వారం తర్వాతే నైరుతి కదలికలు

ABN , First Publish Date - 2021-06-24T09:22:07+05:30 IST

‘‘నైరుతి రుతు పవనాల దిశ మారిపోయింది. ఉత్తరాది వైపు గాలులు వెళ్లటంతో ఇక్కడి వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. బంగాళాఖాతంలో అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనాలు లేవు.

వారం తర్వాతే నైరుతి కదలికలు

  • గాలుల దిశ మారడంతో ఉత్తరాదికి రుతు పవనాలు
  • అల్పపీడనం ఏర్పడితే వర్షాలు
  • హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ నాగరత్న


హైదరాబాద్‌, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): ‘‘నైరుతి రుతు పవనాల దిశ మారిపోయింది. ఉత్తరాది వైపు గాలులు వెళ్లటంతో ఇక్కడి వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. బంగాళాఖాతంలో అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనాలు లేవు. అందుకే తేలికపాటి నుంచి మోస్తరు మినహా భారీ వర్షాలు కురవడం లేదు. వారం రోజుల వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. తర్వాత నైరుతి రుతుపవనాలు ఇటువైపు వస్తే వర్షాలు కురిసే అవకాశం ఉంది’’ అని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ డాక్టర్‌ కె.నాగరత్న అన్నారు. నైరుతి మందగమనం నేపథ్యంలో ఆమె ‘ఆంధ్రజ్యోతి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.


రుతు పవనాల ప్రభావం రాష్ట్రంపై ఎలా ఉంది?

ఈనెల 5న రాష్ట్రంలోకి నైరుతి రుతు పవనాలు ప్రవేశించాయి. 18,19 వరకు బలంగా ఉన్నాయి. చాలా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. సాధారణానికి మంచి వర్షపాతం నమోదైంది. జూన్‌ నెల రాష్ట్ర సగటు వర్షపాతంతో పోలిస్తే 57 శాతం అధికంగా నమోదైంది. అయితే తెలంగాణ వైపు వీచే గాలుల దిశ మారిపోయింది. నైరుతి రుతు పవనాలు రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయి. ఉత్తరాది రాష్ట్రాల వైపు నైరుతి గమనం ఉండటంతో ఇక్కడ భారీ వర్షాలు లేవు. 


వర్షాలు పడకపోవటానికి కారణం?

బంగాళాఖాతంలో అల్పపీడనాలు లేవు. ద్రోణులు, ఉపరితల ఆవర్తనాలు ఏర్పడటం లేదు. నైరుతి రుతుపవనాలు ఇక్కడ బలహీనంగా మారాయి. గాలుల దిశ కూడా మారింది. రుతుపవనాలు ఉత్తరాది రాష్ట్రాల వైపు వెళ్లిపోయాయి. ఉత్తర భారతంలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇక్కడి వాతావరణం పొడిగా మారింది.


వానాకాలంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరడం ఏమిటి?

వానాకాలంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగిపోవటం గతంలోనూ ఉంది. ఇటీవల నల్లగొండలో 40 డిగ్రీలు నమోదైంది. మిగిలిన జిల్లాల్లో కూడా 33-36 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నైరుతి రుతు పవనాల గమనం మారితే వాతావరణం చల్లబడుతుంది.


రుతుపవనాలు ఎప్పుడొచ్చే అవకాశం ఉంది?

ప్రస్తుతం ఉత్తర భారతదేశంలో నైరుతి రుతు పవనాలు బలంగా, చురుగ్గా ఉన్నాయి. అవి దక్షిణాది వైపు మళ్లితే ఇక్కడ అనుకూల వాతవరణం ఏర్పడుతుంది. నైరుతి బలంగా మారితేనే పరిస్థితి చక్కబడుతుంది. బంగాళాఖాతంలో మార్పులు వచ్చి, ఉపరితల ఆవర్తనాలు, ఆవర్తణ ద్రోణులు, అల్పపీడనాలు ఏర్పడితేనే ఇక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. వారం రోజుల తర్వాతే పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశం ఉంది. జూలై మొదటి వారంలో నైరుతి రుతు పవనాల ప్రభావం తెలంగాణపై బలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి.


ఈ సీజన్‌లో వర్షపాతం ఎలా ఉంటుంది?

ఈ సీజన్‌లో వర్షపాతానికి ఎలాంటి ఢోకా లేదు. సాధారణ వర్షపాతం తప్పనిసరిగా నమోదవుతుంది. అంతకుమించి కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. జూలై, ఆగస్టులో భారీ వర్షాలు కురుస్తాయి. బంగాళాఖాతంలో అల్ప పీడనాలు, ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు ఏర్పడుతాయి. ఇక ఒక ప్రదేశంలో 2.5 మి.మీ వర్షపాతం కంటే ఎక్కువ నమోదైతే దానిని ‘రెయినీ డే’ కింద పరిగణిస్తాం. ఈసారి కూడా రెయినీ డేస్‌(వర్షం కురిసే రోజులు) ఎక్కువగానే ఉంటాయి. ఇప్పుడు నైరుతి మందగమనంగా ఉందని అన్నదాతలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. రాబోయే రోజుల్లో ఆశించిన వర్షపాతం నమోదవుతుంది.

Updated Date - 2021-06-24T09:22:07+05:30 IST