అభివృద్ధి చెందుతున్న దేశాలు సహకరించుకోవాలి : ఎస్ జైశంకర్

ABN , First Publish Date - 2021-04-13T22:16:42+05:30 IST

అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య మానవతావాద సహకారం తప్పనిసరి

అభివృద్ధి చెందుతున్న దేశాలు సహకరించుకోవాలి : ఎస్ జైశంకర్

న్యూఢిల్లీ : అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య మానవతావాద సహకారం తప్పనిసరి అని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చెప్పారు. రైజినా డయలాగ్, 2021 వర్చువల్ సమావేశంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ, అభివృద్ధి చెందుతున్న దేశాలు కొంత కాలంగా పరస్పరం సహకరించుకుంటున్నాయన్నారు. విస్తృత ప్రపంచీకరణ నేపథ్యంలో ఇటువంటి ఆకర్షణీయమైన పదాలను ఆచరణాత్మక కార్యక్రమాలుగా మార్చడం చాలా ముఖ్యమని చెప్పారు. 


ప్రపంచంలో అనేక దేశాలకు కోవిడ్-19 నిరోధక వ్యాక్సిన్లను భారత దేశం అందజేసిందన్నారు. ఈ మహమ్మారికి పూర్వం కూడా భారత దేశం మానవీయ సహాయం, విపత్తు నిరోధక సహాయం వివిధ దేశాలకు అందజేసిందని గుర్తు చేశారు. ఈ ప్రపంచమంతా ఒకే కుటుంబం అని భారత దేశం విశ్వసిస్తుందని, ఆ విశ్వాసాన్ని ఆచరణలో చూపుతోందని తెలిపారు. 


రైజినా డయలాగ్ అంటే...

భౌగోళిక రాజకీయాలు, భౌగోళిక ఆర్థిక వ్యవస్థలపై భారత దేశం 2016 నుంచి రైజినా డయలాగ్‌ను నిర్వహిస్తోంది. భారత దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ది అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ సంయుక్తంగా దీనిని నిర్వహిస్తున్నాయి. ఈ ఏడాది జరిగే చర్చల ప్రారంభ సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రువాండా అధ్యక్షుడు పాల్ కగమే, డెన్మార్క్ ప్రధాన మంత్రి మెట్టె ఫ్రెడరిక్సెన్ పాల్గొంటారు. పాల్ కగమే, మెట్టె ఫ్రెడరిక్సెన్ రైజినా డయలాగ్, 2021కు ముఖ్య అతిథులు. తదుపరి సెషన్స్‌లో ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మారిసన్ పాల్గొంటారు. స్వీడన్ మాజీ ప్రధాని కార్ల్ బిల్డిట్, ఆస్ట్రేలియా మాజీ ప్రధాని ఆంథోనీ అబ్బాట్, న్యూజిలాండ్ మాజీ పీఎం హెలెన్ క్లార్క్ కూడా హాజరవుతారు. అంతేకాకుండా పోర్చుగల్, స్లోవేనియా, రుమేనియా, సింగపూర్, నైజీరియా, జపాన్, ఇటలీ, స్వీడన్, ఆస్ట్రేలియా, కెన్యా, చిలీ, మాల్దీవులు, ఇరాన్, కతార్, భూటాన్ దేశాల విదేశాంగ మంత్రులు హాజరవుతారు. 


‘‘#వైరల్‌వరల్డ్ : ఔట్‌బ్రేక్స్, ఔట్‌లయర్స్ అండ్ ఔట్ ఆఫ్ కంట్రోల్’’ అనే ఇతివృత్తంతో రైజినా డయలాగ్, 2021ను నిర్వహిస్తున్నారు. ఈ చర్చలు ఈ నెల 13 నుంచి 16 వరకు జరుగుతాయి. 


వ్యాక్సిన్ మైత్రి కార్యక్రమంలో భాగంగా మన దేశం 83 దేశాలకు కోవిడ్-19 నిరోధక వ్యాక్సిన్లను పంపించింది. మొత్తం 6.45 కోట్ల వ్యాక్సిన్లను అందజేసింది. ఈ వ్యాక్సిన్లు మన దేశంలోనే తయారయ్యాయి. 


Updated Date - 2021-04-13T22:16:42+05:30 IST