సౌత్‌ వైసీపీలో లుకలుకలు

ABN , First Publish Date - 2022-06-25T06:32:57+05:30 IST

సౌత్‌ వైసీపీలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి.

సౌత్‌ వైసీపీలో లుకలుకలు
బీచ్‌రోడ్డులో వైఎస్‌ఆర్‌ విగ్రహం వద్ద సౌత్‌ వైసీపీ కార్పొరేటర్లు

ప్లీనరీకి పలువురు నేతలు, ఎనిమిది కార్పొరేటర్లు గైర్హాజరు

వారిని కొన్ని శక్తులు తప్పుదారి పట్టిస్తున్నాయని ఎమ్మెల్యే వాసుపల్లి ఆరోపణ 

ఆయన వైసీపీని నాశనం చేసేందుకే వచ్చినట్టున్నారు

బీచ్‌రోడ్డులో మీడియాతో కార్పొరేటర్లు

అధిష్ఠానానికి పరిశీలకుడు తైనాల విజయకుమార్‌ నివేదిక


మహారాణిపేట, జూన్‌ 24:

సౌత్‌ వైసీపీలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. శుక్రవారం జిల్లా పరిషత్‌ జంక్షన్‌లోని అంకోసా హాలులో నిర్వహించిన దక్షిణ నియోజకవర్గ పార్టీ ప్లీనరీ సమావేశానికి పెద్ద నాయకులు, ఒకరు మినహా మిగిలిన కార్పొరేటర్లు గైర్హాజరయ్యారు. మత్స్యకార నాయకుడు కోలా గురువులు, ద్రోణంరాజు శ్రీనివాస్‌ కుమారుడు శ్రీవాత్సవ్‌, జాన్‌ వెస్లీ, బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ సీతంరాజు సుధాకర్‌, కనకమహాలక్ష్మి అలయం ట్రస్టుబోర్టు చైర్‌పర్సన్‌ కొల్లి సింహాచలం....తదితరులు ప్లీనరీకి హాజరుకాలేదు. దీనికి వారు వ్యక్తిగత కారణాలు చూపిస్తున్నా రాజకీయ విభేదాలే ప్రధాన కారణమన్నది అందరికీ తెలిసిన రహస్యం. 

కార్పొరేటర్ల రాకపోవడంపై సమావేశంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ మాట్లాడుతూ అనేక మంది ఉసురు పోసుకొని వారికి టిక్కెట్లు ఇచ్చానని, కానీ వారు ఈ విధంగా చేయడం భావ్యం కాదని అన్నారు. సుమారు వందసార్లు తానే స్వయంగా ఫోన్‌ చేసి వారిని ఆహ్వానించానని అయినా రాకపోవడం విచారకరమన్నారు. కార్పొరేటర్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ బాగా పనిచేస్తున్నారని, కానీ వారిని కొన్ని శక్తులు తప్పుదారి పట్టిస్తున్నాయని వాసుపల్లి ఆరోపించారు. ప్రజలకు, పార్టీకి సేవలు అందించేందుకు నియోజకవర్గ సమన్వయకర్తగా తనను ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి నియమించారన్నారు. దక్షిణ నియోజకవర్గంలో పార్టీ జెండా ఎగిరేలా చేస్తానని, అప్పుడు అందరూ ఈ గూటికే వస్తారన్నారు. సమావేశంలో ప్లీనరీ పరిశీలకునిగా తైనాల విజయ్‌కుమార్‌, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, నాయకులు ఎస్‌ఏ రహమాన్‌, కొండా రమాదేవి, కొండా రాజీవ్‌, వార్డుల అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు. 


ఎమ్మెల్యే మాకు గౌరవం ఇవ్వడం లేదు

ప్లీనరీకి గైర్హాజరైన కార్పొరేటర్లు ఉరుకూటి నారాయణరావు (29వ వార్డు),  కోడూరు అప్పల రత్నం (30వ వార్డు), బిపిన్‌కుమార్‌ జైన్‌ (31వ వార్డు), కందుల నాగరాజు (32వ వార్డు), తోట పద్మావతి (34వ వార్డు), విల్లూరు భాస్కరరావు (35వ వార్డు),చెన్నా జానకీరామ్‌ (37వ వార్డు), మహ్మద్‌ సాదిక్‌ (39వ వార్డు) బీచ్‌రోడ్డులోని వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహం వద్దకు వెళ్లి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ వాసుపల్లి గణేష్‌కుమార్‌ తమ మాటకు గౌరవం ఇవ్వడం లేదన్నారు. నియోజకవర్గంలో ఆయనే ఒక్కరే నాయకునిగా వుండాలని కోరుకుంటున్నారని, మరో వ్యక్తి తిరిగితే భరించలేక ఏకంగా రాజీనామా చేసేంత వరకూ వెళ్లారన్నారు. అదేవిధంగా తమను వార్డులో  సుప్రీంగా గుర్తించాలన్నారు. కార్పొరేటర్‌ల అభీష్టానికి వ్యతిరేకంగా అధ్యక్షులను నియమిస్తూ గ్రూపులు  సృష్టిస్తున్నారని ఆరోపించారు. వాసుపల్లి నియోజకవర్గంలో  వైసీపీని బలోపేతం చేసేందుకు కాకుండా నాశనం చేసేందుకు వచ్చినట్టు వున్నదని ఆరోపించారు. పార్టీలో మరింత మంది నాయకులు తమకు మద్దతుగా కలసి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, ఇది ఇక్కడతో ఆగదని అన్నారు


పార్టీకి నివేదిక

దక్షిణ నియోజకవర్గం పరిశీలకులైన తైనాల విజకుమార్‌ ప్లీనరీపై అధిష్ఠానానికి నివేదిక పంపుతున్నట్టు తెలిసింది. ప్లీనరీ ఏర్పాట్లు, వ్యూహం గురించి మాట్లాడేందుకు ఆయన ఒకరోజు ముందు వాసుపల్లిని కలిసేందుకు యత్నించగా, ప్రత్యేక భేటీ ఏదీ అవసరం లేదని, నేరుగా సమావేశానికి రావలసిందిగా చెప్పినట్టు తెలిసింది. నియోజకవర్గ స్థాయి నాయకులతో పాటు వార్డు కార్పొరేటర్లు కూడా చాలా మంది గైర్హాజరు కావడంపై ఆయన కూడా కాసింత విస్మయానికి గురయ్యారు. శుక్రవారం సాయంత్రం పలువురు నాయకులు ఆయన్ను కలిసి, వాసుపల్లి తమను గౌరవించడం లేదని అందుకే రాలేదని వివరణ ఇచ్చుకున్నారు. అయితే ఎమ్మెల్యేపై కోపం ఉంటే వేరే విధంగా చూసుకోవాలే తప్ప, ఇలా పార్టీ ప్లీనరీకి రాకపోవడం సరైన విధానం కాదని వారికి చెప్పినట్టు తెలిసింది. ఏమి జరిగిందో అది తాను అధిష్ఠానానికి నివేదిక ఇస్తామని ఆయన స్పష్టంచేసినట్టు సమాచారం. 



Updated Date - 2022-06-25T06:32:57+05:30 IST