Marriage: దక్షిణ కొరియా యువతితో తమిళ యువకుడి వివాహం
ABN , First Publish Date - 2022-09-08T13:59:22+05:30 IST
తిరుపత్తూరు జిల్లాకు చెందిన యువకుడు దక్షిణ కొరియాకు చెందిన యువతిని పెద్దల అంగీకారంతో ప్రేమవివాహం(love marriage)
చెన్నై, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): తిరుపత్తూరు జిల్లాకు చెందిన యువకుడు దక్షిణ కొరియాకు చెందిన యువతిని పెద్దల అంగీకారంతో ప్రేమవివాహం(love marriage) చేసుకున్నాడు. వీరి వివాహం వాణియంబాడిలో వైభవంగా జరిగింది. తిరుపత్తూరు జిల్లా వెల్లకుట్టై ప్రాంతానికి చెందిన ప్రవీణ్‌కుమార్ కోయంబత్తూరులోని ప్రైవేటు కళాశాలలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివి ఉన్నత విద్యకోసం దక్షిణ కొరియాకు వెళ్ళాడు. అక్కడే పీహెచ్డీ పూర్తిచేసి ప్రైవేటు సంస్థలో అసిస్టెంట్ మేనేజర్(Assistant Manager)గా పనిచేస్తున్నాడు. మూడేళ్ల క్రితం సేంగ్వాన్మున్ అనే యువతితో అతడికి ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. వీరి ప్రేమకు ఇరువైపు కుటుంబీకులు పచ్చజెండా ఊపారు. వాణియంబాడి గిరిసముద్రంలోని కల్యాణమండపంలో బుధవారం ఉదయం హిందూ సంప్రదాయం ప్రకారం బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం వైభవంగా జరిగింది.