అండమాన్‌ను తాకిన నైరుతి

ABN , First Publish Date - 2022-05-17T08:33:36+05:30 IST

హిందూ మహాసముద్రం నుంచి బంగాళాఖాతంలోకి బలమైన నైరుతి గాలులు వీస్తూ.. అండమాన్‌, నికోబార్‌ దీవుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో రుతుపవనాల ఆగమనానికి అనుకూల వాతావరణం ఏర్పడింది. సోమవారం

అండమాన్‌ను తాకిన నైరుతి

రెండు రోజుల్లోగా దీవులలో విస్తరణ

20 వరకు కోస్తా, సీమలకు వర్షసూచన


విశాఖపట్నం, హైదరాబాద్‌, మే 16 (ఆంధ్రజ్యోతి): హిందూ మహాసముద్రం నుంచి బంగాళాఖాతంలోకి బలమైన నైరుతి గాలులు వీస్తూ.. అండమాన్‌, నికోబార్‌ దీవుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో రుతుపవనాల ఆగమనానికి అనుకూల వాతావరణం ఏర్పడింది. సోమవారం అండమాన్‌ నికోబార్‌ దీవులు, అండమాన్‌ సముద్రంలో అనేక ప్రాంతాలు, దక్షిణ బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్టు భారత వాతావరణ శాఖ (ఐఎండీ), హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించాయి. నైరుతి రుతుపవనాలు అండమాన్‌ నికోబార్‌ దీవులు, అండమాన్‌ సముద్రం పరిసరాలకు గతేడాది మే 21న వచ్చాయి. కాగా వచ్చే రెండు రోజుల్లో దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్‌, నికోబార్‌ దీవులు, అండమాన్‌ సముద్రంలో మిగిలిన ప్రాంతాలు, తూర్పుమధ్య బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించనున్నాయని ఐఎండీ పేర్కొంది.


ఇదిలావుండగా ఉత్తర తమిళనాడుకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించింది. మధ్యప్రదేశ్‌ నుంచి విదర్భ, కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ఉపరితలద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో సోమవారం రాయలసీమ, కోస్తాల్లో పలుచోట్ల పిడుగులు, బలమైన గాలులతో వర్షాలు కురిశాయి.  రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ద్రోణులు, అరేబియా సముద్రం నుంచి వస్తున్న తేమగాలుల ప్రభావంతో ఈ నెల 20వ తేదీ వరకు కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కాగా.. తెలంగాణలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

Updated Date - 2022-05-17T08:33:36+05:30 IST