కరోనా కట్టడిలో దక్షిణ కొరియా టాప్... అనుసరించిన విధానం ఇదే!

ABN , First Publish Date - 2020-09-29T13:04:43+05:30 IST

ప్రపంచంలోని దేశాలన్నీ కరోనా వైరస్ బారినడి, దానిని కట్టడి చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నాయి. అయితే దక్షణ కొరియా కరోనా కట్టడి విషయంలో అనుసరిస్తున్న విధానం అన్ని దేశాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. దక్షిణ కొరియాలో...

కరోనా కట్టడిలో దక్షిణ కొరియా టాప్... అనుసరించిన విధానం ఇదే!

సియోల్: ప్రపంచంలోని దేశాలన్నీ కరోనా వైరస్ బారినడి, దానిని కట్టడి చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నాయి. అయితే దక్షణ కొరియా కరోనా కట్టడి విషయంలో అనుసరిస్తున్న విధానం అన్ని దేశాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. దక్షిణ కొరియాలో ఏప్రిల్ నుంచి ఇప్పటివరకూ కేవలం రోజుకు 77 కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. ఇదే విధానాన్ని అమెరికా అనుసరించి ఉంటే అక్కడ రోజుకు కేవలం 480 కేసులు మాత్రమే నమోదయ్యేవి. అయితే అమెరికాలో రోజుకు 38 వేల కేసులు నమోదవుతున్నాయి. మీడియాకు అందిన సమాచారం ప్రకారం దక్షిణ కొరియా కరోనా కట్టడిలో ప్రపంచానికే మోడల్‌గా మారింది. దక్షిణ కొరియాలో కరోనా మరణాలు కూడా చాలా తక్కువగానే ఉన్నాయి. అందుకే ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు విఘాతం కలగలేదు. 



దక్షిణ కొరియాలో జరిగినన్ని కరోనా టెస్టులు ఇతర ఏ దేశంలోనూ జరగలేదు. సౌత్ కొరియా జనాభా 5.16 కోట్లు. అమెరికా జనాభా 32.82 కోట్లు. అంటే సౌత్ కొరియా కన్నా అమెరికా జనాభా ఆరు రెట్లు అధికం. దక్షిణ కొరియాలో కరోనా కేసులు 23 వేలను దాటాయి. అమెరికాలో కరోనా కేసులు 73 లక్షలు దాటాయి. కేసుల పరంగా చూస్తే దక్షిణ కొరియా కన్నా అమెరికాలో కరోనా కేసులు 309 రెట్లు అధికంగా ఉన్నాయి. దక్షిణ కొరియాలో కరోనా కారణంగా 400 మంది మృత్యువాత పడగా, అమెరికాలో 2 లక్షల 9 వేలకు పైగా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ కొరియాలో కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రారంభంలోనే దానిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు టెస్టింగ్ కిట్లను సిద్ధం చేశారు. కరోనా కేసులు కనిపించిన వెంటనే ఆ ప్రాంతంలోని వారిని అప్రమత్తం చేశారు. మాస్కులు తగినన్ని అందుబాటులో లేని సమయంలో ప్రభుత్వమే రంగంలోకి దిగి, మాస్కులను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసింది. అక్కడి కేంద్ర ఆరోగ్య విభాగం రోజుకు రెండుసార్లు కరోనా పరిస్థితులపై సమీక్షలు నిర్వహించి, ప్రజలకు వ్యాధిపై మరింతగా అవగాహన కల్పించింది. దేశంలోని ప్రతీ వ్యక్తీ మాస్క్ ధరించేలా ప్రోత్సహించింది. వ్యాధి సోకిన ప్రతీ ఒక్కరినీ ఆసుపత్రులకు వెంటనే తరలించింది.


ప్రభుత్వం బాధితులకు ఉచితంగా చికిత్స అందించింది. ఫలితంగా దక్షిణ కొరియాలో లాక్‌డౌన్ విధించాల్సిన పరిస్థితులు తలెత్తలేదు. రెస్టారెంట్లు, ఇతర వ్యాపార వ్యవస్థలు పనిచేస్తూనే ఉండటంతో దేశ ఆర్థిక పరిస్థితిపై కరోనా ప్రభావం అంతగా పడలేదు. కరోనా కట్టడి విషయంలో సమర్థవంతమైన చర్యలు తీసుకుంటున్న దక్షిణ కొరియాను ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అభినందింది. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన గ్లోబల్ అవుట్‌బ్రేక్ అలర్ట్ అండ్ రెస్పాన్స్ నెట్ వర్క్ చైర్మన్ డెలె ఫిషర్ మాట్లాడుతూ కరోనా కట్టడి విషయంలో దక్షిణ కొరియా అనుసరించిన విధానాలను ఏ దేశం కూడా అనుసరించలేదని అన్నారు. కరోనా వైరస్‌ను సమూలంగా నాశనం చేయాల్సిన అవసరం లేదని, దాని మధ్య జీవించే విధానాన్ని అలవరచుకోవలసిన అవసరం ఉందన్నారు. 

Updated Date - 2020-09-29T13:04:43+05:30 IST