Date - 2022-05-25T05:46:57+05:30 IST