దక్షిణ కొరియాలో కరోనా సోకిన 27 మందికి రెమ్డిసివిర్‌ను ఇంజెక్ట్ చేయగా..

ABN , First Publish Date - 2020-07-14T03:24:44+05:30 IST

దక్షిణ కొరియాలో కరోనా రోగులకు చికిత్సలో భాగంగా అందిస్తున్న..

దక్షిణ కొరియాలో కరోనా సోకిన 27 మందికి రెమ్డిసివిర్‌ను ఇంజెక్ట్ చేయగా..

సియోల్: దక్షిణ కొరియాలో కరోనా రోగులకు చికిత్సలో భాగంగా అందిస్తున్న యాంటీ వైరల్ డ్రగ్ రెమ్డిసివిర్ ఆశాజనకమైన ఫలితాలనిస్తోంది. దక్షిణ కొరియాలో కరోనా సోకి పరిస్థితి విషమంగా ఉన్న వారికి రెమ్డిసివిర్ ఇంజెక్ట్ చేయగా.. ప్రతీ ముగ్గురిలో ఒకరు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడుతున్నట్లు అక్కడి హెల్త్ అథారిటీస్ స్పష్టం చేశాయి. అయితే.. ఇది కేవలం రెమ్డిసివిర్ వల్లనేనా లేక రోగుల రోగ నిరోధక శక్తి, ఇతర కారణాల వల్ల కోలుకుంటున్నారా అనే అంశంపై మరింత పరిశోధన చేయాల్సిన అవసరం ఉందని తెలిపాయి. యాంటీ వైరల్ డ్రగ్ రెమ్డిసివిర్‌ను కరోనా సోకి పరిస్థితి విషమంగా ఉన్నవారికి అత్యవసర మందుగా చాలా దేశాలు వినియోగిస్తున్నాయి.


రెమ్డిసివిర్ పనితీరుకు సంబంధించి ‘ది కొరియా సెంటర్స్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్’(కేసీడీసీ) శనివారం కీలక విషయాన్ని బయటపెట్టింది. కొరియాలో కరోనా సోకి పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న 27 మందికి రెమ్డిసివిర్‌ను ఇంజక్ట్ చేశామని, ఈ 27 మందిలో 9 మంది ఆరోగ్య పరిస్థితి రెమ్డిసివిర్ ఇచ్చిన తర్వాత మెరుగైందని స్పష్టం చేసింది. 15 మందిలో ఎలాంటి మార్పు కనిపించలేదని కేసీడీసీ తెలిపింది.


ఇదిలా ఉంటే.. దక్షిణ కొరియా జూన్‌లోనే తమకు తగినంత రెమ్డిసివిర్‌ను సప్లయ్ చేయాలని గిలీడ్ సైన్సెస్‌ను కోరింది. దక్షిణ కొరియా ఇతర దేశాలతో పోల్చుకుంటే.. కరోనాతో విజయవంతంగా పోరాడుతోంది. ఆదివారం కొత్తగా 62 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి. దక్షిణ కొరియాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13,479. మరణాల సంఖ్య 289.

Updated Date - 2020-07-14T03:24:44+05:30 IST