2 వారాల్లో నైరుతి రాక

ABN , First Publish Date - 2020-05-31T08:26:01+05:30 IST

‘‘నిరుడు రుతు పవనాలు రాష్ట్రానికి చాలా ఆలస్యంగా వచ్చాయి. జూన్‌, జూలై నెలల్లో సరిగా వర్షాలు లేవు. ఈ ఏడాది అలాంటి పరిస్థితి ఉండదు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.

2 వారాల్లో నైరుతి రాక

రేపు కేరళను తాకే అవకాశం

ఈసారి సాధారణ వర్షపాతమే

‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూలో హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ నాగరత్న


హైదరాబాద్‌, మే 30 (ఆంధ్రజ్యోతి): ‘‘నిరుడు రుతు పవనాలు రాష్ట్రానికి చాలా ఆలస్యంగా వచ్చాయి. జూన్‌, జూలై నెలల్లో సరిగా వర్షాలు లేవు. ఈ ఏడాది అలాంటి పరిస్థితి ఉండదు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. జూన్‌ ఒకటో తేదీనే నైరుతి రుతు పవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశాలున్నాయి. అదే జరిగితే రెండో వారంలోనే తెలంగాణ రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. ఈ సీజన్‌లో రాష్ట్రంలో సాధారణ వర్షపాతం నమోదవుతుంది’’ అని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ డాక్టర్‌ కె. నాగరత్న తెలిపారు. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు, నైరుతి ఆగమనం తదితర అంశాలపై ‘ఆంధ్రజ్యోతి’తో ఆమె మాట్లాడారు.  


రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఇంకా ఎన్ని రోజులు ఈ పరిస్థితి?

రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే 5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, విదర్భ రాష్ట్రాల నుంచి (వాయవ్య దిశ నుంచి) వేడిగాలులు వస్తుండటంతో మే 21 తేదీ నుంచి ఎండల తీవ్రత పెరిగింది. ద్రోణి, ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం ఏర్పడకపోవడంతో ఉష్ణోగ్రతలు అసాధారణ స్థాయికి పెరిగాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, నిజామాబాద్‌, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ఈ వేడి గాలుల ప్రభావం ఎక్కువగా ఉంది. సోమవారం నుంచి ఎండల తీవ్రత కాస్త తగ్గుముఖం పడుతుంది. మళ్లీ తొలకరి వర్షాలకు రెండు, మూడు రోజుల ముందు ఎండలు ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత నైరుతి రుతు పవనాల ప్రవేశంతో ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయి.


అత్యధిక ఉష్ణోగ్రతలు ఎక్కడ రికార్డయ్యాయి?

ప్రస్తుత ఎండాకాలం సీజన్‌లో 9 రోజులే వడగాలులు వచ్చాయి. సాధారణ ఉష్ణోగ్రత కంటే 5డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావటంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ సీజన్‌లో అత్యధికంగా ఆదిలాబాద్‌లో 46.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. 


రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయి?

ప్రస్తుతం క్యుములోనింబస్‌ మేఘాలు ఏర్పడ్డాయి. పశ్చిమ మధ్య అరేబియా సముద్రంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారి రెండు రోజులకు బలహీనపడుతుంది. ఉపరితల ద్రోణి కారణంగా ఈ రెండు, మూడు రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. 


గాలిలో తేమశాతం ఎలా ఉంది? 

పొడి వాతావరణం ఉన్నపుడు గాలిలో తేమ శాతం తగ్గిపోతుంది. ఆదిలాబాద్‌లో 46.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనప్పుడు తేమ శాతం 20కి తగ్గిపోయింది. హైదరాబాద్‌లో అది 22-24 వరకు ఉంది. పది రోజుల నుంచి తేమ శాతం 20 నుంచి 30 మఽధ్యే ఉంది. ఇప్పుడు క్యుములోనింబస్‌ మేఘాలు ఏర్పడటంతో గాలిలో తేమశాతం పెరుగుతోంది.


రాష్ట్రంలోకి రుతుపవనాలు ఎప్పుడు వస్తాయి?

జూన్‌ ఒకటో తేదీన కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకే అవకాశాలు ఉన్నాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటే అక్కడి నుంచి 8 నుంచి 9 రోజుల్లో తెలంగాణ చేరుకుంటాయి. జూన్‌ పదో తేదీ నుంచి వాతావరణంలో పూర్తిగా మార్పు వస్తుంది. జూన్‌ రెండో వారంలో రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించి, విస్తరించే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.


ఈ సీజన్‌లో వర్షపాతం ఎంత నమోదవుతుంది?

నిరుడు రుతుపవనాలు ఆలస్యంగా వచ్చినప్పటికీ సాధారణ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. రుతుపవనాల నిష్క్రమణ ఆలస్యంగా జరగడంతో ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఈ సారి సకాలంలోనే అటు కేరళకు, ఇటు రాష్ట్రానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది వర్షపాతం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సాధారణ వర్షపాతమే నమోదవుతుంది.

Updated Date - 2020-05-31T08:26:01+05:30 IST