144 Section: దక్షిణకన్నడలో ఆంక్షల తొలగింపు

ABN , First Publish Date - 2022-08-09T17:24:24+05:30 IST

దక్షిణకన్నడ జిల్లాలో బీజేపీ(BJP) యువ నాయకుడు ప్రవీణ్‌ నెట్టారుతోపాటు ముగ్గురు హత్యలతో జిల్లా వ్యాప్తంగా ప్రకటించిన ఆంక్షలను తొలగించారు

144 Section: దక్షిణకన్నడలో ఆంక్షల తొలగింపు

- 144 సెక్షన్‌ కొనసాగింపు 

- ప్రవీణ్‌ నెట్టారు హత్య కేసులో మరో ఇద్దరి అరెస్టు


బెంగళూరు, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): దక్షిణకన్నడ జిల్లాలో బీజేపీ(BJP) యువ నాయకుడు ప్రవీణ్‌ నెట్టారుతోపాటు ముగ్గురు హత్యలతో జిల్లా వ్యాప్తంగా ప్రకటించిన ఆంక్షలను తొలగించారు. 144వ సెక్షన్‌(Section 144)ను మాత్రం మరికొన్ని రోజులు కొనసాగిస్తామని ఆ జిల్లా అధికారి రాజేంద్ర కేవీ తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతలు సాధారణ స్థితికి వచ్చాయని, అందుకే ఆంక్షలు తొలగించామని పేర్కొన్నారు. వ్యాపారాలు, ప్రజల సంచారం సాధారణంగా ఉంటుందన్నారు. ఈనెల 14వరకు నిషేధాజ్ఞలు ఉంటాయన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఐదుగురికి మించి సంచరించరాదన్నారు. ఇదే విషయమైన నగర పోలీస్‌ కమిషనర్‌ శశికుమార్‌(City Police Commissioner Sasikumar) మాట్లాడుతూ బహిరంగంగా ప్రజలు సంచరించే విషయంలో వెసులుబాటు ఇచ్చామని, కానీ రాత్రివేళల్లో అనవసరంగా ఎవరూ బయటకు రాకూడదన్నారు. అత్యవసరమైతే తప్పు లేదని, ద్విచక్రవాహనాల్లో డబుల్‌ రైడింగ్‌ ఇంకా నిషేధమే అన్నారు. బీజేపీ యువ నాయకుడు ప్రవీణ్‌ నెట్టారు హత్యకేసుతో సంబంధం ఉన్న మరో ఇద్దరిని అరెస్టు చేశామన్నారు. సుళ్య తాలూకా నావూరు నివాసి అబీద్‌ (22), బెళ్లారె సమీపంలోని గౌరిహూళ నివాసి నౌపాల్‌ను అరెస్టు చేశామన్నారు. ఈకేసులో ఇంతవరకు ఆరుగురు అరెస్టయ్యారు. కాగా పోలీసుల విచారణలో భయంకరమైన విషయాలు వెలుగుచూశాయి. ప్రవీణ్‌ నెట్టారును హతమార్చేందుకు రెండుసార్లు విఫలప్రయత్నాలు చేసినట్టు నిందితులు విచారణలో వెల్లడించినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. జూలై 23, 24 తేదీల్లో ప్రయత్నించగా చికెన్‌స్టాల్‌(Chicken stall)లో కొనుగోలుదారులు ఎక్కువమంది ఉన్నందున వెనుకడుగు వేసినట్టు తేలింది. మూడోసారి పథకం ప్రకారం అమలు చేశామని నిందితులు అంగీకరించినట్టు పోలీసుల విచారణలో తెలిసింది.

Updated Date - 2022-08-09T17:24:24+05:30 IST